ఆగని గట్టు కోత

ABN , First Publish Date - 2022-08-16T05:48:39+05:30 IST

పట్టణంలోని పొన్నపల్లి వద్ద గోదావరిపై నిర్మించిన ఫుట్‌పాత్‌ కోత ఆగడం లేదు.

ఆగని గట్టు కోత
కోతకు గురైన గట్టు

 పొన్నపల్లి వద్ద ప్రమాదకరంగా 20 మీటర్ల గట్టు
నరసాపురం/ ఆచంట ఆగస్టు 15 : పట్టణంలోని పొన్నపల్లి వద్ద గోదావరిపై నిర్మించిన ఫుట్‌పాత్‌ కోత ఆగడం లేదు. గత వరద లకు సుమారు 30 మీటర్లు కోతకు గురై గోదావరిలోకి కూలిన విషయం విదితమే. తాజాగా అక్కడ నుంచి అమరేశ్వరస్వామి ఆలయం వరకు ఉన్న గట్టు కూడా ప్రమాదంగా మారింది. ఇప్పటికే 20 మీటర్లు ఒరిగి పోవడంతో అధికారులు దాన్ని ఎక్స్‌కవేటర్‌తో కూల్చి కోతకు గురి కాకుండా గట్టుకు రక్షణగా ఉంచారు. అయితే మిగిలిన గట్టు కూడా ప్రమాదంగా మారింది. ఇది కూడా గోదావరి వైపు ఒరిగి పోయింది.  జూలైలో వచ్చిన వరదలకు పొన్నపల్లి వద్ద ఒక్కసారిగా ఫుట్‌పాత్‌ కోతకు గురై గోదావరిలో పడిపోయింది. దానికి ముందు భాగంలో ఉన్న గట్టు  కోతకు గురి కావడంతో కొపనాతి కృష్ణమ్మ విగ్రహం గోదావరిలో కలిసిపోయింది. మళ్లీ వరదలొస్తే ప్రమాదం అని భావించి అధికారులు 50 మీటర్ల మేర తాత్కాలిక పనులు అఘమేఘాలపై చేపడుతున్నారు. అయితే ఈసారి వరదకు గతంలో కూలిన గట్టుకు అనుకుని ఉన్న ప్రాంతం కూడా ప్రమాదంగా మారింది. ఏ క్షణంలోనైనా గోదావరిలోకి ఒరిగిపోయేలా ఉంది. దీంతో అమరేశ్వరస్వామి గుడి నుంచి శ్మశానం వరకు ఉన్న ఏటిగట్టును  పటిష్ఠంగా నిర్మించేందుకు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. కాగా వశిష్ఠకు వరద పోటు తగ్గింది. సోమవారం 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టారు.  పంటు రాకపోకల్ని కూడా పునరుద్ధరించలేదు.  ఆచంట మండలంలో గోదావరి ఉధృతి సోమవారం మరింత తగ్గింది. పెద్దమల్లం మాచేనమ్మ ఆలయ ప్రాంగణంలో వరదనీరు తగ్గింది.

Updated Date - 2022-08-16T05:48:39+05:30 IST