నేటితో వీడనున్న పరిషత్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-09-19T05:28:29+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేటితో వీడనుంది.

నేటితో వీడనున్న పరిషత్‌ టెన్షన్‌
వట్లూరు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 18:  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేటితో వీడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా, ఎన్నికపై కొందరు హైకోర్టు మెట్లెక్కడంతో ఫలితాల లెక్కింపును హైకోర్టు నిలిపి వేసింది. మరలా ఫలితాలు వెల్లడికి కోర్టు అనుమతించడంతో ఆదివారం లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏలూరు డివిజన్‌లోని ఏలూరు రూరల్‌ మండలం, పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాలకు సంబంధించి వట్లూరులోని సర్‌ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్కింపు జరగనుంది.


ఏలూరు మండలంలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఏప్రిల్‌లో జరిగిన ఓట్ల లెక్కింపు ఇప్పటి వరకూ అనేక కారణాలతో ఆగిన విషయం తెలిసిందే. ఒక దశలో రద్దవుతాయనుకున్న ఎన్నికల ఉత్కంఠకు హైకోర్టు తెర దించడంతో కౌంటింగ్‌ ప్రక్రియకు మార్గం ఏర్పడింది. ఓట్లు లెక్కించాలని హైకోర్టు ఆదేశించడంతో ఆరు నెలలుగా వేచి ఉన్న మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థులు టెన్షన్‌తో కూడిన ఉత్సాహంతో ఉన్నారు. దెందులూరు నియోజక వర్గం పరిధిలో ఏలూరు మండలానికి సంబంధించి 11 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానం ఉంది. వీటిలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవయ్యాయి. కలకుర్రు–భలే స్వాతి (వైసీపీ), గుడివాకలంక– మోరు రజని (వైసీపీ), శ్రీపర్రు– మండల శైలజ (వైసీపీ), పైడిచింతపాడు– పెన్మత్స శ్రీనివాసరాజు (వైసీపీ) ఏకగ్రీవమయ్యారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మండల సరస్వతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. అప్పట్లో ఎస్‌ఈసీ ఎన్నికలను నిలిపివేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్య ర్థులు డిక్లరేషన్‌ ఇవ్వాలని, ఒకవేళ ఇచ్చి ఉంటే అమలు చేయాలని కోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు ఇచ్చింది. దీంతో అప్పట్లో ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఊరట లభించింది. వాస్తవానికి ఏలూరు, దెందులూరు నియోజక వర్గాల్లో ఏలూరు మండలానికి సంబంధించి 34 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఏలూరులోని ఏడు పంచాయతీలు కార్పొరేషన్‌ విలీనం కావడంతో కేవలం దెం దులూరు నియోజకవర్గం లోని 11 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరిగింది. వీటీలో నాలుగు ఏకగ్రీవం కాగా ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం కౌం టింగ్‌లో వీరి భవితవ్యం తేలనుంది.  


పెదవేగి మండలం

పెదవేగి, సెప్టెంబరు 18 : పెదవేగి మండలంలో మొత్తం 25 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 24 స్థానాలకు మాత్రమే పోలింగ్‌ జరిగింది. రామశింగవరం ఎంపీటీసీ స్థానానికి సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థి అప్పటికే మృతి చెందడంతో ఆస్థానానికి సంబంధించి పోలింగ్‌ను నిలిపేశారు. దీంతో 24 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. కాగా టీడీపీ అన్నిచోట్ల పోటీలేదు.  2001లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పెదవేగి మండల పరిషత్‌ అధ్యక్ష పదవిని దక్కించుకోగా 2006లో కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. ఆ తర్వాత తిరిగి టీడీపీ అధ్యక్ష పదవిని దక్కించుకుంది.


పెదపాడు మండలం

పెదపాడు, సెప్టెంబరు 18 : పెదపాడు  మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలుండగా నామినేషన్ల రోజు వట్లూరు–2 ఏకగీవ్రమైంది. మిగతా 20 స్థానాలకు 41 మంది అ భ్యర్థులు పోటీలో నిలిచారు. అప్పనవీడు, కొత్తముప్పర్రు ల్లో వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులతో త్రిముఖ పోటీ నెలకొనగా, పెదపాడు–2లో వైసీపీ, టీడీపీతో పాటుగా ఇండి పెండెంట్‌ బరిలో నిలిచారు. ఎన్నికల అనం తరం సత్యవోలు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి వైకుంఠపుర రంగారావు మృతి చెం దారు. జడ్పీటీసీ అభ్యర్థు లుగా వైసీపీ తరపున ఘంటా పద్మశ్రీ, టీడీపీ నుంచి మోరు శ్రావణిలో పోటీలో నిలిచారు. 


 దెందులూరు మండలం

దెందులూరు, సెప్టెంబరు 18: మండలంలో 19 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు నేడు ఫలితాలు రానున్నాయి. రామారావుగూడెం, పోతునూరు ఎంపీ టీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం కాగా, దెందులూరు, కొవ్వలి ఎంపీటీసీ అభ్య ర్థులు మృతి చెందడంతో ఇక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 15 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆదివారం కౌటింగ్‌ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ స్థానానికి పోటీలో లేకపోవడంతో వైసీపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం కాగా, మిగిలిన 15 ఎంపీటీసీలకు సంబంధించి ఫలితాలు తేలాల్సి ఉంది.  


సకాలంలో లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలి

పెదవేగి, సెప్టెంబరు 18 : పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అభ్యర్థులు, ఏజెంట్లు సకాలంలో చేరుకోవాలని పెదవేగి మండల ఎన్నికల అధికారి సుబ్బారావు అన్నారు. పెదవేగి మండల పరిషత్‌ కార్యాలయంలో ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సుబ్బారావు ఓట్ల లెక్కింపుపై పలు సూచనలు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఆదివారం ఉదయం ఆరుగంటలకల్లా లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అధికారులు సూచించిన విధంగా నిబంధనలు పాటిస్తూ కేంద్రాలకు రావాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు గెలుపు పత్రాన్ని అభ్యర్థులకు అందిస్తారని ఆయన తెలిపారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.బలరామరాజు, ఎంఈవో సీహెచ్‌.బుధవాసు, ఎంపీటీసీ అభ్యర్ధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T05:28:29+05:30 IST