వివరాలు తెలుపుతున్న డీఎస్పీ దిలీప్ కిరణ్
చంపేసి.. రోడ్డుపై పడేసి..
ప్రియురాలి భర్త హత్య
బీమా సొమ్ము కోసం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
భీమడోలు(పశ్చిమ గోదావరి): వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. ప్రియురాలి నుంచి ఆమె భర్తను దూరం చేయడంతో పాటు ఆమెను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్ బీమా సొమ్ము వచ్చేవిధంగా కుటిలయత్నం చేసి ఆమె భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఆ పై పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..
భీమడోలు మండలం వడ్డిగూడెంకు చెందిన వ్యక్తితో కలిసి అంబర్‌పేటకు చెందిన సాయల పెంటయ్య కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కూలీ భార్యతో పెంటయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై భార్యభర్తలు తరచు గొడవపడేవారు. అయితే తమ సంబంధానికి భర్త అడ్డు తగులుతున్నాడనే ఆలోచనతో హత్య చేసేందుకు ఇద్దరూ పథకం వేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియురాలి భర్తకు మందులు కొని ఇచ్చేందుకు పెంటయ్య గతనెల 3వ తేదీన అతడిని వెంట బెట్టుకుని గుండుగొలను వచ్చాడు. అక్కడ రాత్రి సమయం కావడంతో ఎవరు రోడ్డుపై తిరగక పోవడాన్ని గమనించిన పెంటయ్య అప్పటికే మోటారు సైకిల్లో ఉంచిన సెంట్రింగ్ రాడ్డుతో ప్రియురాలి భర్త తలపై కొట్టి హత్యచేసి ఆపై మృతదేహాన్ని రోడ్డుపై పడవేశాడు.
ఎవరికి అనుమానం రాకూడదనే ఆలోచనతో మోటారు సైకిల్‌ను కూడా రాడ్డుతో ధ్వంసం చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. తనకు కూడా గాయాలైనట్లుగా పక్కనే ఉన్న పంట బోదెలో పడి స్పృహ కోల్పోయినట్లు నటించాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే వైఎస్ఆర్ బీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు వస్తాయని అప్పుడు ప్రియురాలితో సహజీవనం కొనసాగించవచ్చునని ఈ పథకం వేశారు. అయితే ఈ సంఘటనపై భీమడోలు పోలీసులు అప్పట్లో రోడ్డు ప్రమాద ఘటనగా కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు చేపట్టి హత్య కేసుగా నిర్ధారించారు. నిందితుడు పెంటయ్య, ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.