విహారం ఓకేనా..?

ABN , First Publish Date - 2021-04-15T05:24:20+05:30 IST

పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

విహారం ఓకేనా..?

పాపికొండల టూరిజానికి నేడు ట్రయల్‌ రన్‌

పర్యాటకుల భద్రత ఎంత వరకు

ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తాయా..?

పోలవరం, ఏప్రిల్‌ 14 :

పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత బోట్లలో విహారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కచ్చులూరు ప్రమాదం జరిగిన తర్వాత  2019 సెప్టెంబరు నుంచి గోదావరిలో బోటు షికారును నిలిపివేసింది.. అనేక భద్రత చర్యలు తీసుకున్న తర్వాతే పాపికొండల విహారానికి అనుమతి ఇస్తామని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. పాపికొండల టూరిజానికి అధికారులు నేడు (గురువారం) ట్రయల్‌ రన్‌  నిర్వహించనున్నారు. అయితే గోదావరిలో విహారానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా..? బోట్లలో పూర్తిస్థాయి రక్షణ ఏర్పాట్లు చేశారా.. పర్యాటకుల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు..?వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.


పాపికొండలు యాత్రకు ఇరిగేషన్‌ శాఖ బాతీ మెట్రిక్‌ సర్వే నిర్వహిస్తోంది. గోదావరిలో లోతు ఎక్కడ ఎంత ఉంది.. ?ఎక్కడ ఇసుక దిబ్బలు, కొండలు ఉన్నాయనేదానిపై సర్వే చేసింది. మరో 15 రోజులకు గానీ పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం లేనట్టు సమాచారం. పర్యాటక శాఖ హడావుడిగా కొంత సమాచారం సేకరించి బోటు షికారుకు అనుమతి ఇస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వేసవి కాలంలో గోదావరిలో నీరు తక్కువగా ఉంటుంది. కానీ. రెండు మీటర్ల లోతు ఉంటే చాలని టూరిజం అధికారులు చెప్తున్నారు. పాపికొండల్లో ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం కొన్ని చోట్ల అతి ఎక్కువ లోతు 70 మీటర్ల ఉండగా, కొన్నిచోట్ల కేవలం 3 .నుంచి 5 మీటర్ల లోతు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుత వాతావరణంలో గాలి దుమారాలు వస్తుంటాయి. దీనివల్ల టూరిజం బోట్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలుంటాయి. మూడేళ్ల  క్రితం వాడపల్లిలో పెనుగాలుల కారణంగా లాంచీ నీట మునిగి సుమారు 36 మంది మృత్యువు పాలయ్యారు. 

బోటు పాయింట్‌కు చేరేదెలా..?

పాపికొండల టూరిజానికి వెళ్లాలంటే పర్యాటకులు ముం దుగా సింగన్నపల్లి బోటు పాయింట్‌కు చేరుకోవాలి. అయితే ఇక్కడకు వెళ్లాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావా ల్సిన పరిస్థితులున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న సింగ న్నపల్లి బోటు పాయింట్‌కు పోలవరం నుంచి పర్యా టకులు చేరుకోవాలంటే పది కిలోమీటర్ల మేర కొండలపై ఘాటీలపై అస్తవ్యస్తమైన రోడ్లపై ప్రయాణించాలి.  వేగంగా తిరిగే భారీ ప్రాజెక్టు వాహనాలను తప్పించుకుని వెళ్లడం ప్రమాదకరమే. పోలవరం నుంచి ఈ పది కిలోమీటర్లు ప్రయాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాలి. తూర్పు గోదావరి జిల్లా పోచమ్మగండి నుంచి వెళ్లాలన్నా పరిస్థితి ఇంతే. పురుషోత్తపట్టణం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఏటి గట్టు రోడ్డులో వచ్చి పోయే భారీ ప్రాజెక్టు వాహనాలను దాటుకుంటూ వెళ్లాలి. వాహనం అదుపు తప్పితే నేరుగా గోదావరిలోకే... 

నేడు ట్రయల్‌ రన్‌

పాపికొండల టూరిజానికి గురువారం ట్రయల్‌రన్‌  నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి శాఖ డివిజనల్‌ మేనేజర్‌ వీరనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల బృందం ఉదయం 10 గంటలకు సింగన్నపల్లి బోటు చెకింగ్‌ పాయింట్‌ వద్దకు చేరుకుంటారని అక్కడ నుంచి పాపి కొండల వరకు గతంలో నిర్మించిన బోటు చెకింగ్‌ పాయింట్లను పరిశీలిస్తారని తెలిపారు. పాపికొండల పర్యాటకంలో ఆటంకాలు ఏమైనా ఉంటాయా అనే దిశగా పరిశీలిస్తారు. అనంతరం బోట్ల ఫిట్‌ నెస్‌, లైసెన్సులు అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ నియంత్రణ పరికరాల ఏర్పాటు, కరోనా నివారణ కోసం సామాజిక దూర ఏర్పాట్లు, శానిటైజర్‌, మాస్కులు తదితర అంశాలపై కూడా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతారని తెలిపారు. 

Updated Date - 2021-04-15T05:24:20+05:30 IST