అప్పు.. తిప్పలు!

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

రైతుల ధాన్యం బకాయిలు చెల్లించేందుకు పౌర సరఫరాల కార్పొరేషన్‌ తంటాలు పడుతోంది.

అప్పు.. తిప్పలు!

రైతు ధాన్యం బకాయిల కోసం పౌర సరఫరాల కార్పొరేషన్‌ తంటాలు
బియ్యం తాకట్టు పెడుతోందా?
అప్పు పుడితేనే రైతులకు సొమ్ములు
జాప్యానికి కారణమిదే.. పోరుబాటలో రైతులు


 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
రైతుల ధాన్యం బకాయిలు చెల్లించేందుకు పౌర సరఫరాల కార్పొరేషన్‌ తంటాలు పడుతోంది. మరోవైపు రైతులు రోడ్డెక్కుతున్నారు. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైనా ప్రభుత్వం సొమ్ములు చెల్లించలేక చేతులెత్తేసింది. పౌర సర ఫరాల కార్పొరేషన్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయింది. ఫలితంగానే సొమ్ములు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. వాస్తవానికి కార్పొరేషన్‌ రుణం తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తాయి. అందువల్లే కాంట్రాక్టర్లు పౌర సరఫరాల కార్పొరేషన్‌ అంటే ఎగబడుతుంటారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారి కార్పొరేషన్‌ అప్పులు వేల కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు రైతును వెంటాడుతోంది. ప్రభుత్వం సక్రమంగా సొమ్ములు చెల్లించలేక పోతోంది. గడువు పెంచుతూ పోతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 48 గంటల్లో  సొమ్ములు విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం 48 రోజులైనా చెల్లించ లేని దుస్థితికి చేరుకుంది. పౌరసరఫరాల కార్పొరేషన్‌కు అప్పు పుట్టడం లేదు. దాంతో బియ్యం తాకట్టుపెట్టి సొమ్ములు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం సాగుతోంది. సొమ్ముల కోసం ఎదురు చూసిన రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం, వామపక్షాలు రైతు పక్షాన పోరాడుతున్నాయి.

పేరుకుపోయిన బకాయిలు
జిల్లాలో ఏప్రిల్‌ 14 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.1200 కోట్లు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు కేవలం రూ.265 కోట్లు మాత్రమే చెల్లించగా మరో రూ.935 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెద్ద మొత్తంలోనే బకాయిలు పేరుకుపోవడంతో రైతులు బ్యాంకులకు రుణాలు, గ్రామాల్లో కమీషన్‌దారుల అప్పులు తీర్చలేకపోతున్నారు. చక్రవడ్డీలతో వారిపై భారం అధికమవుతోంది.

మద్దతు ధరను కోల్పోతున్న వైనం
ప్రభుత్వం సొమ్ములు చెల్లింపులో జాప్యం చేయడంతో రైతులు కమీషన్‌ దారులను ఆశ్రయిస్తున్నారు. త్వరితగతిన సొమ్ములు ముడతాయన్న ఉద్దేశంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రస్తు త రబీలో అదే జరిగింది. ఎక్కు వ మంది రైతులు ప్రభుత్వం కొనుగోలు వరకు ఎదురు చూడలేదు. కమీషన్‌ దారులకు అమ్మకాలు సాగించారు. ఈ క్రమంలో బస్తాకు రూ.200 కోల్పోయారు.  తక్కువ ధరకు  కమీషన్‌దారులే సేకరించి కొనుగోలు కేంద్రాలకు అప్పగించారు. ప్రభుత్వ జాప్యం  రైతులకు నష్టపెడుతోంది.

 లక్ష్యం చేరుకోలేని దుస్థితి
ఏటా జిల్లాలో  లక్ష్యానికి మించి ఽ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సి వచ్చేది. భారత ఆహార సంస్థ లెవీ సేకరించినప్పుడు మిల్లర్లు ప్రత్యేక అను మతులు తెచ్చుకునేవారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించిన తర్వాత కూడా లక్ష్యం పెంచేవారు. ఈ ఏడాది రబీలో లక్ష్యం చేరుకోలేదు. జిల్లాలో 7.83 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సంకల్పించి పౌర సరఫరాల కార్పొరేషన్‌కు దిశానిర్దేశం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 6.70 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. మరో మూడురోజులు మాత్రమే వ్యవధి ఉండగా కొనుగోళ్లు 7 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రైతులు ప్రైవేటు వర్తకులను ఆశ్ర యించడం వల్లే ప్రభుత్వానికి ధాన్యం చేరుకోలేదు. వాస్తవానికి మద్దతు ధర కంటే అధికంగా వస్తే రైతులు వ్యాపారులను ఆశ్రయించేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. మద్దతు ధరకంటే తక్కువకు కూడా వ్యాపారులకే అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి విక్రయిస్తే ఎప్పటిలోగా సొమ్ములు విడుదలవుతాయో చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి వేచి చూడక తప్పడం లేదు. దాంతో మద్దతు ధరకంటే తక్కువ అయినా సరే వ్యాపారులకు విక్రయించుకో వడమే మేలన్న పరిస్థితికి రైతులు చేరుకున్నారు.  

 అప్పు దొరికితేనే సొమ్ములు
 రైతులకు సొమ్ములు చెల్లించాలంటే పౌర సరఫరాల కార్పొరేషన్‌కు అప్పు పుట్టాల్సిందే. గతంలో రిజర్వ్‌బ్యాంకు సొమ్ములు సమకూర్చేది. వాటితో పౌర సరఫరాల కార్పొరేషన్‌ ధాన్యం కొనుగోలు చేసేది. బియ్యం సేకరించి ప్రభు త్వానికి అప్పగించేది. బియ్యం సొమ్ములు తిరిగి పౌర సరఫరాల శాఖకు జమ చేసేవారు. ఆ సొమ్మును తిరిగి బ్యాంకుకు చెల్లించేవారు. రైతులకు సొమ్ములు చెల్లింపు గంటల వ్యవధిలోనే జరిగిపోయేది. ఇప్పుడు రోజులు పడుతోంది. పౌర సరఫరాల కార్పొరేషన్‌కు ప్రైవేటు అప్పులే దిక్కవు తున్నాయి. మొత్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ఈక్రమంలో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST