భూమెక్కడ?

ABN , First Publish Date - 2022-05-20T05:59:06+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల తీరుస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ – మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌) పథకం భూసేకరణ ముందడుగు పడడం లేదు.

భూమెక్కడ?

ఎంఐజీ స్మార్ట్‌టౌన్‌ షిప్‌లకు భూ సేకరణ కష్టాలు
 ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఎంఐజీ గృహ నిర్మాణమంటూ ఆదేశాలు
 పట్టణాల్లో ఆకాశాన్నంటుతున్న ధరలు
 భూమి దొరకడమే గగనం..
 చేతులెత్తేస్తున్న రెవెన్యూ యంత్రాంగం


భీమవరం, మే 19 :
పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల తీరుస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ  – మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌) పథకం భూసేకరణ ముందడుగు పడడం లేదు. ఇంతలో కొత్తగా ప్రతీ అసెంబ్లీ కేంద్రంలో కూడా ఎంఐజీ గృహ నిర్మాణం చేయాలని, భూసేకరణ చేయాలని ఆదేశించడంతో యంత్రాంగం గగ్గోలు పెడుతోంది. పట్టణ ప్రాంతాల్లో భూమి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఎకరం భూమి కొనగలమా..? మన జిల్లాలో అ యితే మా వల్ల కాదని ఓ రెవెన్యూ అధి కారి వాపోయారు. ఇప్పటికే అన్ని చో ట్లా భూముల కొరత ఉండడంతో జగనన్న ఇళ్ల స్థలాలకు సేకరణకు రెవెన్యూశాఖ అష్టకష్టాలు పడుతోం ది. చాలాచోట్ల పూడిక జరగలేదు. మరల ఎంఐ జీ స్మార్ట్‌టౌన్‌ షిప్‌కు భూసేకరణ చేయాలన్న ఆదేశాలతో మళ్లీ ఆపనిలో పడ్డారు.

గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పట్టణ ప్రాంత ప్రజలకు ఎంఐజీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి ఆశలు రేకెత్తించింది. మునిసిపాలిటీలు గత ఏప్రిల్‌, మే నెలలో దరఖాస్తులను ఆహ్వానించగా జనం పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇళ్ల కోసం భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటి వరకూ మధ్యతరగతి ప్రజలకు అన్ని వసతులతో కూడిన గృహాల నిర్మాణం కోసం భూసేకరణ పెద్ద అవరోధంగా మారింది. పూర్తిస్థాయి మౌలిక వసతులతో లేఅవుట్లును లాభాపేక్ష లేకుండా అందించేందుకు పురపాలకశాఖ ద్వారా స్మార్ట్‌ టౌన్లు ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది. ఏడాదైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. కేవలం తాడేపల్లిగూడెంలోనే 10 ఎకరాలు గుర్తించారని సమాచారం. ఈ పథకంలో భూసేకరణ ప్రక్రియకు ఏడాది నుంచి చేస్తు న్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కేవలం ప్రభుత్వ శాఖల వద్ద వారు వినియోగించుకోకుం డా మిగిలి ఉన్న భూములను రెవెన్యూశాఖ గుర్తించాల్సి ఉం టుంది. ఈ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు నివేదిక అందజేయాల్సి ఉంటుందని ఆదేశాలున్నాయి. కొత్త జిల్లా ఏర్పడ్డాక భూసేకరణ మరింత జఠిలమైనది.

 ఆ భూముల జోలికి వెళ్లొద్దు..
కొన్ని శాఖల భూముల జోలికి వెళ్లవద్దని రెవెన్యూశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ గతేడాది జూలై 27వ తేదీన ఇచ్చిన 193 జీవో ఉత్తర్వులు వల్ల భూసేకరణకు పెద్ద అవరోధమైనది. దేవదాయ, ధర్మదాయశాఖకు చెందిన భూములను, విద్యాశాఖ భూములను, వక్ఫ్‌ భూములను, ఇతర ధార్మిక సంస్థలకు చెందిన భూములను, పర్యావరణానికి ఇబ్బందులు కలిగించే భూములను, జలవనరులశాఖకు చెందిన చెరువులు, కాల్వల భూములను, ఎత్తైన కొండ ప్రాంతం భూ ములను, వివిధ వాజ్యాలతో అభ్యంతరకరంగా ఉన్నవి, కమ్యూనిటీ పోరంబోకు భూములను సేకరించవద్దని జీవోలో స్పష్టం చేశారు.

 భూముల ఎంపికకు మార్గదర్శకాలు..
స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుకు భూములను ప్రజలకు అందుబాటు లో ఉండేచోట ఎంపిక చేయాల్సిన బాధ్యత పురపాలకశాఖదైతే, భూసేకరణ రెవెన్యూశాఖది. మునిసిపల్‌ కార్పొరేషన్లలో గరిష్టంగా 5కి.మీ. పరిధిలో, మునిసిపాలిటీలలో గరిష్టంగా 3 కి.మీ. పరిధిలోపు ఉన్న భూములను ఎంపిక చేయాలి. ఇందు కు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంత రకూ ముందడుగు పడలేదు. పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఎంఐజీ భూములు సేకరణ కత్తిమీద సాముగా మారిందనడంలో అతిశయోక్తి లేదు.

ఉమ్మడి జిల్లాలో  17,418 దరఖాస్తులు..
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు, 8 పట్టణాలు, నగర పంచాయతీలు చింతలపూడి, ఆకివీడుల పరిధిలో ఒకటి స్మార్ట్‌ టౌన్ల లేఅవుట్లు అభివృద్ధి చే యాలని ప్రతిపాదించారు. ఇందుకు గతేడాది ఏప్రిల్‌లో మునిసిపాలిటీలు దరఖాస్తులు ఆహ్వానించాయి. భీమవరం 634, ఏలూరు 1842, తాడేపల్లిగూడెం 185, నిడదవోలు 136, కొవ్వూరు 347, జంగారెడ్డిగూడెం 81, పాలకొల్లులో 37 మంది మొత్తం 17,418 దరఖాస్తులందాయి. వీరికి 1200 ఎకరాల పైగా అవ సరం ఉంటుందని అంచనా. జనాభాను బట్టి ఒక్కో లేఅవుట్‌ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలన్న ఉత్తర్వులున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం స్పెషల్‌ గ్రేడ్‌, సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలైన భీమవరం, తాడేపల్లిగూడెంలలో 75 ఎకరాల చొప్పున లేఅవుట్లు అభివృద్ధి చేయాలి. మిగిలిన గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌ –3లో ఉన్న 6 మునిసిపాలిటీల్లో 50 ఎకరాల చొప్పున, ఆకివీడు, చింతలపూడి నగర పంచాయితీల్లో 25 ఎకరాల వంతున లేఅవుట్లు సిద్ధం చేయాల్సి ఉంది. కానీ అంతకంటే ఎక్కువ భూమి సేకరించాలని దరఖాస్తులు బట్టి అర్థమవుతోంది. ఇక భీమవరంలో ఈ పథకానికి 140 ఎకరాలు సేకరిస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ గతేడాది ఆగస్టు నెలలో ప్రకటించారు. 

Updated Date - 2022-05-20T05:59:06+05:30 IST