త్వరలో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తా..

ABN , First Publish Date - 2022-08-15T05:45:18+05:30 IST

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయ మౌనం వీడారు.

త్వరలో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తా..
సమావేశంలో మాట్లాడుతున్న కొత్తపల్లి

మౌనం వీడిన కొత్తపల్లి
ముఖ్య అనుచరులతో   సమావేశం


నరసాపురం, ఆగస్టు: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయ మౌనం వీడారు. మూడు నెలలుగా ఆయన సబ్ధతగా ఉంటూ ఉన్నారు. పలకరింపులు, పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకే పరిమితమయ్యారు. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో కొత్తపల్లి రాజకీయంపై  ఆసక్తికర చర్చ నెలకొంది. అయితే ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో శనివారం రాత్రి ఆయన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. స్వాతంత్ర వేడుకల నిర్వహణపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి విచ్చేసిన అనుచరులు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. దీనిపై స్పందించిన కొత్తపల్లి త్వరలో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్నదానిపై ఆసక్తికర చర్చకు తెరతీసింది. గత ఎన్నికల వరకు కొత్తపల్లి టీడీపీలో కొనసాగారు. చివరి నిముషం వరకు టిక్కెట్‌ ఆశించినా బండారుకు టిక్కెట్‌ ఇవ్వడంతో పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. రెండున్నర ఏళ్లు ఆ పార్టీలో కీలకంగా వ్యవహారించారు. ఆ తర్వాత కోఆప్షన్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే ముదునూరి  ప్రసాదరాజుతో తలెత్తిన విభేదాలు భగ్గుమన్నాయి. ఇది వీడకుండానే జిల్లా కేంద్రం భీమవరం తరలిపోవడంతో జేఏసీ చేపట్టిన ఆందో ళనలో కొత్తపల్లి కీలక భూమిక పోషించారు. జిల్లా కేంద్రం తరలివెళ్లడం ఎమ్మెల్యే ముదునూరి  అసమర్థతతే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈ తర్వాత కొన్ని రోజులకు తన నివాసంలో విలేకరుల సమావేశం పెట్టి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో   మరోమారు ముదునూరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో అధిష్ఠానం ఆయనను సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి కొత్తపల్లి సైలెంట్‌గా ఉంటూ వచ్చారు.

Updated Date - 2022-08-15T05:45:18+05:30 IST