పన్ను..కష్టాలు!

ABN , First Publish Date - 2022-09-19T04:59:11+05:30 IST

మునిసిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. ఇది సిబ్బందికి తలనొప్పిగా మారింది.

పన్ను..కష్టాలు!

భీమవరం మునిసిపాలిటీకి కొత్త సమస్య
విలీన గ్రామాల్లోనూ వసూలు చే యాల్సిందే : మునిసిపల్‌ శాఖ ఆదేశం
నాలుగు గ్రామాల్లో ఆస్తి పన్ను విలువ రూ.3.50 కోట్లు
గ్రామాల ఆస్తులను ఆన్‌లైన్‌ చేయడంతో వచ్చిన చిక్కు
చేతులెత్తేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది


మునిసిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. ఇది సిబ్బందికి తలనొప్పిగా మారింది. మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనమే అందుకు నిదర్శనం. భీమవరం పురపాలక సంఘంలో సిబ్బంది ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మునిసిపల్‌ శాఖ నిర్ధారించించిన రెవెన్యూ ఆదాయాన్ని భర్తీ చేయలేక తంటాలు పడుతున్నారు. ఒకప్పుడు ఆస్తిపన్ను వసూళ్లలో మెరుగైన స్థానంలో ఉన్న భీమవరం మునిసిపాలిటీ ఇప్పుడు అథమ స్థానానికి పడిపోతోంది.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరం మునిసిపాలిటీ పరిధిలో విలీనం చేసిన కొవ్వాడ, తాడేరు, రాయలం, చినఅమిరం గ్రామాలు ఇప్పుడు సమస్యాత్మకంగా  మారాయి. ఆ గ్రామాల పరిధిలో ఆస్తిపన్నును మునిసిపాలిటీ ఆన్‌లైన్‌ చేసింది. దానిని   వసూలు చేయాలంటూ మునిసిపల్‌ శాఖ ఆదేశాలిస్తోంది. వాస్తవానికి భీమవరం మునిసిపాలిటీలో ఏటా రూ.18 కోట్లు ఆస్తి పన్ను వసూలవుతోంది. దాదాపు 99 శాతం మేర వసూలు చేయగలుగుతున్నారు. నాలుగు గ్రామ పంచాయతీలను విలీనం చేసిన తర్వాత అదనంగా రూ.3.50 కోట్లు ఆస్తిపన్ను కలిసినట్టు మునిసిపల్‌ శాఖ లెక్కల్లో తేలింది. అంటే భీమవరం మునిసిపాలిటీ రూ. 21.50 కోట్లు వసూలు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామాల విలీన ప్రక్రియ పూర్తయ్యింది. క్షేత్ర స్థాయిలో అది అమలుకు నోచుకోవడం లేదు. ఆస్తి పన్ను వసూళ్లు పంచాయతీలే నిర్వహిస్తున్నాయి. వాటి పరిధిలోనే ఖర్చు పెట్టుకుంటున్నాయి. విలీన నాలుగు గ్రామాలపైనా పంచాయతీరాజ్‌ అజమాయిషీ ఉంటోంది. అయితే మునిసిపల్‌ శాఖ లెక్కలో అవి విలీనమైనట్టే లెక్క. దాంతో ఆస్తి పన్ను డిమాండ్‌కు తగ్గట్టుగా వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీలే వసూలు చేస్తుండడంతో మునిసిపాలిటీకి ఇబ్బందికరంగా మారింది. రెవెన్యూ వసూళ్లలో భీమవరం మునిసిపాలిటీ గ్రాఫ్‌ పడిపోయింది. జిల్లాలోని ఇతర మునిసి పాలిటీల్లోనూ సమీప గ్రామాలు విలీనం చేసినా ఇటువంటి సమస్య లేదు. గ్రామాల్లో ఆస్తిపన్నును సదరు మునిసిపాలిటీలు ఆన్‌లైన్‌ చేయలేదు. భీమవరం మునిసిపాలిటీ కాస్త ఆసక్తి ప్రదర్శించింది. రాయలం, చినఅమిరం, కొవ్వాడ, తాడేరు గ్రామాల్లో ఆస్తిపన్నును ఆన్‌లైన్‌ చేసుకుంది. అదే ఇప్పుడు  సమస్యగా వెంటాడుతోంది. లక్ష్యాన్ని చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

పట్టించుకోని పంచాయతీరాజ్‌
భీమవరంలో విలీనం చేయకూడదంటూ చినఅమిరం గ్రామస్థులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిగిలిన మూడు గ్రామాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు. వాటిని మున్సిపాలిటీకి దాఖలు పరచాలంటూ జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులపై ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ జిల్లా పంచాయతీ అధికారులు చెబుతున్నారు. పంచా యతీ రాజ్‌ కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు విలీనం చేయలేమంటూ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మునిసిపల్‌ శాఖ నుంచి భీమవరం మునిసిపల్‌ సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది.

చెత్త పన్ను వసూళ్లు పట్టణంలోనే..
 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను వసూళ్లు ప్రారంభించింది. పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు వాహనాలను సమకూర్చింది. వాటికోసం ప్రతినెలా మునిసిపాలిటీలు సొమ్ములు చెల్లించాలి. ఒక్కో వాహనానికి కనిష్ఠంగా రూ. 40 వేలు ఇవ్వాలి. అందుకోసం పన్ను వసూలు చేసే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. లక్ష్యం చేరుకోవడానికి అన్ని మునిసిపాలిటీల్లోనూ ప్రతినెలా ఆపసోపాలు పడుతున్నారు. పూర్తిస్థాయిలో వసూలు చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో  విలీన గ్రామాల్లో  చెత్త పన్ను వసూళ్లను కూడా భీమవరం మునిసిపాలిటీ నిర్వహించాల్సిందేనంటూ మునిసిపల్‌ శాఖ ఆదేశి
స్తోంది. అదే ఇప్పుడు మునిసిపాలిటీకి ప్రాణసంకటంగా మారింది. విలీన గ్రామాలకు చెత్త వాహనాలు సమకూర్చలేదు. ఆస్తి పన్ను వసూలు చేయలేక పోతున్నారు. పాలన అంతా పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అటువంటిది మునిసిపాలిటీ చెత్త పన్ను వసూలు చేయడం సాధ్యమయ్యే పనికాదు. కానీ మునిసిపల్‌ శాఖ లెక్కల ప్రకారం భీమవరం మునిసిపాలిటీ చెత్త పన్ను వసూలు చేయాల్సిందే.

కార్పొరేషన్‌పై ప్రభావం
పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరం కేంద్రమైన తర్వాత కార్పొరేషన్‌ స్థాయికి చేర్చాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. సమీప గ్రామాలు విలీనం అయితేనే అది సాధ్యపడుతుంది. పట్టణ జనాభా పెరుగుతుంది. ఆదాయం అధికమవుతుంది. కార్పొరేషన్‌ చేయాలంటే మౌలిక వసతులు, ఆదాయ వనరులు, జనాభాను పరిగణలోకి తీసుకుంటారు. కానీ నాలుగు గ్రామాలు విలీనం కాకుంటే ఇప్పుడు కార్పొరేషన్‌ కావాలన్న కష్టమే నన్న భావనలో మునిసిపల్‌ అధికారులున్నారు. మొత్తానికి అటు పంచాయతీరాజ్‌, ఇటు మునిసిపల్‌ శాఖల మధ్య సమన్వయ లోపంతో క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు నలుగుతున్నారు.

Updated Date - 2022-09-19T04:59:11+05:30 IST