కార్పొరేట్‌..మిథ్య

ABN , First Publish Date - 2022-09-18T05:52:32+05:30 IST

పేదలకు కార్పొరేట్‌ విద్యను అందించాలన్న ప్రభుత్వం సంకల్పించినా నిర్ణయం తీసుకోవడంలో కాలతీతం కావడంతో అంతిమంగా పేద విద్యార్థులు నష్టపోయారు.

కార్పొరేట్‌..మిథ్య

 జిల్లాలో 60 మంది విద్యార్థులే దరఖాస్తు

పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో సీట్లు 

ప్రభుత్వ నిర్ణయంలో తీవ్ర జాప్యం

ప్రైవేటు విద్యా సంస్థల్లో గుబులు

ఫీజులు చెల్లించదన్న మీమాంస


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పేదలకు కార్పొరేట్‌ విద్యను అందించాలన్న ప్రభుత్వం సంకల్పించినా నిర్ణయం తీసుకోవడంలో కాలతీతం కావడంతో అంతిమంగా పేద విద్యార్థులు నష్టపోయారు. అదికూడా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం ఒకటో తర గతిలో చేరేందుకు మాత్రమే అవకాశమిచ్చారు. పాఠశాలలు తెరచుకున్న రెండునెలల తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో 60 మంది విద్యార్థులే ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకు న్నారు. వీరంతా కేవలం 19 ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. ప్రభుత్వం తీరు చూస్తే కేవలం మొక్కుబడిగా ఆదేశాలు జారీ చేసి పేద విద్యార్థులపై ప్రేమ నటిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు విద్యలోనూ రిజర్వేషన్‌

ప్రభుత్వం పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యలోనూ రిజర్వేషన్లు అమలు చేసింది. ప్రైవేటు విద్యా 

సంస్థల్లో 25 శాతం సీట్లు పేద లకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అందులో 10 శాతం ఎస్సీలకు, 5శాతం దివ్యాంగులకు కేటాయించింది. మరో నాలుగు శాతం ఎస్టీలకు, బలహీన వర్గాలకు 6శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బలహీన వర్గాల జాబితాలో బీసీలు, మైనార్టీలు, ఓసీలకు సీట్లు కేటాయించాలి. ఓసీల్లో ఆర్థికంగా వెనుకపడిన విద్యార్థులకు అంటే పల్లెల్లో సంవత్సరాదాయం రూ.1.20 లక్షలకు తక్కువగా ఉన్నవారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం పేదలకు అంటే దాదాపు 30 వేల మంది ప్రభుత్వ సిఫారసుతో చేరాలి. కానీ 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదికూడా ఒకటో తరగతి వరకే పరిమితం చేయడంతో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. 

 ఫీజులపై మీమాంస

 ప్రైవేటు విద్యా సంస్థల్లో రాష్ట్ర విద్యాశాఖ సిఫారసు మేరకు చేరిన పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజునే మాత్రమే చెల్లిస్తారు. వాస్తవానికి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు సగటున రూ.30వేల వరకు ఉంటాయి. ప్రభుత్వం మాత్రం రూ.20 వేలు మాత్రమే చెల్లిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి విధానాన్ని తొలగించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని దిశానిర్దేశం చేసింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో  పేదలకు విద్య అందించాలన్న లక్ష్యానికి స్వస్తి పలికింది. మరోవైపు గతంలో చదివిన విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిల విడుదలలోనూ జాప్యం చేసింది. ఇప్పుడదే ప్రైవేటు విద్యా సంస్థలను వెంటాడుతోంది. సకాలంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించదన్న భావనలో విద్యా సంస్థలున్నాయి. మరల ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలని ఆదేశించింది. చిన్నస్థాయి ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా ఫీజులు చెల్లింపులోనే ఆందోళన చెందుతున్నాయి. పైగా విద్యార్థుల నుంచి స్పందన కొరవడింది. 

 విద్యార్థుల్లోనూ గుబులు

విద్యాశాఖ సిఫారసు మేరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరే పేద విద్యార్థులకు ప్రభుత్వం మధ్యలో ఝలక్‌ ఇస్తోంది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివితే ఫీజులు చెల్లించేది లేదంటూ స్పష్టం చేసింది. ఒకసారి ప్రైవేటు విద్యా సంస్థలకు అలవాటు పడ్డ విద్యార్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశా లల్లో చేరాల్సి వస్తోంది. అటువంటి సందర్భాల్లో టీసీలు ఇచ్చేందుకు ప్రైవేటు విద్యా సంస్థలు నిరాకరిస్తున్నాయి. ఫీజు చెల్లించి టీసీలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఫీజులు చెల్లించలేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న చైల్డ్‌ఇన్‌ఫోలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతు న్నట్టు ఉండే పేర్లను తొలగిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. దీనివల్ల తమకు నష్టవాటిల్లుతోందని ప్రైవేటు యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయంలో ఒక స్పష్టమైన వైఖరి ఉండకపోవడం వల్లే అటు విద్యార్థులు, ఇటు ప్రైవేటు యాజమాన్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు.  

Updated Date - 2022-09-18T05:52:32+05:30 IST