చేతివాటం!

ABN , First Publish Date - 2022-05-27T06:08:23+05:30 IST

స్వయం ఉపాధి లక్ష్యంగా అర్హులైన మహిళలందరికీ వివిధ పథకాల లబ్ధికూర్చేలా నడుస్తున్న స్వయం సహాయక సంఘాల పొదుపు సొమ్మును కొందరు వ్యక్తిగతంగా వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతుం డడంతో పొదుపు సొమ్ముకు భద్రత కరువవుతోంది.

చేతివాటం!

పొదుపు సొమ్ముకు భద్రత కరువు
పక్కదారి పట్టిస్తున్న కొందరు సీఆర్పీలు
పట్టణ, పల్లెల్లోనూ స్వయం సహాయక సంఘాల  సొమ్ము దుర్వినియోగం


భీమవరం, మే 26 : స్వయం ఉపాధి లక్ష్యంగా అర్హులైన మహిళలందరికీ వివిధ పథకాల లబ్ధికూర్చేలా నడుస్తున్న స్వయం సహాయక సంఘాల పొదుపు సొమ్మును కొందరు వ్యక్తిగతంగా వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతుం డడంతో పొదుపు సొమ్ముకు భద్రత కరువవుతోంది. ఇలాంటి ఘటనలు ఈ ఏడాది బాగా పెరిగాయి. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం వంటి పట్టణా లతో పాటు పెనుమంట్ర వంటి గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. పట్టణాలలో అయితే ఉమ్మడి జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 206 కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. పట్టణాల్లో ప్రభుత్వ గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో మెప్మా సభ్యులుగా ఉన్నవారికి పునాది దశలో రూ.35 వేల రుణాన్ని ఇస్తున్నారు. దీంతో సంఘాలకు ప్రాధాన్యం పెరిగింది.  ఉమ్మడి జిల్లాలో ఏలూరు నగర పాలక సంస్థతో పాటు 8 పురపాలక సంఘాల్లో 12,679 స్వయం సహాయక సంఘాలున్నాయి. కొత్త జిల్లాలో అయితే భీమ వరంలో 1,990, నరసాపురం 880, పాలకొల్లు 1,150, తాడేపల్లిగూడెం 1,730, తణుకు 1,158 కలిపి మొత్తం 6908 సంఘాలు ఉన్నాయి. వాటిలో 1.26 లక్షలకు పైగా సభ్యులున్నారు. వీరికి బ్యాంక్‌ లింకేజీ రుణాలుగా ఏటా రూ.123 కోట్లు ఇస్తున్నారు. సక్రమంగా వాయిదాల సొమ్ము చెల్లించే సంఘాలకు రుణ పరి మితిని రూ.20 లక్షల వరకు పెంచారు. చెల్లింపులు నూరుశాతం ఉండడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు ముందు కొస్తున్నాయి. రుణాలు పొందిన సంఘాల్లో సభ్యులు చిరు వ్యాపారాలు చేస్తూ తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని  మెరుగుపరుచు కొంటున్నారు. మండలాల్లో 14,000 పైగా సంఘాలున్నాయి.

సంఘం పటిష్టంగా ఉన్నా..
ప్రతీ స్వయం సహాయక సంఘంలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 8 మంది సభ్యులతో పటిష్టంగా ఉన్నా కొన్ని సంఘాల్లో నిధుల మళ్లింపులో చేతివాటం ప్రదర్శిస్తునే ఉన్నారు. సంఘం ఏర్పాటు సమయంలో సభ్యులంతా రూ.100 చొప్పున పొదుపు ఖాతాలో జమ చేస్తారు. ఆరు నెలల పాటు పొదుపు ఖాతాలో నగదు జమ చేసిన తర్వాత తొలి విడత రుణంగా రూ.70 వేలు నుంచి రూ.లక్ష వరకు ఇస్తారు. ఆపై రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా రుణాన్ని పొందవచ్చు. సంఘ సమావేశాన్ని ప్రతీనెలా ఏర్పాటు చేసి తీర్మానాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్ని నిబంధనలున్నా కొందరు ప్రతినిధులు గ్రూపు సొమ్ము దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

భీమవరంలో గతం నుంచీ..

ఈ ఏడాది ఏప్రిల్‌లో భీమవరం మునిసి పాలిటీలో మరో కేసు వెలుగు చూసింది. సభ్యులకు తెలియకుండా సీఆర్పీ సభ్యులు ఇద్దరూ సుమారు రూ.23 లక్షలను సొంతా నికి రుణం తీసుకున్నారు. పొదుపు సభ్యుల కు నోటీసులు రావడంతో వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారంలో పట్టణ వైసీపీ అధ్యక్షురాలిపై పొదుపు సంఘాలు తరపున మెప్మా అధికారులు చర్యలు తీసుకున్నారు. సొమ్ము వారి నుంచే రికవరీ పెడుతున్నారు. అలాగే 2019 ఆగస్టులో భీమవరంలో ఆరు సంఘాలకు సంబంధించి పొదుపు ఖాతా లోని సొమ్మును 14.95 లక్షలను సీఆర్పీ సొంతానికి మళ్లించారు. ఇద్దరిపై కేసు నమో దు చేసి చర్యలు తీసుకున్నారు. పాలకొల్లు మునిసిపాలిటీ పరిధిలో గత నెలలో ఇలాంటి దుర్వినియోగం జరగ్గా తాడేపల్లిగూడెం, తణుకు, ఇటీవల పెనుమంట్రలో ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

Updated Date - 2022-05-27T06:08:23+05:30 IST