ఇసుక కష్టాలు!

ABN , First Publish Date - 2022-09-16T05:32:06+05:30 IST

ఇసుక కష్టాలు ప్రారంభమయ్యాయి.

ఇసుక కష్టాలు!

నిల్వలు పుష్కలం...లభ్యత శూన్యం
ఏజన్సీ మార్పుతో స్తంభించిన ఇసుక విక్రయాలు.. జనం పాట్లు
కొత్త ఏజన్సీకి బాధ్యతల అప్పగింత
పాత నిల్వలు ఎవరి సొంతం
కొత్త ఏజన్సీకి అప్పగిస్తే లబ్ధి ఎవరికి ?
జిల్లాలో 2.70 లక్షల టన్నుల నిల్వ


ఇసుక కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు సరఫరా చేస్తున్న ప్రైవేటు ఏజన్సీని ప్రభుత్వం తప్పించి మరో ఏజన్సీకి బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే ఈ సంస్థ ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు జిల్లాలో ఇసుక విక్రయించడానికి వీలులేదు. గోదావరిలో ఇసుక ర్యాంప్‌ల నుంచి సరఫరా లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  ఫలితంగా ఇసుక సరఫరా స్తంభించింది. స్టాక్‌ పాయింట్‌ల్లోనూ ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో విక్రయాలకు అవకాశం ఉన్నా ప్రభుత్వం    ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మరో ప్రైవేటు ఏజన్సీ ద్వారా విక్రయాలకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
వాస్తవానికి  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.70 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ పాయింట్‌ల్లో నిల్వ ఉంది. ఇప్పటివరకు ర్యాంప్‌ల్లో తవ్వకాలు సాగించి విక్ర యించిన జేపీ సంస్థ స్టాక్‌ పాయింట్‌ లలో నిల్వ చేసింది. వర్షాకాలం రాగానే అధిక ధరలకు విక్రయించింది. లారీ ఇసుక రూ. 21 వేల వరకు విక్రయించారు. గోదావరిలో ఓపెన్‌ రీచ్‌లు పనిచేసిన రోజుల్లో లారీ ఇసుక రూ.16 వేలకు చేరిపోయేది. పైగా 5 యూనిట్‌లు వచ్చేది. అదే స్టాక్‌ పాయింట్‌లలో నాలుగున్నర టన్నులు మాత్రమే సరఫరా చేసేవారు. పైగా ధర పెంచి విక్రయిస్తూ వచ్చారు. తీరా ప్రభుత్వం ఏజన్సీని మార్పు చేయడంతో మొత్తం సరఫరాయే నిలిచిపోయింది.  మూడు రోజుల వ్యవధిలోనే నూతన ఏజన్సీ రంగంలోకి దిగనుందని అధికారులు చెపుతున్నారు. నిర్మాణ అవసరాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే నిర్మాణాలు చేపడుతున్నారు. ఎప్పటిలాగే మళ్లీ ఇసుక సరఫరా కానుందన్న అంచనాతో ఉన్నారు.

స్టాక్‌ పాయింట్‌లలో నిల్వ సమంజసమేనా..
ర్యాంప్‌లనుంచి తవ్వకాలు సాగించి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఏజన్సీని నియమించింది.  ఓపెన్‌ రీచ్‌లు. డ్రెడ్జింగ్‌ రీచ్‌లనుంచి తవ్వకాలు నిర్వహించి జేపీ సంస్థ ఇసుక విక్రయాలు చేసింది. మార్కెట్‌లో ఇసుకకు డిమాండ్‌ తగ్గింది. అదే సమయంలో రాజకీయ నేతల అండదండలతో కొందరు బ్రోకర్‌లు బొండు ఇసుకను పెద్ద ఎత్తున తరలించారు. జగనన్న కాలనీల పేరుతో పక్కదారి పట్టించారు. రియల్‌ ఎస్టేట్‌ భూములు లేదంటే భవన నిర్మాణాల్లో పూడిక పనులకు మళ్లించారు. ఇదిలా ఉంటే ప్రైవేటు ఏజన్సీ ర్యాంప్‌ల్లోనే ఇసుక సరఫరా చేయాలి. కానీ ప్రభుత్వం గుర్తించిన స్టాక్‌ పాయింట్‌లలో నిల్వ చేసుకుంది. అదే నిర్మాణదారులు నిల్వ చేసుకుంటే విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించి నోటీసులు జారీ, జరిమానాలు విధించేవారు. గతంలో ప్రైవేటు వ్యక్తులు ర్యాంప్‌లను పాడుకుని విక్రయించే వెసులుబాటు ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నారు. అటువంటి  గుట్టలను ప్రభు త్వం సీజ్‌ చేసింది.  నిల్వలను విక్రయించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. నిల్వ చేసుకున్న యజమానులు హైకోర్టును ఆశ్ర యించి తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నా ప్రభుత్వం అమలు చేయలేదు. అటువంటిది వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విక్రయాలను దక్కించుకున్న సంస్థ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష లాది టన్నులు నిల్వ చేసి వర్షాకాలం ప్రారంభం కాగానే అధిక ధరలతో విక్రయించుకుంది. ప్రభుత్వం గతంలో కాంట్రాక్టర్‌లకు ఒకలా.. ప్రస్తుత కాం ట్రాక్టర్‌కు మరొకలా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవా నికి ఇసుక నిల్వలు చేసుకుని విక్ర ుుంచేందుకు వీలు లేదు. కేవలం ర్యాంప్‌ల్లోనే అమ్మకాలు సాగించాలి. అందుకే గతంలో కాంట్రాక్టర్‌లు నిల్వ చేసుకున్న ఇసుక గుట్టలను సీజ్‌ చేశారు. జేపీ సంస్థకు మాత్రం ప్రభుత్వం నిల్వ చేసుకునేలా దారులు వేసింది.

ప్రస్తుత నిల్వలు ఎవరి ఖాతాలో..?
 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న స్టాక్‌ పాయింట్‌లలో ఇంకా 2.70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంది. ఇది ఎవరి ఖాతాలోకి వెళ్లనుందన్న విషయం ప్రశ్నార్థకమైంది. వాస్తవానికి ఇది ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లిపోవాలి. మైనింగ్‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విక్రయాలు సాగించాలి. వచ్చిన సొమ్ములు మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ కావాలి. కాని ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయించిన కొత్త ఏజన్సీ ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రాథమిక సమాచారం. అదే జరిగితే కొత్త ఏజన్సీకి భారీ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వానికి నష్టం  వాటిల్లనుంది. కొత్తగా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే ర్యాంప్‌లోనే విక్రయాలకు అవకాశం ఇవ్వాలి. కానీ గతంలో నిల్వ ఉన్న ఇసుకపై ఎటువంటి పెత్తనం ఉండేందుకు వీలులేదు. ఇదే ఇప్పుడు అధికారులను సైతం పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు ఏజన్సీలపై ప్రభుత్వ పెద్దకు పెత్తనం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుకపై కొత్త ఏజన్సీకి బాధ్యతలు అప్పగిస్తే విమర్శలకు మరింత బలం చేకూరనుంది. మొత్తంపైన ప్రభుత్వం అనుసరించే కొత్త విధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నూతన ఏజన్సీని రంగంలోకి దింపడంలో జాప్యం చేస్తే ఇసుకకు మరింత డిమాండ్‌ ఏర్పడనుంది. నిర్మాణ రంగం స్తంభించిపోనుంది.

Updated Date - 2022-09-16T05:32:06+05:30 IST