హా..ర్టీసీ !

ABN , First Publish Date - 2021-09-17T05:25:04+05:30 IST

డిపో నుంచి వెళ్లిన బస్సు తిరిగి డిపోకు క్షేమంగా చేరుతుందా..? అనేది ఆర్టీసీ సిబ్బందికి అనుమానమే..!

హా..ర్టీసీ !
ఏలూరు–జంగారెడ్డిగూడెం మార్గంలో రాళ్లు లేచి అధ్వానంగా ఉన్న రోడ్డు

గోతుల రోడ్లు.. కాలం చెల్లిన బస్సులు

ఆపసోపాలతో ఆర్టీసీ ప్రయాణం.. 

సిబ్బంది, ప్రయాణికుల అవస్థలు


ఏలూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):

డిపో నుంచి వెళ్లిన బస్సు తిరిగి డిపోకు క్షేమంగా చేరుతుందా..? అనేది ఆర్టీసీ సిబ్బందికి అనుమానమే..! ఎలాంటి కుదుపులు లేకుండా.. ప్రయాణం సాఫీగా సాగుతుందా అనేది ప్రయాణికుల సందేహం..! అసలే డొక్కు బస్సులు.. ఆపై అధ్వాన రహదారుల కారణంగా ఆర్టీసీ ఆపసోపాలు పడుతోంది. ఎక్కడ గొయ్యి ఉందో..ఎక్కడ బస్సు ఆగిపోతుందో.. తెలియక ప్రయాణాలు సాగుతున్నాయి. !

జిల్లాలో రహదారులు ఆర్టీసీకి పెనుసవాలుగా మారాయి. కాలం తీరిన బస్సులతో సతమతం అవుతుండగా ధ్వంసమైన రోడ్లు మరింత భయపెడుతున్నాయి. గత రెండేళ్లలో రహదారుల నిర్వహణను గాలికి వదిలేయడం, కనీస మరమ్మతులు చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో ఏ రోడ్డు చూసినా రోడ్లు నోళ్లు తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల అగాథాలను తలపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. జిల్లాలో జాతీయ రహదారులు సహా రాష్ట్ర నిర్వహణలో ఉండే అన్ని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భీమవరం, కైకలూరు, తాళ్లపూడి, కుక్కునూరు, చింతలపూడి, జీలుగుమిల్లి, ద్వారకా తిరుమల ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో అన్నిరూట్ల పరిస్థితి ఇదే. ఈ రూట్లలో రోడ్ల దెబ్బకు ప్రైవేటు రవాణా మందగించింది. కొన్ని ప్రాంతాలకు  ఆర్టీసీ బస్సులు మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. అద్దె బస్సుల నిర్వాహకులు ఈ రూట్లలో బస్సులను తిప్పేందుకు నిరాకరించడంతో ఆర్టీసీ సొంత బస్సులను ఈ రూట్లలో తిప్పుతోంది.  


కాలం తీరిన బస్సులు 139 

జిల్లా ఆర్టీసీలో మొత్తం 502 బస్సులు న్నాయి. వీటిలో పల్లె వెలుగు బస్సులు 328, సూపర్‌ లగ్జరీ 76, డీలక్స్‌ 39, ఎక్స్‌ప్రెస్‌ 28, ఇంద్ర 19, టీవీజీ 10, అమరావతి రెండు సర్వీసులు ఉన్నాయి. 328 పల్లె వెలుగు బస్సుల్లో 139 కాలం తీరాయి. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం 12 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులను కాలం తీరిన బస్సులుగా పరిగణించాలి. దీని ప్రకారం 12 నుంచి 13 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులు 61 కాగా, 13 నుంచి 14 లక్షలు తిరిగిన బస్సులు 65 ఉన్నాయి. 14 నుంచి 15 లక్షలు తిరిగిన బస్సులు 11 కాగా, 15 నుంచి 16 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు రెండు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కాలం తీరిన బస్సులే. రహదారులు అధ్వానంగా ఉండే రూట్లలో తిరిగే బస్సులు లక్షల కిలో మీటర్లకే షెడ్డుకు చేరుతాయి. ఈ లెక్కన 10 నుంచి 11 లక్షలు తిరిగిన బస్సులు 36 కాగా, 11 నుంచి 12 లక్షలు తిరిగిన బస్సులు 73 ఉన్నాయి. వీటిని కూడా కలుపుకుంటే మరో 110 బస్సులు అవసాన దశలో ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం వీటితోనే ఆర్టీసీ నెట్టుకొస్తోంది. 


వెంటాడుతున్న మరమ్మతులు

ధ్వంసమైన రహదారుల్లో నడిపే బస్సుల మెయింటినెన్స్‌ ఖర్చు సాధారణ బస్సుకంటే రెట్టింపు ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. సాధారణ రహదారులపై 15 లక్షల కిలో మీటర్లు తిరిగినా పాడవ్వని బస్సులు ఈ రోడ్లపై 9, 10 లక్షల కిలోమీటర్లకే పాడైపోతున్నాయని వారు చెబుతు న్నారు. టైర్లు, బాడీ, బ్రేకు డ్రమ్స్‌, స్ర్పింగ్‌ ప్లేట్లు ఊరికే దెబ్బతిని పోతున్నాయని, వీటికోసం పదే పదే మరమ్మతులు చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఆర్టీసీ ప్రభుత్వ పరమైనప్పటికీ ఈ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఈ భారం సంస్థపైనే పడింది. కొవిడ్‌ కారణంగా కుదేలైన ఆర్టీసీని మరమ్మతుల భారం నీడలా వెంటాడుతోంది.  


రోడ్ల వల్ల దెబ్బతింటున్నాయి 

– ఎం.శ్రీనివాసరావు, సీఎంఈ

రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ కారణంగా బస్సులు త్వరగా మరమ్మతులకు వస్తున్నాయి. టైర్లు, బాడీ, బ్రేకులు తొందరగా దెబ్బ తింటున్నాయి. నిర్ణీత ప్రమాణాలకంటే ముందే కాలం తీరుతున్నాయి. ఈ మరమ్మతుల భారం అంతకంతకూ పెరుగుతోంది. అసలే కరోనా కష్టాల్లో వున్న పీటీడీపై ఇది కోలుకోలేని భారం. ప్రభుత్వం రోడ్లను బాగు చేస్తే ఈ భారం కొంతైనా తగ్గుతుంది. 

Updated Date - 2021-09-17T05:25:04+05:30 IST