కొవ్వూరు బ్రిడ్జిపై నుంచి గోదారిలోకి దూకిన వృద్ధ దంపతులు
మోటారు సైకిల్, సెల్ ఫోన్ ఆధారంగా గుర్తింపు ..
ముమ్మర గాలింపు
కొవ్వూరు/గోకవరం: వృద్ధ దంపతులకు ఏం కష్టం వచ్చిందో తెలియదు. మనుమలు, మనుమరాళ్లతో సరదాగా గడపాల్సిన వారు అర్ధంతరంగా తనువు చాలించాలనుకుని గోదావరిలోకి దూకేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదకు చెందిన కొత్తపల్లి రామారావు (68), సీతామహాలక్ష్మి (67) ఏడేళ్ల క్రితం గోకవరం మండలం తంటికొండ వచ్చేశారు. రామా రావు అక్కడ చికెన్ వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం ఉదయం వీరిద్దరూ స్కూటీపై రాజమహేంద్రవరం– కొవ్వూరు గామన్ బ్రిడ్జి చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరిలోకి దూకేశారు. బ్రిడ్జిపై ఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్, మోటారు సైకిల్ ఆధారంగా వీరిని గుర్తించారు. పోలీసులు ఈ ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు.
వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై గోకవరం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తునట్లు కొవ్వూరు పట్టణ ఎస్ఐ ఎం.కేశవరావు తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారితో వున్న విభేదా లతోపాటు ఎవరికీ భారం కాకూడదని భావించి ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు చెబుతున్నారు. తంటికొండలో వున్న వీరి వద్దకు ఏడేళ్లలో ఏనాడు వారి కుమార్తెలు వచ్చిన జాడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.