Abn logo
Sep 20 2021 @ 00:00AM

న్యాయం కోసం

తన గోడు వినిపించేందుకు వచ్చిన వృద్ధురాలికి నమస్కరిస్తున్న కలెక్టర్‌ మిశ్రా

అధికారుల తీరుపై బాధితుల మండిపాటు
ఎంత వేడుకున్నా పట్టించుకోవడం లేదు..
కలెక్టరేట్‌లో స్పందనకు అర్జీల తాకిడి


ఏలూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు అర్జీదారుల తాకిడి బలంగా తగిలింది. తాజాగా అమ్మఒడి బాధితులు కూడా చేరారు. వీటితో పాటు సివిల్‌ వివాదాల పరిష్కారం కోసం వచ్చిన వారి సంఖ్య కూడా బాగా ఎక్కువగా కనిపించింది. ఆస్తుల దురాక్రమణ, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేసినా పరిష్కారం లేకపోవడంతో కన్నీరు మున్నీరైన ఒక అంథ దివ్యాంగుడి వేదన అందరినీ కంటతడి పెట్టించింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షించాలని వేడుకుంటున్నాడు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం కిందయినా తనకు రక్షణ కల్పించాలని మొర పెట్టుకున్నా ఫలితం మాత్రం లభించలేదు. స్థానికంగా అధికారులు పట్టించుకోకపోవడంతో న్యాయంకోసం కలెక్టరేట్‌ మెట్లు ఎక్కాల్సి వస్తోందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మొత్తం 322 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి 95, పంచాయతీరాజ్‌ 22, పోలీస్‌ శాఖకు 25, సెర్ప్‌కు 54, మున్సి పాలిటీకి 23, మత్స్య శాఖకు 11, సివిల్‌ సప్లైకి 9, గృహనిర్మాణ శాఖకు 7 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఇల్లు కూల్చేశారు
–దివ్వెల దూర్తమ్మ, నిర్మల, వంగాయగూడెం, ఏలూరు

మాది ఏలూరులోని వంగాయగూడెం. తల్లీ కూతుళ్లమైన మేమి ద్దరమూ దివ్యాంగులమే. రోడ్డు పక్కన ఉన్న పోరంబోకు స్థలంలో చిన్న పాక వేసుకుని గత 20 ఏళ్లుగా ఉంటున్నాం. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇటీవల పంచాయతీ అధికారులు కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా మా ఇల్లు కూల్చేశారు. అదేమని అడిగినా సమాధానం లేదు. ఇరవై ఏళ్లుగా ఇంటి పన్ను, కరెంటు చార్జీలు కడుతూ ఉన్నాం. అయినా ఇలా కూల్చేశారు. జగనన్న ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఇవ్వలేదు. ఇంటి పన్ను, కరెంటు బిల్లు వంక చెప్పి అది కూడా రాకుండా చేశారు. ఇప్పుడు మేము వీధిన పడ్డాం.

నా స్థలం నాకివ్వరా ?
–వెలగాల వెంకటేశ్‌, పోచవరం

నేను దివ్యాంగుడిని. సరిగా నడవలేను. మా తాతగారి పేరు మీద ఎకరం స్థలం ఉంది. ఆయన పోయిన తరువాత అది నాకు వచ్చింది. అయితే అధికారులు మాత్రం 85 సెంట్లే అని చెబు తున్నారు. పొలాన్ని కొలిచినా, మా దస్తావేజుల ప్రకారం చూసినా ఎకరం పొలం ఉంది. కానీ అధికారులు మాత్రం 85 సెంట్లేనని వేధిస్తున్నారు. రికార్డుల్లో నమోదై లేదని అడ్డుకుంటున్నారు. మా రికార్డుల ప్రకారం భూమిని సర్వేచేసి నికరం తేల్చి ఆన్‌లైన్‌ చేయమంటే చేయడం లేదు. నా భూమి నాకు ఇప్పించి ఆన్‌లైన్‌ చేయించాలని కలెక్టరును వేడుకుంటున్నాను.


రెండేళ్లుగా అమ్మఒడి లేదు
–గండికోట మేరి, పెదకాపవరం

నా పేరు గండికోట మేరి. మాది ఆకివీడు మండలం పెదకాపవరం. ఒంటరి మహిళను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు 6, ఇంకొకరు 3 తరగతులు చదువుతున్నారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు కుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నాకు అమ్మఒడి ఇవ్వలేదు. రెండేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా అమ్మఒడి రాలేదు. సచివాలయం చుట్టూ కొన్ని వందల సార్లు తిరిగాను. వాళ్లు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. చేసేదేమీ లేక కలెక్టరు గారికి చెప్పుకుందామని వచ్చా. భీమడోలుకు చెందిన మరో మహిళ గతంలో ఎప్పుడో విద్యా వలంటీర్‌గా పనిచేసింది. ఆ కారణం చూపి ఆమెకు కూడా అమ్మఒడి ఇవ్వడం లేదు.

నాకు ప్రాణ హాని ఉంది
–తానుకొండ భాస్కరరావు, బల్లిపాడు
మాది అత్తిలి మండలం బల్లిపాడు. నేను చూపు కనపడని ఎస్సీ దివ్యాంగుడిని. నాకున్న 15 సెంట్ల స్థలంలో కొబ్బరితోట వేసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలాన్ని, తోటని కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన తానుకొండ గెరటరాజు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. అడ్డువెళ్లిన నన్ను దివ్యాంగుడినని కూడా చూడకుండా కొట్టడానికి వస్తున్నాడు. అధికార పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. ఇప్పటికి రెండు సార్లు కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చి వేడుకున్నా. కానీ ఫలితం లేదు. ఇవ్వాళ మూడోసారి వచ్చా. ఈరోజు కూడా నాకు ఎలాంటి సమాధానం రాలేదు. నాకేదైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాలి.