బండి కాదు.. మొండి

ABN , First Publish Date - 2021-04-11T05:51:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ).. ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)గా మారింది.. పేరు మాత్రమే ! నాటి కాలం చెల్లిన బస్సులనే పీటీడీలోనూ నడు పుతున్నారు.

బండి కాదు.. మొండి
బస్‌ను తోస్తున్న ప్రయాణికులు

కాలం చెల్లిన బస్సులు ఇంకెన్నాళ్లు..?

మొరాయిస్తున్న ప్రజా రవాణా సంస్థ

అడుగడుగునా ఆగుతూ.. పార్టులు ఊడిపోతూ..

పోలవరం వద్ద తప్పిన ప్రమాదం


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ).. ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)గా మారింది.. పేరు మాత్రమే ! నాటి కాలం చెల్లిన బస్సులనే పీటీడీలోనూ నడు పుతున్నారు. ‘ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం. సుఖమయం’ అనే నినాదం.. కాలం చెల్లిన బస్సులకు కూడా వర్తి స్తుందా ? అనేది అధికారులే చెప్పాలి. ప్రైవేటు రంగంలో బస్సులు కొత్త పుంతలు తొక్కు తుండగా.. ఆర్టీసీలో మాత్రం ఇంకా డొక్కు బస్సులనే విని యోగిస్తున్నారన్న విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. ఇందుకు ఈ ఘటనలే నిదర్శనం. 


జంగారెడ్డిగూడెం, పోలవరం, టి.నరసాపురం, ఏప్రిల్‌ 10 : పోలవరం ప్రాజెక్టు వద్ద ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన వున్న టేకూరు నుంచి 90 మంది ప్రయాణీకులతో జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు బయలుదేరింది. ప్రాజెక్టు వద్ద 902 హిల్‌ సమీపం లో స్టీరింగ్‌ కంట్రోల్‌ రాడ్డుకున్న బోల్టు ఊడిపోవడంతో బ స్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కొండ రాళ్లను ఢీకొట్టి ఆగి పోయింది. ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం ప్రయాణీకుల్లో 30 మంది పోలవరం హైస్కూలు విద్యార్థులున్నారు. ఘటన జరిగిన వెంటనే మరో బస్సును రప్పించి ప్రయాణీకులను పోలవ రం తరలించారు. డ్రైవర్‌ భీమేశ్వరరావు మాట్లాడుతూ డిపో నుంచి బయలుదేరినప్పుడు బస్సు కండీషన్‌ బాగానే ఉందని, టేకూరు నుంచి పోలవరం వైపు వచ్చే రోడ్డు మార్గంలో గోతుల వల్ల బోల్టు ఊడిపోయిందని తెలిపారు. ఇదే బస్సు పొరపాటున ఎడమ వైపు వెళ్లి ఉంటే స్పిల్‌ ఛానల్‌ గోతుల్లోకి వెళ్లి పెనుప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మార్గాలను పునరుద్దరించాలని ప్రజలు కోరుతున్నారు. 


ప్రయాణం.. ప్రాణ సంకటం

ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు అంతంతమాత్ర మే. ఆటోలు ఎక్కితే ప్రమాదాలు జరుగుతాయేమోనని ప్రజలు బస్సుల కోసం చూస్తుంటారు. రోజుకు పరిమితం గానే నడిచే ఆర్టీసీ బస్సులు సైతం ఎక్కడికక్కడ మొరాయి స్తున్నాయి. కండీషన్‌లో లేని వాహనాలను నడపడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి ఏజెన్సీ మండలాలకు నిత్యం ఎందరో గిరిజనులు, ఏజెన్సీవాసులు జంగారెడ్డిగూడెం వ స్తుంటారు. జంగారెడ్డిగూడెం డిపోలో మొత్తం 66 బస్సులు ఉన్నాయి. వీటిలో 2019లో మూడు ఆలా్ట్ర బస్సులు మాత్ర మే కొత్తవి. మిగిలినవన్నీ ఏడెనిమిదేళ్ల క్రితానివే. పదేళ్ల క్రితం నాటి బస్సులున్నాయి. వీటిని గ్రామాల్లో తిప్పడంతో ఎక్కడికక్కడ మొరాయించి ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి పోలవరం, వేలే రుపాడు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మం డలాల్లోని మారుమూల గ్రామాలకు బస్సులు వెళుతున్నా యి. వీటిలో కొన్ని ఎప్పుడు ఆగిపోతాయో, ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అధికారులు మాత్రం బస్సులకు రోజు, వారం, నెలవారీగా మెయిం టినెన్స్‌ ఉంటుందని, అవి పూర్తయిన తర్వాతే బస్సులను సర్వీసులకు పంపుతున్నట్టు చెబుతున్నారు. 


బాబూ కొంచెం తోస్తారా..?

జంగారెడ్డిగూడెం డిపో నుంచి బండివారిగూడెం, మక్కినవారిగూడెం మీదుగా ఎర్రగుంటపల్లి నుంచి చింతలపూడి వెళ్లే ఆర్టీసీ బస్సు బండివారిగూడెం ప్రధాన సెంటర్‌లో ఇటీవల ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్సులోని ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు సిబ్బంది, స్ధానికులు, బస్సులో ప్రయాణించే వారు దిగి బస్సు నెట్టాల్సి (పైచిత్రంలో) రావడం బాధాకరం. ఇలాంటి బస్సులను నడపడం వల్ల ప్రయాణీకులు ఆర్టీసీపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. జంగారెడ్డిగూడెం, ఏలూరు డిపోల నుంచి టి.నరసాపురం మండలం మీదుగా వచ్చే బస్సులు తరచూ ఆగిపోతున్నాయి. అసలే గోతులమయమైన రహదారులు.. ఆపై కాలం చెల్లిన బస్సులతో ప్రయాణాలంటేనే భయపడుతున్నారు. 

Updated Date - 2021-04-11T05:51:31+05:30 IST