బిల్లులు రాక పనులు సాగడం లేదు

ABN , First Publish Date - 2022-05-19T05:59:13+05:30 IST

జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి రెండో సమావేశం బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగింది.

బిల్లులు రాక పనులు సాగడం లేదు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, చిత్రంలో మంత్రి కారుమూరి, కలెక్టర్‌ ప్రశాంతి తదితరులు

సాగు నీటిపారుదల సలహా మండలి సమావేశంలో అధికారుల వెల్లడి
ఆగకుండా చూస్తాం : మంత్రులు కొట్టు, కారుమూరి  
115 పనులకు టెండర్లు పిలిస్తే 20 పనులకే స్పందన
వీటికి 24నే వర్క్‌ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశాలు
ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల గైర్హాజరు


భీమవరం, మే 18 : జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి రెండో సమావేశం బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. జిల్లా నుంచి మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు మినహా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మండలి సభ్యుల గైర్హాజరీతో సమావేశం సాగింది. అధ్యక్షత వహించిన కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ గత సమావేశంలో ఓఅండ్‌ఎం ప్రాజెక్టులో టెండర్లు పిలిచిన పనులు.. ఇతర ప్రతిపాదిత పనులపై కాలువలకు నీటి విడుదలపై రానున్న 20 రోజుల్లో ఏం చేస్తారో అధికారులు చెప్పాలని కోరారు. దీనిపై నీటిపారుదలశాఖ ఎస్‌ఈ నాగార్జునరావు మాట్లాడుతూ ఈ క్లోజర్‌లో రూ.120 కోట్లతో 115 పనులకు టెండర్లు పిలిచినప్ప టికీ 20 పనులకు మాత్రమే టెండర్లు వచ్చాయని తెలిపారు. మరో 64 పనులకు ఈ నెల 23న టెండర్లు తెరుస్తామని, వర్క్‌ ఆర్డర్‌ వచ్చాక జూన్‌ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జలవనరులశాఖలో టెండర్లు పిలుస్తున్నా పేమెంట్లు రావడం లేదని, కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగకుండా బిల్లులు ఇప్పిస్తామని చెప్పాలని మంత్రులు భరోసా ఇచ్చారు.

 సమయం సరిపోతుందా ?
జూన్‌ 5 నుంచి కాలువలకు నీరు విడుదల చేయబోతున్నాం. ఈలోగా పనులు చేయడానికి సమయం సరిపోతుందా ? అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నించారు. ఈ లోగా స్ర్పే చేయడం వల్ల సరిపోతుందని ఎస్‌ఈ నాగార్జునరావు బదులిచ్చారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ గతంలో ఇలాగే టెండర్లు పిలిచినా వర్షాల వల్ల కెమికల్స్‌ చేసినా ఉపయోగం లేకపోయిందని, బిల్లులు అప్పనంగా ఇచ్చారంటూ గుర్తు చేశారు. గత నాలుగేళ్లూ ఇదే పరిస్థితి నడుస్తోందని చెప్పారు. దీంతో ఈ నెల 24 నుంచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్లోజర్‌లో చేపట్టాల్సిన డ్రెయిన్‌, కాల్వల పనులకు సంబంధించి కేవలం తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలపైనే చర్చ సాగింది. మంత్రి కొట్టు మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని మేజర్‌ డ్రెయిన్‌ పందికోడు అభివృద్ధి రూ.10 లక్షలతో గత ఏడాది చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదని, కాంట్రాక్టర్‌ ఏమయ్యాడని ప్రశ్నించారు. రాచకోడు కాలువపైన అధికారులతో చర్చించారు. మంత్రి కారుమూరి పాలి మీడియం డ్రెయిన్‌, ఆరుదల కోడు, తిరుపతిపురం స్పిల్‌వే, ఉండ్రాజవరం సుబ్బారాయుడు కాలువ ఎత్తిపోతలు, యనమదుర్రు మురుగు కాలువపై చర్చించారు. ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

 ఆర్బీకేలకు విత్తనాలు, ఎరువులు
కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ 90 శాతం రైతులు విత్తనాలను స్వయంగా తయారు చేసుకుంటారని, మిగిలిన వారు ఆర్‌బీకేల ద్వారా పొందవచ్చునని తెలిపారు. నాట్లకు అవసరమైన ఎరువులను తాడేపల్లిగూడెంలోని మెయిన్‌ స్టాక్‌ పాయింట్‌ నుంచి మిని స్టాక్‌ పాయింట్లకు, ఆర్‌బీకేలకు తరలించాలన్నారు. ముందస్తు నీటి విడుదలపై ఖరీఫ్‌కు రైతులను సన్నద్ధం చేయడంతోపాటు ఏయే తేదీలలో ఏయే ప్రదేశాలలో కాలువలకు నీరు చేరుతుందో వివరాలను ప్రచారం చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న అన్ని మండల కేంద్రాలలో, 23న గ్రామాలలో ఆర్‌బీకేల వారీగా వ్యవసాయ సలహా మండలి సమావేశాలను పూర్తి చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులుగా నియమితులైన కైగాల శ్రీనివాసరావుకు మంత్రుల సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు. జేసీ జేవీ మురళి, డీఆర్వో కె.కృష్ణవేణి, సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌, ఆర్డీవో దాసిరాజు, కెనాల్స్‌ ఈఈ ఎం.దక్షిణామూర్తి, డీఈ ఏవీ వెంకటేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 కాంట్రాక్టర్లు రావడం లేదు సర్‌..
తమ ప్రాంతంలోని గునుపూడి సౌత్‌, తాడేరు, మొగల్తూరు డ్రెయిన్లు బాగు చేయకపోవడంతో పొలాలన్నీ మునిగిపోతున్నాయని వైసీపీ నాయకుడు, రైతు కొట్టు కుటుంబరావు ఆవేదన చెందారు. దీనిపై స్పందించిన మంత్రి కొట్టు మాట్లాడుతూ ప్రతిపాదిత పనులను రైతుల సహకారంతో చేయించుకోమని సలహా ఇచ్చారు. దీనికి ఆయన ‘మన గవర్నమెంట్‌లో బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు సార్‌’ అంటూ చెప్పడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు కాసేపు విస్తుపోయారు. ఆచంట నియోజకవర్గానికి చెందిన రైతు చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నక్కల డ్రెయిన్‌లో తూడు తొలగించాలని కోరారు. పాలకొల్లు నుంచి వచ్చిన రైతు విజయరామరాజు భగ్గేశ్వరం, మొగల్తూరు డ్రెయిన్ల ఇబ్బందులను వివరించారు. కలవపూడి సొసైటీ అధ్యక్షుడు కలవపూడి ప్రసాదరావు ఉప్పుటేరు ముంపు సమస్యను ప్రస్తావించారు. దీనిపై రెగ్యులేటర్లను సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారని మంత్రి కొట్టు బదులిచ్చారు.

Updated Date - 2022-05-19T05:59:13+05:30 IST