ముహూర్తం మించి పోతోంది

ABN , First Publish Date - 2021-05-14T05:36:52+05:30 IST

జాతీయ రహదారి ఆనుకుని పెరవలిలో ఆయనకు ఒక కల్యాణ మండపం ఉంది..పెళ్లిళ్ల సీజన్‌ వస్తేనే కల్యాణ మండపాలకు గిరాకీ..

ముహూర్తం మించి పోతోంది

శుభకార్యాలకు మళ్లీ కరోనా బ్రేకులు

వాయిదా పడుతున్న పెళ్లిళ్లు

వీటిపై ఆధారపడిన వారందరికీ ఇబ్బందులు

ఉపాధి పోయిందంటూ లబోదిబో

కల్యాణ మండపాల అడ్వాన్సులు వెనక్కి..


భీమవరం టౌన్‌/ ఏలూరు రూరల్‌ మే 13 :

జాతీయ రహదారి ఆనుకుని పెరవలిలో ఆయనకు ఒక కల్యాణ మండపం ఉంది..పెళ్లిళ్ల సీజన్‌ వస్తేనే కల్యాణ మండపాలకు గిరాకీ.. గతేడాది కరోనా పుణ్యమా అని ఒక పెళ్లి కూడా తగల్లేదు.. వాచ్‌మన్‌, స్వీపర్‌ జీతాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ కలిపితే ఏడాదికి మూడు లక్షలు పైనే మెయింటినెన్స్‌ ఖర్చులు అవుతాయి.. అవికూడా రాని పరిస్థితి..ఈ ఏడాదైనా ఒడ్డున పడదామనుకుంటే బుక్‌ చేసుకున్న వారు అడ్వాన్సులు వెనక్కు ఇచ్చేయ మంటున్నారని గొల్లుమంటున్నాడాయన...


ఆయన పేరు శ్రీనివాస్‌.. తణుకులో ఫొటో స్టూడియో ఉంది. వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ ఏడాది మూహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు బాగానే ఒప్పుకున్నారు. సహాయం కోసం కుర్రాళ్లను కూడా కుదుర్చుకున్నారు. ఇప్పుడేమో పెళ్లి వాయిదా వేశాం.. తర్వాత చూద్దామంటూ పెళ్లివారు చల్లగా చెప్పడంతో ఏం చేయాలో తోచక లబోదిబోమంటు న్నాడు... వీరే కాదు..దీనిపైనే ఆధారపడిన వారి అందరి పరిస్థితి ఇలానే ఉంది..


మూహూర్తాల వేళ కరోనా మళ్లీ ముప్పు ముంచు కొచ్చింది.. ఎంతో ఆశగా ఎన్నో రోజులుగా మంచి రోజుల కోసం చూస్తున్న వారంతా ఇప్పుడు లబోదిబోమం టున్నారు..పెళ్లిళ్ల సీజన్‌పై ఆధారపడిన వారందరినీ కరోనా రెండోసారి దెబ్బతీసింది. పురోహితుల నుంచి బాజా భజంత్రీలు, షామియానా, క్యాటరింగ్‌, వీడియోగ్రఫీ, కల్యాణ మండపాలు..ఇలా అందరికీ చేయిచ్చింది..ఉపాధి లేకుండా చేసింది.. మరోపక్క ఎంతో ఘనంగా సందడిగా చేసుకుందా మని ముందే  పెళ్లి ఏర్పాటు చేసుకున్న వారంతా ఇప్పుడు చేసేది లేక వాయిదా వేసుకుంటున్నారు. జీవితంలో ఒకసారి జరిగే ఈ ముచ్చట ఎంతో ఘనంగా చేయాలని అంతా అనుకుం టారు.. కానీ కరోనా పెళ్లి సందడికి తెరవేస్తోంది. గతేడాది కరోనా దెబ్బతో పెళ్లిళ్లన్నీ మమ అనిపించారు. ఇప్పుడు కూడా ముహూర్తాల వేళ కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు పెళ్లిళ్లన్నీ వాయిదా పడుతున్నాయి. వీటిపై ఆధారపడిన వారంతా తమ ఉపాధి దెబ్బ తీసిందంటూ ఉసూరు మంటున్నారు. కల్యాణ మండపాల కోసం ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కు ఇమ్మంటూ పోరు పెడుతున్నారు. బాజా భజంత్రీలకు, షామియానాలకు, పురోహితులకు, కేటరింగ్‌ వారికి తర్వాత చెబుతామంటూ సమాచారం అందిస్తున్నారు. కొందరు పెళ్ళిళ్లు వాయిదా వేసుకుంటే ఇంకొందరు మంచి ముహూర్తం రాదనే భావనతో ప్రభుత్వ నిబంధనల మేరకు అతిధుల సంఖ్యను 50 లోపు కుదించి వేడుక జరిపించేందుకు మొగ్గు చూపుతున్నారు. 


ముహూర్తాలు బాగానే ఉన్నాయి

ఏప్రిల్‌ 29 నుంచే మంచి ముహూర్తాలు మొదల య్యాయి. ఎక్కువగా ఈనెల 14 నుంచి జులై 4 వరకూ ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 22న అత్యుత్తమ ముహూర్తం అవడంతో ఆ రోజు ఒక్కటే వందల సంఖ్యలో పెళ్ళిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 14, 22, 23, 26, 28, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌ నెలలో 1,2,3,4,5,17, 18,19,20,23,25, 26,27 తేదీల్లో ముహూర్తాలు ఉండగా వీటిలో 3, 19, 20, 27న బలమైన ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెలకు సంబంధించి 1,2,3 తేదీలు ఉండగా తరువాత ఆషాఢం ప్రారంభం కావడంతో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 10వ తేదీ నుంచి ఉన్నాయని చెబుతున్నారు. కొంతమంది వచ్చే నెలలో చేయడానికి నిర్ణయించుకోగా మరి కొంత మంది ఆగస్టు నెలకు మార్చుకుంటున్నారు.  ఇలా పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. 



పురోహితులకు ఇబ్బందులే

వేలూరి వెంకట్రామయ్య శర్మ  భీమవరం

శుభకార్యాలు వాయిదా పడడంతో పురోహితులకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయి. గతేడాది సరిగ్గా ముహూర్తాలు ఉన్న సమయంలోనే కరోనా రావడంతో శుభకార్యాలు ఆగిపోయాయి. ఈసారి  ముహూర్తాలు  బాగున్నాయని అనుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ వచ్చిపడింది. తక్కువ మందితో శుభకార్యాలు జరిగినా అంతగా ప్రతిఫలం కనిపించదు. 


కేటరింగ్‌లు ఒప్పుకోవడం లేదు.

ప్రభల అపర్ణ ,ఐశ్వర్య కేటరింగ్‌, భీమవరం

శుభకార్యాలకు వంటలు చేసేందుకు కేటరింగ్‌ ఆర్డర్లు వస్తున్నా ఒప్పుకోవడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో చాలా వరకు వాయిదా పడడంతో ఆగిపోయాయి. అంతే కాకుండా కరోనా కారణంగా సహాయకులు రావడం లేదు. తక్కువ మందితో శుభకార్యాలు జరుగుతున్నవాటికి కేటరింగ్‌ చేయాలని అడుగుతున్నారు. కరోనా కారణంగా గతేడాది నష్టపోయాం. ఈసారి అదే పరిస్థితి.


ముందస్తు ఆర్డర్లు లేవు

 అర్జున్‌, ప్లవర్‌ డెకరేటర్‌, భీమవరం

గతంలో పూల మండ పాలకు నెలరోజుల ముందే బుక్‌చేసేవారు. మోడల్‌ చెప్పేవారు. దీని ఆధారంగా పూలను బుక్‌ చేసుకునే వాళ్లం. ఇప్పుడు కరోనా దెబ్బకు వివాహాలు  వాయిదా పడడంతో ఈసారి ఈ వ్యాపారానికి నష్టమే. పువ్వులు అమ్ముకుందామని అనుకున్నా ఇతర ప్రాంతాల నుంచి 10 గంటలు దాటితే కాని మార్కెట్‌కి రావు.. అన్నీ సిద్ధం చేసుకునే సరికి సమయం అయిపోతోంది.

 

ఫొటోగ్రాఫర్స్‌కు కష్టాలే

శేనం నాగేశ్వరరావు ,భీమవరం 

ఈ సారి శుభకార్యాల వల్ల కష్టాలు తీరుతాయని భావించిన ఫొటోగ్రాఫర్లకు కరోనా కారణంగా కష్టాలే కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బుక్‌ అయిన శుభకార్యాల్లో చాలా వరకు వాయిదా పడ్డాయి. గతేడాది కూడా తీవ్రనష్టం కలిగింది. కొద్దిపాటి వివాహాలు జరిగినా అంతగా కలసి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.


ఆంక్షలతోనైనా వివాహాలను అనుమతించాలి 

బొందలపాటి సుబ్రహ్మణ్యశర్మ, ఏలూరు

 ఈనెల 14, 22, 23, 26, 28, 30 తేదీల్లో ఉత్తమ ముహూర్తాలు ఉన్నాయి. ప్రధానంగా 22న అత్యుత్తమమైనది కావడంతో ఆరోజు అత్యధికంగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో నిర్వహించే వివాహాల వల్ల సంపాదించుకునే ఎంతో కొంత డబ్బే ఏడాది మొత్తం జీవనాధారం. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయాం. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.ఈ సారి ఉపాధి లేకుంటే పురోహితులకు కష్టాలు తప్పవు.  

Updated Date - 2021-05-14T05:36:52+05:30 IST