కార్పొరేట్‌కు ఇసుక

ABN , First Publish Date - 2021-04-16T05:25:19+05:30 IST

జిల్లాలో కొత్త ఇసుక విధానం అమలులోకి రానుంది.

కార్పొరేట్‌కు ఇసుక

టన్ను రూ.475.. ర్యాంప్‌లు, రీచ్‌ల నుంచే రవాణా

అప్పటి వరకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొత్త ఇసుక విధానం అమలులోకి రానుంది. ఆ దిశగా మైనింగ్‌ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వం ఆదేశించిన తక్షణమే కార్పొరేట్‌ సంస్థకు ఇసుక విక్రయాలను అప్పగించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఒకే సంస్థకు ఇసుక విక్రయ బాధ్యతలు అప్పగించింది. జిల్లాలోనూ సదరు సంస్థకు అప్పగించాల్సిన రీచ్‌లు, ర్యాంప్‌లను ఇప్పటికే గుర్తించారు. జిల్లాలో 27 ఇసుక ర్యాంప్‌లు, పడవల ద్వారా వెలికితీసే మరో 28 రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఇసుక విక్రయించిన ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకుని కార్పొరేట్‌ సంస్థకు అప్పగించనుంది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే ఇది అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు టన్ను ఇసుక రూ.375లకు లభిస్తోంది. ఆపైన రవాణా భారం పడుతోంది. కార్పొరేట్‌ సంస్థ బాధ్యతలు స్వీకరించిన వెంటనే టన్ను రూ.475లు కానుంది. నేరుగా రీచ్‌లు, ర్యాంప్‌ల నుంచే ఇసుక విక్రయాలు జరపనున్నారు. వర్షాకాలంలో ఇసుక లభ్యత కోసం ఎప్పటిలాగే స్టాక్‌ పాయింట్‌ల వద్ద నిల్వ చేసుకునే వెసులుబాటును కార్పొరేట్‌ సంస్థకు కల్పించారు. ప్రస్తుతం ఏపీడీఎంసీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందినే కార్పొరేట్‌ సంస్థ భర్తీ చేసుకునేలా అంగీకారం కుదిరింది. జిల్లాలో 80 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంతా మళ్లీ అవే విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఏపీడీఎంసీ పరిధిలో పనిచేసే ట్రైనీలకు మాత్రం ఇతర విధుల్లోకి తీసుకోనున్నారు. జిల్లాలో ట్రైనీ సిబ్బంది 60 మంది ఉన్నారు. ర్యాంప్‌ల నుంచి నేరుగా ఇసుక తవ్వకాలు సాగించి ఇసుక విక్రయాలు సాగిస్తారు. రీచ్‌ల విషయానికొస్తే పడవల ద్వారా సొసైటీలు సరఫరా చేస్తున్నాయి. ఇకపై కార్పొరేట్‌ సంస్థకే సొసైటీలు ఇసుకను అందజేస్తాయి. సొసైటీలతో సంస్థ ఒప్పందం చేసుకోనుంది. రీచ్‌ల నుంచే ఇసుక విక్రయాలు సాగించనుంది. ప్రైవేటు సంస్థకు ఇసుక అప్పగించడంతో అందరికీ అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ధర కాస్త అధికంగా ఉంది. టన్నుపై రూ.100 వినియోగదారులకు అదనపు భారం పడనుంది. ప్రైవేటు సంస్థ ప్రతి వాహనానికి ఇసుక సరఫరా చేయనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు సాగించినప్పుడు గుర్తించిన వాహనాలకు మాత్రమే ఇసుక సరఫరా చేసేవారు. తద్వారా రవాణా భారం అధికమయ్యేది. ప్రైవేటు సంస్థకు ఇచ్చిన తర్వాత ప్రతి వాహనానికి ఇసుక విక్రయిస్తారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా రవాణా బారం తగ్గే అవకాశం ఉంది. గతంలో ప్రైవేటు కాంట్రాక్టర్‌లకు ఇసుక ర్యాంప్‌లు అప్పగించినప్పుడు ర్యాంప్‌లకు వచ్చే ప్రతి వాహనానికి ఇసుక విక్రయించేవారు. తిరుగు ప్రయాణంలో వచ్చే వాహనాలు తక్కువ మొత్తంలో కిరాయికి ఇసుకను దింపేవి. దీనివల్ల ఇసుక ధరలు తక్కువగా ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు సాగించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గుర్తించిన వాహనాలకే ఇసుక సరఫరా చేస్తున్నారు. తద్వారా రీచ్‌కు వెళ్ళి తిరిగి వచ్చే రెండు వైపుల రవాణా భారాన్ని వినియోగదారులపై పడుతోంది. ధరలు అధికంగా ఉంటున్నాయి. ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయించినప్పుడు ప్రతి వాహనానికి ఇసుక అందించినప్పుడే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే ఎప్పటిలాగే ధరలు బెంబేలెత్తించనున్నాయి. 


ఆన్‌లైన్‌ బుకింగ్‌ యథాతథం

ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించే వరకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లు కొనసాగనున్నాయి. తర్వాత ఆన్‌లైన్‌ బుకింగ్‌లు నిలిపివేస్తారు. అప్పటి వరకు ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ప్రైవేటు సంస్థకు అప్పగించిన తర్వాత ఆన్‌లైన్‌ బుకింగ్‌లు మిగిలిపోతే వినియోగదారులకు తిరిగి సొమ్ములు చెల్లించనున్నారు. జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న ర్యాంప్‌ల నుంచి ప్రైవేటు సంస్థ 15 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. రీచ్‌ల నుంచి 56 లక్షల టన్నుల విక్రయానికి అవకాశం కల్పించారు. పడవల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చే ప్రక్రియ జూన్‌ మాసాంతం వరకే అమలు జరిగేలా నీటిపారుదల శాఖ అనుమతి  ఇచ్చింది. అనంతరం వరదలను దృష్టిలో ఉంచుకుని గోదావరిలో ఇసుక  తవ్వకాలకు అనుమతి పొడిగించనుంది.

Updated Date - 2021-04-16T05:25:19+05:30 IST