బడి బస్సు భద్రమేనా!

ABN , First Publish Date - 2022-06-25T06:07:19+05:30 IST

అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చేనెల 5వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

బడి బస్సు భద్రమేనా!

ఇంకా 25 శాతం బస్సులు ఫిట్‌నెస్‌ లేదు..
పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం : ఆర్‌టి అధికారులు


భీమవరం క్రైం, జూన్‌ 24 : అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చేనెల 5వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇక్కడ చదివే చాలా మంది విద్యార్థులు అయా పాఠశాలల బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బడి బస్సులపై భద్రతపై అయా విద్యా సంస్థలు యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదు. విద్యా సంస్థల బస్సులు గడవులోపల ఫిట్‌నెస్‌లు చేయించుకోవాలని నిబంధన ఉంది. గడువు ముగిసిన తర్వాత అంటే 2022 ఏప్రిల్‌ 1 నుంచి  వాహనాలు ఫిట్‌నెస్‌ చేయించుకోని వారికి రోజుకు రూ.50 చొప్పున రవాణాశాఖ అధికారులు జరిమానా విధిస్తారు. కొన్ని సంస్థల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఆర్టీవో అధికారులూ చూసీ చూడనట్టు వదిలివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
 808 బస్సులకు ఫిట్‌నెస్‌
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1160 వరకు విద్యా సంస్థల బస్సులు ఉండగా 808 బస్సులు ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌లు పొందాయి. ఇంకా 352 ఫిట్‌నెస్‌లు పొందా లి. ఈ ఏడాది మే 15 నుంచే విద్యాసంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌లు పరీక్షలు చేయించుకోవాలని రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు రోడ్లుపైకి వస్తే చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఉన్నప్పటికి చాలామంది పాఠశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులను తిప్పుతున్నట్టు సమాచారం. అధికారుల తనిఖీల్లో అవి పట్టుబడితే జరిమానాలు వేసి సరిపెట్టడంతో వారు మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నారు.

 యజమానులు పాటించాల్సిన జాగ్రత్తలు..
ప్రతీ బస్సు వెనకు, ఎడమవైపు విద్యా సంస్థ పేరు పూర్తి చిరునామా, సెల్‌ నెంబర్‌ అందరికీ కనిపించేలా ఖచ్చితంగా రాయాలి. బస్సులో అత్యవసర ద్వారం తప్పనిసరిగా ఉండాలి. దానిపై అత్యవసర ద్వారం అని స్పష్టంగా రా యాలి. డ్రైవర్‌ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి. డ్రైవర్‌ లైసెన్స్‌, ఫొటో, పెద్దగా కనిపించేలా డ్రైవర్‌ సీటు వెనుక అమర్చాలి. డ్రైవర్‌కు తప్పనిసరిగా లైసెన్స్‌ ఉండాలి. ఐదేళ్లు బస్సు నడిపిన అనుభవం ఉండాలి. ఎప్పటికప్పుడు డ్రైవర్‌ల ఆరోగ్య పరిస్థితి గమనించాలి. ఒక సహాయకుడిని ఖచ్చితంగా నియమించాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉండాలి. అగ్నిప్రమాద నివారణ పరికరాలు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలి. కిటికీలకు అద్దాలను ఏర్పాటు చేయాలి. పరిమితికి మించి విద్యార్ధులను ఎక్కించకూడదు.

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం..
రెండు రోజుల నుంచి జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. పాఠశాల, కళాశాల బస్సులు ఫిట్‌నెస్‌లు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. బస్సు మరమ్మతులు, రవాణా శాఖ కార్యాలయాలకు తప్ప బయట తిరగకుడదు. ఫిట్‌నెస్‌ పూర్తయితేనే తిరిగే అవకాశం ఉంది. అలా కాదని తిరిగితే తనిఖీల్లో సీజ్‌ చేస్తాం. 75 శాతం బస్సులు ఇప్పటికే ఫిట్‌నెస్‌లు పొందాయి.  కాలం చెల్లిన బస్సులు నడిపితే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం.
 – డీటీవో ఉమామహేశ్వరరావు

Updated Date - 2022-06-25T06:07:19+05:30 IST