జగనన్న కాలనీకి దారేదీ!

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

మండల కేంద్రమైన పాలకోడేరులో జగనన్న కాలనీకి దారి గండం ఏర్పడింది.

జగనన్న కాలనీకి దారేదీ!

నాన్‌ లేఅవుట్‌లోని ప్రైవేటు రహ దారే దిక్కు
ఆ లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వని వైనం
దారి లేకుంటే లబ్ధిదారులకు  ఇబ్బందులే..
పట్టించుకోని అధికార యంత్రాంగం



మండల కేంద్రమైన పాలకోడేరులో జగనన్న కాలనీకి దారి గండం ఏర్పడింది. లే అవుట్‌కు స్థలం సేకరిం చిన అధికారులు దానికి వెళ్లే మార్గం  ఉందా.. లేదా అన్నది గుర్తించకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ కాలనీలో ఇళ్లు కట్టుకోవాలంటే నాన్‌ లేఅవుట్‌లో ఉన్న ఓ ప్రైవేటు రోడ్డే దిక్కు.. అయితే ఆ నాన్‌ లేఅవుట్‌కు అఽధికారులు అనుమతి ఇవ్వడం లేదు. దారి లేకుండా పేదలకు స్థలాలు ఇచ్చిన  ఈ కథేంటో మీరే చదవండి..


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మండల కేంద్రమైన పాలకోడేరులో వేణుగోపాల్‌ అనే వ్యక్తి 22 సెంట్ల స్థలంలో లేఅవుట్‌ వేశారు. అందు లో 11 సెంట్లు రహదారికి విడిచిపెట్టారు. మిగిలిన 11 సెంట్లలో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. నాన్‌ లేఅవుట్‌ అయితే పంచాయతీకి 14 శాతం రుసుము చెల్లిం చాలి. ఆ మొత్తాన్ని చెల్లిస్తామని ముందుకొచ్చాడు. పంచా యతీ రుసుము తీసుకుని అనుమతి ఇస్తుందని భావించి నిర్మాణం ప్రారంభిం చారు. బేస్‌మెంట్‌ స్థాయిలో నిర్మాణం ఉంది. ఆ ఇంటికి ఆనుకుని రహదారిని ఏర్పాటు చేశారు. కాగా ఈ నాన్‌ లేఅవుట్‌ను అనుకుని ఐదెకరాల్లో జగనన్న కాలనీ కింద 175 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఈ స్థలాలకు ప్రత్యేకంగా మార్గం ఏదీ లేదు. నాన్‌ లేఅవుట్‌లోని రహదారే మార్గంగా ఉంది. పంచాయతీ మాత్రం ఇప్పటివరకు వేణు గోపాల్‌ నుంచి రుసుము తీసుకోలేదు. పైగా బేస్‌మెంట్‌ ఎందు కు వేశారంటూ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు అను గుణంగా నిర్మాణానికి 14 శాతం రుసుము చెల్లిస్తామని, అను మతులు ఇవ్వాలని ఇప్పటికీ వేణుగోపాల్‌ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు రహదారితో పాటు, తన స్థలంలో వ్యవసాయం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే జరిగితే జగనన్న కాలనీకి రహ దారి లేనట్టే.  ప్రస్తుతం జగనన్న కాలనీలో సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నారు. అక్కడక్కడ లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. రహదారి లేకపోతే వారంతా ఇబ్బందులు పడతారు.
వాస్తవానికి నాన్‌లేవుట్‌లో ఇచ్చిన రహదారినే జగనన్న కాలనీకి మార్గంగా వినియోగించుకుంటున్నారు. అంటే అది నివాస ప్రాంతం అయినట్టే లెక్క. నివాస ప్రాంతాల్లో నాన్‌ లేఅవుట్‌ అయితే 14 శాతం రుసుము తీసుకుని ప్రైవేటు నిర్మాణానికి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెల్లో నిర్మాణం రంగం అభి వృద్ధి చెందాలని, పంచాయతీలకు ఆదాయం సమకూరాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో అదే మాదిరిగా అనుమ తులు పొందుతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి స్పందన లేదు.
 పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి (ఈయుడా) అనుమతులు మంజూరు చేసే అవకాశం కల్పించారు. సంబంధిత పంచాయతీల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. నాన్‌ లేఅవుట్‌ స్థలం అయితే 14 శాతం రుసుము చెల్లించాలి. అందులో 7 శాతం పంచా యతీకి, మరో 7శాతం ఈయుడాకి జమ అవుతాయి. దీనివల్ల పంచాయతీకి ఫిలితం లభించనుంది. ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కింద పశ్చిమలోని అన్ని నియోజక వర్గాలున్నాయి. జిల్లాల విభజనకు ముందే ఈయుడాలో అన్ని నియోజకవర్గాలను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ప్రభుత్వ ఇళ్లకు అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తుం ది. పల్లెల్లో అయితే తక్కువ మొత్తంలో ఇస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలను ఈయుడాలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పంచాయతీల్లో అనుమతులను ఈయుడా మంజూరు చేయనుంది. పంచాయతీ నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాల విభజన తర్వాత కూడా పాత విధానమే అమలు జరుగుతోంది. భీమవరం పరిధిలో కొత్తగా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయా లంటే ప్రభుత్వం మళ్లీ మార్గదర్శకాలు విడుదల చేయాలి. అప్పటివరకు ఈయుడాయే పంచాయతీల్లో అనుమతులు మంజూరు చేస్తుంది.  అనుమతి జారీ చేస్తే పంచాయతీకి 7శాతం రుసుము వస్తుంది. అదే పంచాయతీ అనుమతి ఇస్తే మొత్తం రుసుము పంచాయతీకే జమ అవుతుంది.

 అమలుకు నోచుకోని జీవో
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అధికారం కల్పిస్తూ గతంలో జీవో విడుదల చేసింది. పంచాయతీలే 14 శాతం రుసుము తీసుకుని అనుమతులు జారీ చేయడానికి అవకా శం ఉంటుంది. నాన్‌ లేఅవుట్‌ స్థలాల్లోనూ ఈ విధంగా అనుమతి ఇచ్చే వెసులుబాటు ఉన్నాసరే జీవో ఎక్కడా అమ లుకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారుల నుంచే దీనిపై మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పంచా యతీల్లో అనుమతు లు జారీ చేయడానికి లేదంటూ స్పష్టం చేశారు. అక్కడక్కడా పంచాయతీ తీర్మానాలు, లేదా రాజకీయ ఒత్తిళ్లతో అనుమ తులు జారీ చేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం జారీచేసిన జీవోను ఇటీవల  పక్కన పెట్టేశారు.  
 పాలకోడేరులో జగనన్న కాలనీకి రహదారి కావాలంటే  నాన్‌ లేఅవుట్‌లో ఇచ్చిన రహదారినే ఉపయోగించుకోవాలి. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో కాలనీ విస్తరించి ఉంది. ఇప్పటివరకు నాన్‌ లేఅవుట్‌ రహదారిని  వినియోగించుకు ని జగనన్న కాలనీలో నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ సదరు నాన్‌ లేఅవుట్‌లో 14 శాతం రుసుము తీసుకుని ప్రైవేటు నిర్మా ణానికి అనుమతులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవో  దుర్వినియోగం అవుతుందన్న ఉద్దేశంతోనే నిలిపి వేశారు. పాలకోడేరులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. జగనన్న కాలనీకి రహదారి తప్పనిసరి. అది నెర వేరాలంటే జగనన్న కాలనీకి ఆనుకుని ఉన్న నాన్‌లేఅవుట్‌కు అను మతులు ఇవ్వాలి. ఒకవేళ ప్రైవేటు యజమానులు నాన్‌ లేఅవుట్‌ను వదులుకుంటే రహదారి సమస్య తథ్యం.

 లేఅవుట్‌ అనుమతి పొందాలి
 నాన్‌ లేఅవుట్‌లలో 14 ఽశాతం రుసుము తీసుకుని అనుమతులు ఇవ్వలేం. నాన్‌ లేఅవుట్‌ను క్రమబద్ధీకరించు కోవాలి. అప్పుడే అనుమతులు జారీచేస్తాం. ప్రస్తుతం క్రమ బద్ధీకరించుకునే వెసులుబాటు లేదు. ఈయుడా నుంచి అను మతులు తెచ్చుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు.
 – రమాలీల, కార్యదర్శి , పాలకోడేరు

Updated Date - 2022-09-08T05:30:00+05:30 IST