శిథిలబడి

ABN , First Publish Date - 2022-07-05T06:22:22+05:30 IST

సర్కారు బడుల్లో సమస్యలు తిష్ఠ వేశాయి.

శిథిలబడి
బద్దావాని పేటలో పాఠశాల భవనం పై అంతస్తులోపల పెచ్చులూడిపోయి శిదిలావస్థకు చేరిన దృశ్యం

 అధ్వానంగా పలు పాఠశాలల భవనాలు
నాడు–నేడు పేరిట హడావుడి
క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే..
 పిల్లల ప్రాణాలతో చెలగాటం


సర్కారు బడుల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. శిథిల భవనాల్లో చదువులు ప్రమాదకరంగా మారాయి. భవనాలు పునర్నిర్మాణానికి నోచుకోకుండా వెక్కిరిస్తున్నాయి. పెచ్చులూడి ఏ క్షణంలో పడిపోతాయోనన్న భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ తరగతి గదుల్లో ఉండాల్సిన పరిస్థితి. వర్షం వస్తే కొన్నిచోట్ల పాఠశాలలకు సెలవు ఇవ్వాల్సిందే. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నెలకొన్న నిర్లక్ష్యంపై మాత్రం దృష్టి సారించడం లేదు. నేడు పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో   ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన ఇది..

పెచ్చులూడిన శ్లాబ్‌
పాలకొల్లు అర్బన్‌  : పాలకొల్లు పట్టణంలోని 27వ వార్డు బద్దావానిపేటలోని మునిసి పల్‌ ప్రాఽథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఈ పాఠశా లకు రెండు తరగతి గదులు పై భాగంలో ఉన్నాయి. పైభాగం శ్లాబ్‌ పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు కూలి పోతుందో అన్నట్లుగా మారింది ఈ పాఠశాల పరిస్థితి.
 
 బీటలు వారింది
తాడేపల్లిగూడెం అర్బన్‌  : తాడేపల్లిగూడెం పట్ణణ పరిధిలోని కొబ్బరితోట ప్రాంతంలో ఉన్న ఈలి వరలక్ష్మి మున్సిపల్‌ హైస్కూల్‌ను 1972లో నిర్మించారు.  ఈ భవనం పూర్తిగా శిథిలావస్థ కు చేరుకుని ఎప్పుడు పడిపోతుందో అన్నట్టు తయారైంది. భవనం మొత్తం పెచ్చు లూడి  అధ్వానంగా తయారైంది. వర్షం వస్తే పెచ్చులూడి భయంగా ఉంటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పై ఉన్న రేకులుమొత్తం విరిగిపోయాయి. నూతన భవనం లో గదులు చాలకపోవడంతో గత్యంతరం లేని  పరిస్థితులలో అధ్వానంగా ఉన్న ఈ భవనంలోనే ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.

 అన్నీ శిథిలావస్థలోనే..
 మొగల్తూరు :  మొగల్తూరు పంచాయతీ పరిధి కడలివారిపాలెం, పాలకమ్మ చెరువు, కోట, గరవు పల్లవపాలెం ప్రాథమిక పాఠశాలలు శిఽఽథిలావస్థకు చేరుకున్నా యి. కొత్తకాయలతిప్పలో పాత భవనాన్ని ఇటీవల తొలగించారు. అయితే నూతన భవనం  నిర్మించకపోవడంతో తరగతులు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.     

వర్షం వస్తే అడుగు పెట్టలేం..
ఆకివీడు రూరల్‌  : మండలంలోని  కుప్పనపూడి పంచాయతీలోని తాళ్ళకోడు, అప్పారావుపేట, సిద్దాపురం పంచాయతీ నందమిల్లిపాడుల్లోని పాఠశాలలు శిథిలావస్థకు చేరుకు న్నాయి. పైకప్పులు పెచ్చులూడుతూ, వర్షం కురిస్తే నీరు కారుతూ, గచ్చు పెచ్చులూడి అధ్వానంగా ఉన్నాయి. తాళ్ళకోడు పాఠశాల పరిస్థితి మరీ దారుణం. వర్షం కురిస్తే పాఠశాలలో అడుగు పెట్టలేం. టాయిలెట్స్‌లో నీరు నిలిచిపోతుంది.
 
 పట్టులేని  పిల్లర్స్‌
ఆకివీడు : మాదివాడ 2వ వార్డులోని జానకీనగర్‌లో ఎంపీపీ పాఠశాల పిల్లర్స్‌, శ్లాబ్‌ శిథిలావస్థకు చేరింది. 19వ వార్డు, ఎంపీపీ పాఠశాల ఫ్లోరింగ్‌ వర్షం వస్తే నీటమునుగుతుంది. ఒకటవ వార్డులో పాఠశాల నిర్వహణకు తరగతి గదులు లేకపోవడంతో జిల్లా పరిషత్‌ బాలురు ఉన్నత పాఠశాలలోని ఒక గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో సమస్యలే సమస్యలు. వీటిపై ఎంఈవో రవీంద్రను ప్ర శ్నించగా నాడు–నేడులో త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయంటున్నారు.
 
 ఇటు చూడాలంటేనే..
ఆచంట : ఆచంట మండలం కొడమంచిలి మెయిన్‌ పాఠశాలను దశాబ్దాల కిందట నిర్మించడంతో శిథిలావస్థకు చేరింది. వర్షం వస్తే జలమయం అవుతోంది. ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు  భయపడుతున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు 50 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు.



Updated Date - 2022-07-05T06:22:22+05:30 IST