సొమ్ములేవీ?

ABN , First Publish Date - 2022-09-22T06:08:36+05:30 IST

రైస్‌మిల్లర్లు కటకటలాడుతున్నారు.

సొమ్ములేవీ?

రైసు మిల్లర్ల ఆవేదన
బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం
రుణాలు చెల్లించలేని స్థితిలో మిల్లర్లు
వడ్డీలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన
ఉమ్మడి జిల్లాలో రూ.400 కోట్ల బకాయిలు


రైస్‌మిల్లర్లు కటకటలాడుతున్నారు. ప్రభుత్వం నెలల తరబడి మిల్లర్లకు బకాయిలు విడుదల చేయడం లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం దాదాపు రూ.400 కోట్లు చెల్లించాలి. గడిచిన ఖరీఫ్‌ నుంచి సొమ్ములు సక్రమంగా చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. రవాణా, కస్టమ్‌ మిల్లింగ్‌, డ్రయ్యర్‌, యూజర్‌ చార్జీల, సార్టెక్స్‌  చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో మిల్లర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బ్యాంకు వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీలు అధికమవుతున్నాయి. సొమ్ములు అందక మిల్లర్లు అల్లాడి పోతున్నారు. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మిల్లర్లు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. అన్ని విధాలా ఇబ్బందులు పెడుతోంది.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రేషన్‌ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిం ది. జనం తినే బియ్యం ఇస్తామంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్ని కల ముందు ఊరూవాడా చెప్పుకొచ్చారు. అందుకోసం సార్టెక్స్‌ బియ్యాన్ని సర ఫరా చేస్తున్నారు. వాటిని లబ్ధిదారులు వినియోగించడం లేదు. ఎప్పటిలాగే మార్కెట్‌కు తరలిపోతున్నాయి. మిల్లర్లపై మాత్రం ప్రభుత్వం పెనుభారమే మోపింది. సార్టెక్స్‌ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతి మిల్లర్‌ లక్షల రూపాయలు పెట్టుబడి చేశారు. బ్యాంకు రుణాలు తీసుకున్నారు. రుణాలను తిరిగి చెల్లించాలి. వాయిదాలు తరుముకొస్తున్నాయి. సార్టెక్స్‌ బియ్యం అంటూ 25 శాతం నూకనుంచి ప్రభుత్వం 15 శాతానికి తగ్గించింది. దాంతో నూక తక్కువ ఉన్న బియ్యాన్ని మిల్లర్లు అప్పగిస్తున్నారు. అందుకు ప్రతిగా మార్జిన్‌ సొమ్ములను ప్రభుత్వం చెల్లించాలి. వాటిని చెల్లించకుండా ప్రభుత్వం కాలయా పన చేయడంతో మిల్లర్లకు భారంగా మారింది.

ఆ మిల్లులకు టార్గెట్‌లు లేనట్టే..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సార్టెక్స్‌ యంత్రాలు ఏర్పాటు చేయలేని మిల్లర్లకు టార్గెట్‌ ఇవ్వడం లేదు. ప్రభుత్వం పూర్తిగా సార్టెక్స్‌ బియ్యాన్ని తీసుకుంటే నాన్‌ సార్టెక్స్‌ మిల్లులకు లక్ష్యాలు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. ప్రభుత్వం భారత ఆహార సంస్థకు నాన్‌ సార్టెక్స్‌ బియ్యం అప్పగిస్తోంది. అటువంటప్పుడైనా నాన్‌సార్టెక్స్‌ మిల్లులకు లక్ష్యాలు ఇస్తే కొంత ఊరట లభిం చేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ఇలా అన్ని మిల్లుల కు సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఒక్క సార్టెక్స్‌ మిల్లులపైనే ప్రభుత్వం ఆధారపడుతోంది. నాన్‌ సార్టెక్స్‌ మిల్లలను పట్టించుకోవడం లేదు. దాంతో అటువంటి మిల్లులు మూతపడుతున్నాయి.

సాంకేతిక ఇబ్బందులు సాధారణం..
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాంకేతిక ఇబ్బందులు సర్వ సాధారణంగా మారాయి. ప్రధా నంగా విద్యుత్‌ కోతలతో మిల్లర్లు అల్లాడి పోయే పరిస్థితి ఏర్పడుతోంది. కేవలం రోజుకు 12 గంటల పాటే మిల్లులు తిప్పాలంటూ విద్యుత్‌ శాఖ ఒక దశలో ఆదేశాలు జారీచేసింది. వారానికి రెండు రోజులు పవర్‌ హాలీడే ప్రకటించింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత మిల్లులు తిప్పితే భారీ జరిమానాలు విధించింది. ఒక్కో మిల్లర్‌ గరిష్ఠంగా రూ.3 లక్షలు వంతున విద్యుత్‌ శాఖకు చెల్లించారు. మరోవైపు ప్రభుత్వ ఉదాసీనత వల్ల నెలరోజులపాటు మిల్లులు నిలిచిపోయాయి. నాన్‌ సార్టెక్స్‌ బియ్యం తీసు కోవడంలో భారత ఆహార సంస్థ జాప్యం చేసింది. సార్టెక్స్‌ బియ్యం తీసుకునే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొరవడింది. దాంతో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ నిలిచిపోయింది. మిల్లులు తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. గడిచిన రబీలో ఇలా మిల్లర్లు లెక్కకు మిక్కిలి కష్టాలు ఎదుర్కొన్నారు.

 ఎఫ్‌సీఐ బిల్లులు  ఎప్పుడో..
భారత ఆహార సంస్థకు అప్పగించిన బియ్యానికి సంబంధించి రవాణా చార్జీ లు చెల్లించాలి. ఈ విషయంలో భారత ఆహార సంస్థ మిల్లర్లకు తీరని అన్యా యం చేస్తోంది. గడిచిన ఎనిమిదేళ్లుగా రవాణా, హమాలీల చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇవికూడా జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలోనే చెల్లించాలి. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ పట్టించుకోవడం లేదు. కేంద్రం నుంచి రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తొలి రోజుల్లో లాభాలను చవిచూసిన మిల్లర్లు ఇప్పుడు సంక్షోభంలో కూరుకు పోయారు.

Updated Date - 2022-09-22T06:08:36+05:30 IST