వీడనున్న ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-07-25T05:32:51+05:30 IST

సుదీర్ఘంగా కొనసాగిన నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెర పడనుంది.

వీడనున్న ఉత్కంఠ
కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా

నేడే నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు 

ఏలూరు టూటౌన్‌, జూలై 24 : సుదీర్ఘంగా కొనసాగిన నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట కలగనుంది. ఎన్నో మలుపులు తిరిగిన నగర పాలక సంస్ధ పాలకమండలికి జరిగిన ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుండడంతో కార్పొరేటర్‌ పోటీ అభ్యర్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరు స్తోంది. గెలుపో ఓటమో నేటితో తేలిపోనుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ అంతా రెండు మూడు నెలల్లో జరిగిపోతుంది. అలాంటిది ఈ దఫా 17 నెలల పాటు కొనసాగింది. దీంతో అభ్యర్ధుల్లో అసహనం పెరిగిపోయింది. కొవిడ్‌ కారణంగా అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు నేడే రేపో జరుగుతాయనగా వాయి దాలు పడ్డాయి. అనంతరం ఎన్నికలు జరిగినా కౌంటింగ్‌ను నిలిపివేయాలంటూ అధికారుల ఆదేశాలతో అభ్యర్థులు కుదేలయ్యారు. పోటీలోని అభ్యర్థులు రెండు సార్లు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఆర్థికంగా ఎంతో నష్టపోయారు.  

 గత ఏడాది 2020 ఫిబ్రవరిలో ఏలూరు నగర పాలక సంస్థకు ఎన్నికల కమీ షన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మార్చి 11 నుంచి 13 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అదేనెల 23వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా మార్చి 14వ తేదీన కొవిడ్‌ కారణంగా ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసింది. అనంతరం ఈ ఏడాది 2021 ఫిబ్రవరి 15వ తేదీన పాత ఎన్నికల నోటిఫికేషన్‌ ను కొనసాగిస్తూ మళ్లీ రీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇచ్చింది. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ రెండు మూడు తేదీల్లో జరిగింది. అనంతరం మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికలకు రెండు రోజులకు ముందు మార్చి 8వ తేదీన ఎన్నికలు నిలిపివేస్తూ  హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. వెంటనే ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయగా 10వ తేదీ యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇస్తూ ఎన్నికల కౌంటిం గ్‌ను నిలిపివేసింది. ఎట్టకేలకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించారు. అనంత రం మళ్లీ ప్రభుత్వం కౌంటింగ్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది మే 7వ తేదీన ఎన్నికల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ కారణంగా రెండు నెలల తర్వాత ఎన్నికల కమీషన్‌ ఈనెల 25న కౌంటింగ్‌ జరపాలని నిర్ణ యించింది. 

 మేయర్‌ పదవిని ఈసారి జనరల్‌ మహిళకు కేటాయించారు. వైసీపీ పార్టీ మేయర్‌ అభ్యర్థినిగా మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ను ఆ పార్టీ నిర్ణయించింది. మేయర్‌ అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిని సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగు రు డిప్యూటీ మేయర్లను కూడా ఆ పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ మే యర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులుగా ఎవరిని అధికారికంగా ప్రకటించలేదు. మెజార్టీ స్థానాలు వస్తే కార్పొరేటర్లతో చర్చించి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల నిర్ణయం తీసుకుంటా మని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు. 

 రెండవ డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవచ్చంటూ శనివారం ప్రభుత్వం ఎన్నిక కోసం జీవో విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీన రెండవ  డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరగాలని ఆ జీవోలో పేర్కొంది. రెండవ డిప్యూటీ మేయర్‌ను కూడా సంవత్సరానికి ఒకరిని చేయాలని రాజకీయ పార్టీలు నిర్ణయిస్తే ఐదేళ్లల్లో పది మంది డిప్యూటీ మేయర్లు అయ్యే అవకాశం ఉంది. 

 ఈనెల 30న ఏలూరు మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఆదేశాలు శనివారం జారీ చేశారు.

 కరోనా నిబంధనలు పాటించాలి : డీఐజీ 

ఏలూరు క్రైం, జూలై 24 : ఏలూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి ఒక్కరు కరోనా నియమ నిబంధనలు పాటించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశిం చారు. ఈనెల 25వ తేదీన ఏలూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధిం చి ఓట్ల లెక్కింపు ఏలూరు సమీపంలోని వట్లూరులో ఉన్న సీఆర్‌ఆర్‌ ఇంజ నీరింగ్‌ కాలేజీలో జరగనుంది. ఆ కేంద్రాన్ని డీఐజీ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఓట్ల లెక్కింపునకు నాలుగు కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారని, నగర కార్పొరేషన్‌కు సంబంధించి 47 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ చుట్టు పక్కల 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్టు 30 అమలులో ఉంద న్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ముందుగానే కౌంటిం గ్‌ సెంటర్‌కు చేరుకోవాలన్నారు. కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లు, అభ్యర్థులు నిషేధపు వస్తువులు కాని, సెల్‌ఫోన్లు కాని తీసుకు రాకూడదన్నారు. డీఐజీతో పాటు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఎస్‌సిహెచ్‌ కొండలరావు,  త్రీటౌన్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

 అమలులో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30.. 

  ఏలూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కిం పు జరుగుతున్న దృష్ట్యా సీఆర్‌పీసీ  సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 విధించి నట్టు ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ తెలిపారు. ఎన్నికల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్పులు నిర్వహించకూడదని కొవిడ్‌ నిబంధనలు ఉన్న దృష్ట్యా సెక్షన్‌ 144 అమలు చేయడం జరిగిందని, శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం పోలీస్‌ శాఖ 30 అమలులో ఉందని నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.  

కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు : కలెక్టర్‌

పెదపాడు, జూలై 24 : ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా తెలిపారు.  వట్లూరులోని సర్‌ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కౌంటింగ్‌కు అధికారులంతా సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడంతో పాటుగా ఏజెంట్లకు అనుమతి పత్రాలు అందించామన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరిగాయని, అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది అంతా విధిగా మాస్క్‌లు ధరించడంతో పాటుగా కొవిడ్‌ నిబంధనలు పాటించాల న్నారు. నిబంధనలు పాటించని వారిని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతింమని తెలిపారు. అనంతరం కౌంటింగ్‌ టేబుల్స్‌, సీసీ కెమెరాలు, మైక్‌ సిస్టం, బారికేడ్ల ఏర్పాటు పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ కె.వెంకటరమణారెడ్డి, డీఆర్‌వో డేవిడ్‌రాజు, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌, ఏలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-25T05:32:51+05:30 IST