సాగుతున్న కసరత్తు!

ABN , First Publish Date - 2022-09-12T05:08:24+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ల పథకం అమలుకు చేపట్టిన కసరత్తుతో ఆ శాఖలో పదోన్నతులు వ్యవహారం ముందుకు సాగడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

సాగుతున్న కసరత్తు!

కొలిక్కిరాని ఎంపీహెచ్‌ఎస్‌ పదోన్నతులు.. సచివాలయాలకు ఏఎన్‌ఎంల సర్దుబాట్లు
నెల రోజులుగా సాగుతున్న ప్రక్రియ..
విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాట్లలో  వైద్యశాఖ నిమగ్నంతో జాప్యం

భీమవరం, సెప్టెంబరు 11 : వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ల పథకం అమలుకు చేపట్టిన కసరత్తుతో ఆ శాఖలో పదోన్నతులు వ్యవహారం ముందుకు సాగడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు గ్రామ సచివాలయాలకు ఆయా మండల పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏఎంఎంలను సర్దుబాటు చేసే వ్యవహారం కొలిక్కి రాలేదు. ఈ ఏడాది ఆగస్టులో ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న వారికి పీహెచ్‌ఎన్‌లుగా పదోన్నతి కల్పించనున్నట్టు సమాచారం ఇచ్చారు. రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో సీనియర్లు జాబితా 300 మంది పైగా ప్రకటించి ఆన్‌లైన్‌లో ఉంచారు. అయితే ఇందులో ఎంతమందికి పదోన్నతులు వస్తాయో తెలియని పరిస్థితి. జిల్లాలో సుమారు 40 మందికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే రెండో నెల గడుస్తున్నా దీనిపై తదుపరి చర్యలు ఇంతవరకూ వైద్యశాఖ  తీసుకోలేదు.
 అన్ని గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లలో ఏఎన్‌ఎం ఖాళీలను జిల్లాలోని పీహెచ్‌సీలలో పనిచేస్తున్న ఏ–కేటగిరికి చెందిన ఏఎన్‌ఎంల ద్వారా సర్దుబాటు భర్తీకి ఏపీ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ గతనెల 1న ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సబ్‌ సెంటర్ల ద్వారా అందజేస్తున్న సేవలన్నీ గ్రామ/వార్డు ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నందున ఇప్పటికే ఉన్న సబ్‌ సెంటర్లను రద్దు చేయగా, ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉంటే ఖాళీగా ఉన్న చోట్ల సర్దుబాటుకు చర్యలు చేపట్టారు. ఇన్‌ సర్వీస్‌ జీఎన్‌ఎం శిక్షణ కోర్సుకు వెళ్లిన వారి ఖాళీలను సర్దుబాటు చేస్తూ గత నెల 8నాటికి మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు కసరత్తును నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయకపోయినా, గ్రామ/వార్డు సచివాయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా సదరు బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ హెచ్చరిస్తూ గతనెలలో ఆదేశించింది. కౌన్సెలింగ్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా ఆ ప్రక్రియలో సర్దుబాట్లు ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. దీంతో అటు పదోన్నతులకు, ఇటు సర్దుబాటులో ఫలానా ఊరు వెళ్లవచ్చన్న ధీమా సడలి ఉద్యోగులు గందరగోళంతో ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2022-09-12T05:08:24+05:30 IST