నరక ప్రాయం

ABN , First Publish Date - 2022-08-19T05:37:09+05:30 IST

జిల్లాలో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి.

నరక ప్రాయం
తాడేపల్లిగూడెం– తణుకు రహదారిలో ప్రమాదకరంగా మారిన గొయ్యి

జిల్లాలో అధ్వానంగా రోడ్లు
వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న వైనం
వాహనదారులు, ప్రయాణికులు పాట్లు
తరచూ ప్రమాదాలు.. జనం మృత్యువాత
రూ.25 కోట్లతో మరమ్మతులు చేపట్టే యోచన
ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. కాంట్రాక్టర్లలో బిల్లుల భయం



తాడేపల్లిగూడెం– తణుకు  రోడ్డుపై రాత్రిపూట ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఓ మహిళా పోలీస్‌ ఐలాండ్‌కు సమీపంలోని గోతిలో పడిపోయింది. తలకు తీవ్ర గాయమై ప్రాణాలు విడిచింది. కొద్దిరోజుల తర్వాత అదే గోతిలో నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ దెబ్బతింది. కొంత దూరం వెళ్లిన తర్వాత పక్కకు వెళ్లిపోయింది. తృటిలో ప్రమాదం తప్పింది. లేదంటే ఏలూరు కాల్వలో పడిపోయి ఉండేది.
 అత్తిలి నుంచి పిప్పర మీదుగా తాడేపల్లిగూడెం వస్తున్న అత్తిలికి చెందిన ఓ యువకుడు ముదునూరు వద్ద గొయ్యిలో ద్విచక్రవాహనంతో పడిపోయి అశువులు బాశాడు. అతను దక్షిణాఫ్రికాలో ఇంజనీర్‌గా పని చేస్తుండే వాడు. మరో నాలుగురోజుల్లో  దక్షిణాఫ్రికా వెళ్లేందుకు సిద్ధ పడుతున్న తరుణంలో ఈ విషాదం జరిగింది. ఆ తర్వాత అక్కడ రహదారిని బాగు చేశారు. ఇలా జిల్లాలో అనేక ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అధ్వానంగా ఉన్న రహదారు లను వేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూనే ఉంది.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. మూడు నెలల పాటు కురిసిన వర్షాలకు గోతులమయం అయ్యాయి. వర్షాలు కురిస్తే నరకాన్ని చూపిస్తున్నాయి. రోడ్డు ఏదో.. గొయ్యి ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. వాహన ప్రమాదాలు జరుగుతున్నా యి. రహదారులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా గతంలో మర మ్మతులతోనే సరిపెట్టారు. దీంతో రహదారులు మళ్లీ ఇప్పుడు దెబ్బతిన్నాయి. రాష్ట్ర రహదారులు , భవనాల శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 1600 కిలో మీటర్ల మేర  రోడ్లు విస్తరించి ఉన్నాయి. ఆ జాబితా లో రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. అందులో 430 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులు మరమ్మతులకు గురైనట్టు ఆర్‌ అండ్‌ బీ శాఖ అంచనా వేసింది. ఆ పనులు చేపట్టాలంటే రూ.25 కోట్లు అవసరం కానున్నాయి. ఇప్పటికే రహదారుల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
 మరమ్మతులతోనే సరిపెడతారా ?
రాష్ట్ర, జిల్లా రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వాటిలో కొన్ని రహదారులు మాత్రమే అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్యాంక్‌ గ్యారంటీల ద్వారా కొన్ని పనులు నిర్వహిస్తోంది. ప్రభుత్వం నుంచి బ్యాంక్‌ గ్యారంటీ రావడంతో ఈ ఏడాది కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. వాస్తవానికి గడిచిన మూడేళ్లుగా  టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు స్పందించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతో మొండికేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీతో ముందుకు రావడం తో కాంట్రాక్టర్లలో విశ్వాసం కాస్త పెరిగి కొద్దిపాటి పనులు చేపడుతున్నారు. అది కూడా రాష్ట్ర రహదారులకే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా రహదారుల జోలికి పోవడం లేదు. ప్రస్తుతం అభివృద్ధికి నోచుకోని రహదారులు గడిచినా మూడు నెలలుగా కురిసిన వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోతులను పూడ్చేందుకు తక్షణం రూ.25 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేశారు. ప్రభుత్వం నిధు లు విడుదల చేస్తే మరమ్మతులు మాత్రమే చేపట్టనున్నారు. అదే జరిగితే రహదారులు మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది.
నెరవేరని జాతీయ ఆకాంక్ష
జిల్లాలో రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. జిల్లాలో రహదారులకు జాతీయ హోదా లభించడం లేదు. ప్రధానంగా తాడేపల్లిగూడెం– భీమవరం రహదారికి జాతీయ హోదా కల్పించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. టీడీపీ హయాంలోనే ఒక పర్యాయం కేంద్రానికి పం పారు. అప్పట్లో రాష్ట్రంలోని కొన్ని రహదారులకు మాత్రమే జాతీయ జాబితాలో చేర్చారు. భీమవరం–తాడేపల్లిగూడెం రహదారిని జాతీయ జాబితా నుంచి తప్పించారు. కేంద్రం వద్దే ప్రతిపాదనలు ఉండిపోయాయి. తాజాగా మరోసారి కేంద్రానికి భీమవరం–తాడేపల్లిగూడెం రహదరి ప్రతిపాదనలు పంపే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల పున ర్విభజనలో ఏర్పడిన నవీన పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం–తాడేపల్లిగూడెం రహదారి అత్యంత కీలకమైనది. రెండు ప్రధాన పట్టణాలను కలిపే ఈ రహదారి అధ్వానంగా ఉంది. గొల్లలకోడేరు నుంచి యండగండి వరకు రోడ్డు విస్తరణకు రహదారి అభివృద్ధి కోసం నిధులు కేటాయించగా గడిచిన ఏడాదిగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రహదారి పూర్తి కాకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ప్రయాణికులు బెంబేలెత్తి పోతున్నారు. గడిచిన మూడు నెలల్లో రహదారి మరింత దారుణంగా మారింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం మరమ్మతులకే పరిమితమయితే ఎప్పటిలాగే రహదారులు గోతులమయంగా మారనున్నాయి. జిల్లాలోని పలు రాష్ట్ర, జిల్లా రహదారుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా క్షేత్రస్థాయికి వచ్చేసరికి కాంట్రాక్టర్లలో నమ్మకం కుదరడం లేదు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో రహదారులు అభివృద్ధ్దికి నోచుకోవడం లేదు. 

Updated Date - 2022-08-19T05:37:09+05:30 IST