పోలీసు పరుగు

ABN , First Publish Date - 2022-05-19T05:54:47+05:30 IST

‘మీ ఫోన్‌లో దిశ యాప్‌ ఉందా ? లేకపోతే తక్షణం డౌన్‌లోడ్‌ చేసుకోండి’ అంటూ పోలీసులు, వలంటీర్లు జిల్లావ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వ హించారు.

పోలీసు పరుగు

జిల్లావ్యాప్తంగా దిశ యాప్‌పై స్పెషల్‌ డ్రైవ్‌
టార్గెట్‌ లక్షా 40 వేలు.. డౌన్‌లోడ్‌ చేయించింది 48 వేలు
మహిళా పోలీసుల అవస్థలు.. వాహనచోదకుల ఇబ్బందులు

భీమవరం క్రైం/వీరవాసరం/పెనుగొండ/తాడేపల్లిగూడెం క్రైం/పెనుమంట్ర/ కాళ్ల, మే 18 : ‘మీ ఫోన్‌లో దిశ యాప్‌ ఉందా ? లేకపోతే తక్షణం డౌన్‌లోడ్‌ చేసుకోండి’ అంటూ పోలీసులు, వలంటీర్లు జిల్లావ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వ హించారు. బుధవారం రహదారులపై ఎక్కడికక్కడ పోలీసులు వాహన చోదకులను, ప్రయాణికులను ఆపి వారికి దిశపై అవగాహన కల్పించి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించారు. వీరిని చూసిన వాహనదారులు కేసులు, ఫెనాల్టీ కోసం  ఆపుతున్నారేమోనని భయపడి ముందుకు వెళ్లకుండా వెనుదిరిగి వెళ్లిపోయా రు. పాలకొల్లు, వీరవాసరం, పాలకోడేరు, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇలాంటి  ఘటనలు అనేకం కనిపించాయి. దీంతో పోలీసులు వారిని ఆపి పెనాల్టీల కోసం దిశ యాప్‌ కోసం ఆపుతున్నామని చెప్పి సెల్‌ఫోన్‌లలో వేసి పంపించా రు. జిల్లాలో ఒక్క రోజే లక్షా 40 వేల మందితో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చే యాలన్న టార్గెట్‌తో పోలీసులు, మహిళా పోలీసులు, వలంటీర్లు ఉరుకులు పరుగులు పెట్టారు. జిల్లాలో రాత్రి ఎనిమిది గంటల వరకు 48 వేల మందితో మాత్రమే యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. జిల్లా పరిధిలోని 20 పోలీస్‌స్టేషన్‌ల్లో పనిచేసే సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ్డారు. ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్లపైన, బస్టాండ్లలోను ఎక్కడ పడితే అక్కడ వచ్చేపోయే వారిని ఆపి మరీ వేయించారు. ఓ ప్రాంతంలో ఇంటర్‌ పరీక్షలకు బస్సులో వెళుతున్న విద్యార్థినులను ఆపి మరీ యాప్‌ గురిం చి వివరిస్తుండగా.. వారు మేం పరీక్షలకు వెళుతున్నాం.. టైం అయిపోతోంది. ప్లీజ్‌ మమ్మల్ని వదిలేయండి అని వేడుకోవడంతో వదిలి పెట్టారు. ఒక్క భీమవరంలోనే 11,361 మందితో డౌన్‌లోడ్‌ చేయించారు. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత కూడా ఈ డ్రైవ్‌ కొనసాగుతోంది. కాళ్ల మండలం కోపల్లె శాఖా గ్రంథాలయంలో  విద్యార్థులకు యాప్‌పై అవగాహన కల్పించారు.

మహిళలకు శ్రీరామ రక్ష : ఎస్పీ
‘దిశ యాప్‌ మహిళలకు శ్రీరామ రక్ష, ప్రతి మహిళా దీనిని తన ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుంటే అవసరమైనప్పుడు ఉపయోగకారిగా ఉంటుంది..’ అని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాశ్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పెనుగొండ మండలం సిద్ధాంతం,  తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి, ముత్యాలం బపురం, పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్‌లలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకతాయిలను అరికట్టేందుకు యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐలు రమేష్‌, విశ్వనాథ్‌బాబు, బండి మోహనరావు, శ్రీనివాస్‌, పోలీసు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:54:47+05:30 IST