పునాది పాట్లు

ABN , First Publish Date - 2022-07-02T06:40:06+05:30 IST

వారంతా నిరుపేదలు. సొంతిళ్లు నిర్మించుకోవాలని ఇంత కాలం కలల కంటూ వచ్చారు.

పునాది  పాట్లు

 చిన్నపాటి వర్షానికే ఇళ్ల స్థలాలు మునక..

జంగారెడ్డిగూడెం : వారంతా నిరుపేదలు. సొంతిళ్లు నిర్మించుకోవాలని ఇంత కాలం కలల కంటూ వచ్చారు. ఇక ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, రుణాలు ఇస్తామనగానే వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే స్థానిక అధికారులు లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలు నివాసయోగ్యమో కాదో కూడా చూడకుండా కొంత భూమిని సేకరించి వారికి ఇచ్చారు. దీంతో స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామ శివారులో స్థలాన్ని గుర్తించి 16 మందికి కేటాయించారు. కానీ ఆ స్థలం చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీరు ఇక్కడే తిష్టవేస్తోంది. పక్కనే పంట కాలువ కూడా. పొలాలకు వెళ్లే రోడ్డుకు సుమారు ఆరడుగుల లోతులో ఉన్న ఈ స్థలంలో స్థలాలు కేటాయించి పంచి పెట్టేసి చేతులు దులుపుకున్నాయి. లబ్ధిదారులు ఇప్పుడు అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వర్షం పడితే వారి ఇంట్లోకి వర్షపు నీరు వెళ్లకుండా ఎత్తుగా ఇళ్లు నిర్మించుకోవాలి. రోడ్డుకు పైకి గుమ్మం ఉండేలా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఏడడుగులపైనే పునాది వేసుకుంటున్నారు. పునాదికే దాదాపు రూ.50 నుంచి రూ.70 వేల వరకు ఖర్చవుతోందని వారు వాపోతున్నారు. దీనికితోడు సిమెంట్‌, ఐరన్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ఇంటి పునాదిలోనే ఉన్న సొమ్ములు ఖర్చయితే మిగిలింది ఎలా నిర్మించుకోవాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. 

Updated Date - 2022-07-02T06:40:06+05:30 IST