రొయ్య ధర తగ్గిపోతోంది

ABN , First Publish Date - 2021-05-17T05:15:28+05:30 IST

రొయ్యల ధర మరింత పతనమైంది.. కిలోకు దాదాపు 40 రూపాయలు తగ్గిపోయింది.. గత రెండు నెలలతో పోలిస్తే క్రమంగా రూ.20 ,తరువాత రూ.30 తగ్గుతూ 40 రూపాయల దాకా

రొయ్య ధర తగ్గిపోతోంది

కిలోకు రెండు నెలల్లో రూ. 40 వరకూ తగ్గుదల 

కరోనా సాకుగా చూపుతున్నారని రైతులు ఆవేదన

నిలిచిపోయిన చేపల ఎగుమతులు


భీమవరం, మే 16 : రొయ్యల ధర మరింత పతనమైంది.. కిలోకు దాదాపు 40 రూపాయలు తగ్గిపోయింది.. గత రెండు నెలలతో పోలిస్తే క్రమంగా రూ.20 ,తరువాత రూ.30 తగ్గుతూ 40 రూపాయల దాకా తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కరోనా వల్ల ఎగుమతులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఇటీవలే మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ప్రకటన  చేశారు.ప్రస్తుతం సీజన్‌ కావడం ధర పతనం అవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. నిజానికి కరోనా ప్రభావంతో కొంత ఎగుమతులు తగ్గాయి. అమె రికా, యూరప్‌, తూర్పు ఆసియా దేశాలకు కొద్ది మేర ఎగుమతులు తగ్గడం వల్ల ఇదే అదునుగా కొంతమంది దళారులు ధర తగ్గించి కొంటున్నారని చెబుతున్నారు. గత్యంతరం లేని రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పట్టుబడిన రొయ్యలను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వచేస్తే ఈ ప్రభావం తగ్గిన తరువాత రైతులకు న్యాయం జరుగుతుంది. అయితే ఈ గిడ్డంగి సంస్థలన్నీ పెద్దపెద్ద ఎగుమతుదారులు, పెద్ద వ్యాపారులకే ఉండటంతో ప్రస్తుత ధరకు కొనుగోలు చేసి మంచి ధర వచ్చినప్పుడు ఎగుమతి చేసుకునే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు ధరలు, పట్టుబడులపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నారు. అయితే ఎగుమతి పరిస్థితుల దృష్ట్యా అధికారులు కూడా ఈ పరిస్థితిని గట్టెక్కించే చర్యలు ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. సాధారణంగా మార్చి నెల నుంచి ఎక్కువ మంది సాగు చేస్తారు. దీంతో మే నెలలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఎక్కువ సాగు చేయడంతో ఎక్కువ పట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మత్స్యశాఖ ఇటీవల ఎగుమతిదారులు, ఆక్వా రైతులతో గత నెల చివరి వారంలో చెప్పించారు కూడా. గత 20 రోజుల్లో కిలోకు రూ.10 ధర పడిపోయింది. దాదాపు 40 వేల ఎకరాల్లో రాబోయే రోజుల్లో పట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ధర పతనం మరింత ఉంటుందని దీని వల్ల రైతులు మరింత నష్టాన్ని చవిచేసే ఆందోళన చెందుతున్నారు. 


నిలిచిపోయిన చేపల ఎగుమతులు

కొవిడ్‌ ప్రభావంతో చేపల ఎగుమతులు గణనీయంగా నిలిచిపోయాయి. గత నెల వరకు కొంత మేర ఎగుమతులు సాగేవి. ప్రధానంగా ఎగుమతి డిమాండ్‌ ఉన్న శీలావతి కిలో రూ.85 పలికింది. ప్రస్తుతం ధర మరింత తగ్గి రూ.80లకు పడిపోయింది. మిగతా చేపల రకాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. స్థానిక మార్కెట్‌పైనే రైతులు ఆధారపడ్డారు. చేపలు కూడా పట్టుబడులు ఆలస్యం చేయడంతో సైజు పెరుగుతున్నాయి. రైతులకు కూడా ఆహార పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతేడాది కరోనా మాదిరిగానే ఈసారి కూడా చేపల రైతులు పెద్దఎత్తున నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కౌంటు వారీగా రొయ్యల ధరలు

కౌంటు  మార్చి     ఏప్రిల్‌    ప్రస్తుత ధర(మే)

30 460      430       435

40 360      335       335

50 320      300       290

60 300     290       270

70 275     250       240

80 250     230       220

90 225     210       200

100 220     200       190


Updated Date - 2021-05-17T05:15:28+05:30 IST