అమ్మా.. మమ్మల్ని కాపాడండి..

ABN , First Publish Date - 2022-05-24T06:15:18+05:30 IST

అమ్మా మమ్మల్ని కాపాడండి.. మా సంతానం కూడా మమ్మల్ని చూడడం లేదు.. నా భర్త నన్ను ఆదరించడం లేదు.. నా స్థలాన్ని బలవంతంగా మోసం చేస్తున్నారు.. అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌ ప్రశాంతిని వేడుకున్నారు.

అమ్మా.. మమ్మల్ని కాపాడండి..
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, మే 23 : అమ్మా మమ్మల్ని కాపాడండి.. మా సంతానం కూడా మమ్మల్ని చూడడం లేదు.. నా భర్త నన్ను ఆదరించడం లేదు.. నా స్థలాన్ని బలవంతంగా మోసం చేస్తున్నారు.. అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌ ప్రశాంతిని వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అందించిన 116 అర్జీలను స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును త్వరితగతిన పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీశాఖకు నెలవారి నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. జేసీ జేవీ మురళి, డీఆర్వో కె.కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 కాళ్ళ మండలం రాచర్ల మేరకు చెందిన బుర్ర సుశీల అనే వృద్ధురాలు కుమారుడు ఏసుపాదం తన కుమార్తె కట్టించిన ఇల్లును సైతం లాగేసుకుని ఇంటి నుంచి బయటకు పంపించి వేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులకూ ఫిర్యాదు చేసినట్టు విన్నవించింది.
 మొగల్తూరు మండలం పాతకాల్వ ప్రాంతానికి చెందిన గూడూరు ప్రభావతి తనను తన ప్రాంతానికి చెందిన పాల రామచంద్రరావు, వేండ్ర బాలకృష్ణ ఇబ్బంది పెడుతున్నారని, రోడ్డు అడ్డుకుని ఇంటి నిర్మాణం నిలిచిపోయేలా చేశాడని వాపోయింది.
 తణుకు పట్టణం 34వ వార్డుకు చెందిన తోట ధనలక్ష్మీ అనే వృద్ధురాలు తన భర్త చనిపోయాడని, కుమారుడు ఆస్తిని తీసుకుని తనను పట్టించుకోవడం లేదని తెలిపింది.
పోడూరు మండలం గుమ్ములూరుకు చెందిన వర్ధనపు మేరీ అనే మహిళ తన భర్త విజయ్‌కుమార్‌ తనను వదిలేశాడని, అతనితో కాపు రం చేయకపోతే తాను చచ్చిపోతానంటూ కలెక్టర్‌ కాళ్లపై పడింది.  తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.
 కాళ్ళ మండలానికి చెందిన మరో వృద్ధురాలు తన ఇద్దరు కుమారులు తనను చూడడం లేదని కోర్టు ద్వారా ఆదేశా లు ఇచ్చినా సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది.
 
 ప్రజలకు తాగునీరు ఇవ్వకుండా అడ్డుకుంటారా..!
గ్రామాల్లో వేసవి దాహార్తి తీర్చడానికి ప్రజా ప్రతినిధులు ఆమోదించిన పనులను అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే నిలుపుదల చేశారని వీరవాసరం మండల పరిషత్‌ పాలకవర్గం కలెక్టర్‌ ప్రశాంతికి సోమ వారం ఫిర్యాదు చేశారు. తీర్మానాల ద్వారా రూ.1.50 కోట్ల విలువైన పనులను మండల సమావేశంలో  ఆమోదించామని ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని వివరించారు. గతంలోనే ఓసారి ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం ఎంపీపీ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 21న ఆమోదించిన పనులు పెండింగ్‌లో పడ్డాయని, ఇందులో రూ.70 లక్షలకు పైగా మంచినీటి పథకానికి సంబంధించిన పనులు ఉన్నాయన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు పనులను నిలుపుదల చేయడం దారుణమన్నారు. పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ అధికార పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ఏఎస్‌ఆర్‌సీహెచ్‌ మూర్తి, మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్‌, తదితరులు ఉన్నారు.  


 ఎస్పీ స్పందనకు..13
భీమవరం క్రైం, మే 23 : ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సెబ్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఏటీవీ రవికుమార్‌ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 13 పిర్యాదులు అందాయి. వీటిపై ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
 

Updated Date - 2022-05-24T06:15:18+05:30 IST