అర్హులెందరు..?

ABN , First Publish Date - 2022-06-27T06:05:41+05:30 IST

వచ్చే నెల నుంచి మంజూరు చేసే కొత్త పింఛన్ల జాబితాను ప్రభుత్వం మరోసారి థర్డ్‌ పార్టీలతో తనిఖీలు చేయిస్తోంది.

అర్హులెందరు..?

లబ్ధిదారుల జాబితాపై థర్డ్‌పార్టీతో తనిఖీలు
నరసాపురం, జూన్‌ 26 : వచ్చే నెల నుంచి మంజూరు చేసే కొత్త పింఛన్ల జాబితాను ప్రభుత్వం మరోసారి థర్డ్‌ పార్టీలతో తనిఖీలు చేయిస్తోంది.  ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతి నెల  అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు నెలలు ఈ విధానాన్ని అమలు చేసి ఆపై చేతులెత్తేసింది. ఆరు అంచెల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఏడాదికి రెండుసార్లు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ వస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ ఈ ఏడాది జనవరి నుంచి మంజూరు చేశారు. ఈక్రమంలో సచివాలయ వ్యవస్థే కీలకంగా వ్యవహరించింది. కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు, ఇతర కారణాలతో అనర్హుల్ని కూడా జాబితాలో చేర్చారన్న ఆరోపణలు లేకపో లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి కొత్త పింఛన్ల మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత కమిషనర్లు కాకుండా పక్క మునిసిపాలిటీల కమిషనర్లకు జాబితా పరిశీలించే బాధ్యత అప్పగించింది. మండలాల్లో కూడా ఇదే తరహాల్లో పక్క మండల ఎంపీడీవోలతో పరిశీలన చేయిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,02,987 మందికి ప్రతి నెలా రూ.51 కోట్లు  పింఛన్లుగా అందిస్తున్నారు. జిల్లా విభజన తర్వాత మరోసారి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పట్టణ, మండలాలల వారీగా సచివాలయ సిబ్బందితో తనిఖీలు చేయించి తుది జాబితాను సిద్ధం చేశారు. అత్యధికంగా భీమవరంలో 1500 మంది దరఖాస్తు చేసుకోగా నరసా పురం 650, పాలకొల్లు 600, తాడేపల్లిగూడెం 700, తణుకులో 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రతి మండలం నుంచి 500 నుంచి 600 మంది వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.

 ఎంత మందికి దక్కేనో..
అయితే ప్రభుత్వం పారదర్శక పేరుతో వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా థర్డ్‌ పార్టీలతో తనిఖీలు చేయిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడు స్థానికంగా ఉంటున్నాడా... లేదా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నాడా... ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా, కార్లు  ఉన్నాయా, వినియోగిస్తున్న కరెంట్‌, పొలం, భూమి తదితర వివరాలను ఈ థర్డ్‌ పార్టీ ద్వారా సేకరించి లబ్ధిదారుల ఏరివేత చేపట్టింది. ప్రతి మండలం నుంచి ఎంపికైన లబ్ధిదారుల సంఖ్యలో కోత పడుతున్నట్టు సమాచారం.

 ఒంటరి మహిళకు నష్టమే..
ఈసారి ప్రభుత్వం ఒంటరి మహిళ పింఛన్‌ మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటి ఉంటే వారికి పింఛన్‌ వస్తుండగా ఇప్పుడు 50 ఏళ్లు వయో పరిమితిని తీసుకొచ్చింది. విడాకులు తీసుకుని లేదా భర్త చనిపోయిన.. ఉన్న ఒంటరి మహిళకు 50 ఏళ్లు దాటితేనే అర్హులుగా గుర్తించాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కారణంగా దరఖాస్తు దారుల్లో ఎక్కువ మంది అనర్హులు కానున్నారు. 

Updated Date - 2022-06-27T06:05:41+05:30 IST