Abn logo
Apr 10 2021 @ 23:51PM

డెంగీ పడగ..!

 నగరంలో డజను ప్రాంతాల్లో హాట్‌ స్పాట్లు

 జిల్లాలోనే హైరిస్క్‌ ఏరియాగా హేలాపురి

 ఈ ఏడాది ఇప్పటి వరకు 11 కేసులు నమోదు

 ముందస్తు జాగ్రత్తలతోనే కట్టడి


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 10 : 

హఠాత్తుగా తీవ్రమైన జ్వరంతో ప్రారం భమై, క్రమేణా కళ్లు కదిలించలేని స్థితి, ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు (రాష్‌)తో మనిషిని అతలాకుతలం చేసే డెంగీ జ్వరాలు/ వ్యాధి వ్యాప్తి కారకాలు జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ పరిశీలనలో వెల్లడైంది. డెంగీ కారకాలకు ఓ వైపు పారిశుధ్య లోపం కారణం కాగా, మరోవైపు స్థానికులు బాధ్యతా రాహిత్యం కూడా పరిస్థితి తీవ్రతను పెంచేందుకు కారణమవుతోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెంగీ నివార ణకు గుర్తించిన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు అగ్ర ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో చైతన్యం పెంపొందించడం పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు.

ఏలూరు నగరం డెంగీ వ్యాధి వ్యాప్తికి కారకమైన దోమలకు ఆవాసంగా మారిందని అధికారులు గుర్తించారు. నగరం లోని తంగెళ్లమూడి, తూర్పువీధి, దక్షిణపువీధి, జేపీ కాలనీ ఏరియా, లంకపేట, ఇజ్రాయిల్‌పేట, ఎంఆర్‌సీ కాలనీ, కొత్తపేట, చాటపర్రు, వెంకటాపురం, శని వారపుపేట, శ్రీరామ్‌నగర్‌ తదితర ప్రాంతాలు డెంగీ వ్యాప్తికి హాట్‌ స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని మురికివాడలు, ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రాంతా లు, మురుగునీటి కాల్వల్లో డెంగీని సంక్రమింపచేసే టైగర్‌ దోమలు (ఎడిస్‌ ఈజిప్ట్‌) అక్కడక్కడా ఉన్నట్టు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఈ దోమలు నివాస గృహాలు, ఇంటి పరిసరాల్లోని మంచినీటి నిల్వల్లో కన పడడం గమ నార్హం. ఇవి పగలు, రాత్రి కూడా సంచరిస్తున్నాయని గుర్తించారు. నగర పరి ధిలో 2019లో 71 డెంగీ కేసులు బయటపడగా, గతేడాది కరోనా ఉధృతి వల్ల డెంగీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో జరగలేదు. ఫలితంగా 2020లో 24 కేసులు నిర్ధారణ అయ్యాయి. డెంగీ కేసులకు ఏటా జనవరి నుంచి డిసెం బరు వరకు ప్రామాణికంగా తీసుకుని లెక్కిస్తారు. ఆ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 11 కేసులు ఈ ప్రాంతాల నుంచే నిర్ధారణ అయ్యాయి.


మిమ్మల్ని మీరే రక్షించుకోండిలా...

వాంతులు, వికారం, రక్తంతో కూడిన మల విసర్జన, శరీర భాగాల్లో రక్తస్రావం డెంగీ వ్యాధి ప్రమాదకర లక్షణాలుగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వల్ల కలిగే వ్యాధికి పూర్తి చికిత్స లేదు. లక్షణాలను బట్టి వైద్య చికిత్సలు పొందడమే ఏకైక మార్గం. ఎలీసా రక్త పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. డెంగీకి చికిత్స ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ హెచ్చరికల నేపథ్యంలో నివారణ చర్యలపైనే నగరవాసులు దృష్టి పెట్టడం మంచిది. ఆ ప్ర కారం దోమ తెరలు వాడడం, ఇంటి కిటి కీలకు, తలుపులకు జాలీలు బిగించు కోవడం, ఇంటిలోపల, బయట నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఎయిర్‌ కూలర్లు, ఫ్లవర్‌వాజ్‌లు, పూలకుండీల్లో నీటిని తరచూ మార్చుతుండాలి. నీటి నిల్వల్లో దోమలు అభివృద్ధి చెందకుండా ‘అబేటు’ను పిచికారీ చేయాలి. గోడలపై డీడీటీ, మలాథియాన్‌, సింథ టిక్‌ పైరిత్రాయిడ్‌ దోమల మందుల్లో ఏదో ఒక దానిని స్ర్పే చేయాలని సూచిస్తున్నారు.


ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం

 గోవిందరావు, మలేరియా ఏలూరు సబ్‌ యూనిట్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌

డెంగీ, వైద్యం, నివారణ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ శుక్రవారం గుర్తించిన ప్రాంతాల్లో ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, స్థానిక ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందితో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహి స్తున్నాం. పారిశుధ్య నిర్వహణపై నగరపాలక సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాం. డెంగీ జ్వరాల కేసులు ఏడాది పొడవునా వస్తుంటాయి. డెంగీ కేసు బయటపడిన చోట ఇరువైపులా ఉండే వంద నివాస గృహాలకు దోమల మందును స్ర్పే చేయడంతో పాటు, సాయంత్రం పూట పొగ మందును ఫాగింగ్‌ చేయిస్తున్నాం.  

Advertisement
Advertisement
Advertisement