పల్లెలకు పాకిన వింత వ్యాధి.. మూర్ఛ వచ్చి కుప్పకూలుతున్న జనం

ABN , First Publish Date - 2021-01-24T05:27:13+05:30 IST

పొలంలో పనిచేసుకుంటున్న రైతు పొలంలోనే..

పల్లెలకు పాకిన వింత వ్యాధి.. మూర్ఛ వచ్చి కుప్పకూలుతున్న జనం
కొమిరేపల్లిలో బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది

‘మాయ’దారి మైకం

గత నెలలో ఏలూరులో తీవ్ర కలకలం

అప్పట్లో కారణాలపై తీవ్ర అన్వేషణ

ఇప్పటి వరకూ తేలని తుది నివేదిక


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): పొలంలో పనిచేసుకుంటున్న రైతు పొలంలోనే మూర్చపోతున్నాడు. పనులకు వెళ్తున్నవారు ఉన్నట్టుండి రోడ్డుపైనే కుప్పకూలిపోతున్నారు. ఇంటిపనిలో నిమగ్నమైన మహిళలు ఏదో మైకం కమ్మినట్టు కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారే.. కానీ మాట్లాడుతూనే వాలిపోతారు. ఆడ, మగ, వయసుతో సంబంధం లేదు.. అందరూ బాధితుల జాబితాలో చేరిపోతున్నారు. ఇంతకీ ఏమైంది వీళ్లకి..? అంటే.. వైద్య రంగ నిపుణులకు కూడా సమాధానం దొరకడం లేదు..! గతేడాది డిసెంబరులో మూడు వారాల పాటు ఏలూరు నగర వాసులను వణికించింది ఈ వ్యాధే. అందరూ దీనికి పెట్టిన పేరు వింత వ్యాధి. ఏలూరులో చల్లారినట్టే చల్లారి ఇప్పుడు పల్లెలపై పంజా విసురుతోంది. జిల్లాలోని పూళ్ల దగ్గర నుంచి కొమరేపల్లి గ్రామం వరకూ ఈ వారంలోనే డజన్ల సంఖ్యలో మూర్చ లక్షణాలతో కుప్పకూలి ఆస్పత్రుల పాలయ్యారు. ఏలూరులో అనేక సంస్థలు రకరకాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపినా చివరకు ఎటూ తేల్చలేక వింత రోగాన్ని సస్పెన్స్‌లోనే ఉంచాయి. తాజాగా పల్లెల్లో వెలుగుచూసిన ఈ వింత వ్యాధి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని మాత్రం ‘ఇదంతా రాజకీయ కుట్ర అయి ఉంటుంద’ని చెప్పుకొస్తున్నారు. 


ఏలూరులో ఆరంభమై..

గత నెలలో ఏలూరు నగరంలో దాదాపు 615 మంది వింత వ్యాధితో ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం అప్పట్లో ఈ అంతుచిక్కని వ్యాధి అంతు తేల్చేస్తామని ప్రకటించింది. ఏలూరు నగరంలోనే మకాం వేసిన వైద్యాధికారులు నమూనాలు సేకరించి వాటిని పేరొందిన జాతీయస్థాయి ల్యాబ్‌లకు పంపారు. తాగునీటిలో కాలుష్య కారకాలు, కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు, తినే పదార్థాలన్నింటిలోనూ ఎంతో కొంత నికెల్‌ వంటి కారకాలు అంటూ ప్రాథమిక నివేదికల్లో సూచించారు. అంతే తప్ప ఇంత వరకు తుది నివేదికలు వెల్లడించలేదు. ఇప్పుడు ఈ వ్యాధి ఏలూరు సమీప మండలాలకు పాకింది. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వారం రోజులుగా అనేక కేసులు వెలు గుచూశాయి. దీంతో ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు వెలిశాయి. నీటి, ఆహార పదార్థాల శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపారు. పూళ్లలో కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలోనే దెందులూరు మండలం కొమరేపల్లిలో గురువారం అర్ధరాత్రి నుంచి ఇవే లక్షణాలతో ఒకరి తర్వాత మరొకరు కుప్ప కూలడం మొదలైంది. నాలుగైదు రోజుల నుంచి పూళ్ల, భీమడోలు, గుండు గొలను గ్రామాల్లో 36 మంది వరకూ వింతవ్యాధి బారినపడగా.. కొమరేపల్లిలో 24 గంటల్లోనే 24 మంది మూర్చ వచ్చి కుప్ప కూలారు. వారంతా కొద్దిసేపటికే కోలుకున్నా వ్యాధికి కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


సర్కారు ఏం చేసింది..?

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌), హైదరాబాద్‌కు చెందిన నీరి, మంగళగిరికి చెందిన ఎయిమ్స్‌, సీసీఎంబీతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) కూడా ఏలూరులో వివిధ కోణాల్లో శోధించాయి. రకరకాల శాంపిల్స్‌ సేకరించి పరీక్షించాయి. కానీ తుది నివేదిక సారాంశం మాత్రం ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఇప్పుడు కొత్త ప్రాంతాలకూ వింత రోగం విస్తరించింది. కానీ మళ్లీ అవే పరామర్శలు. కొమరేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. ‘ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండానే ఎందుకింత గందరగోళం ఏర్పడిందో అని అన్నారు. ఆయనతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఉన్నారు. 


భీమడోలు మండలంలో ప్రశాంతం

భీమడోలు: మండలంలో శనివారం వింత వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పూళ్ళ, భీమడోలు, గుండుగొలను గ్రామాల్లోని వైద్య కేంద్రాల్లో కేసులు నమోదు లేకపోవడంతో  వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా గ్రామాల్లో మాత్రం వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాటికి మండలంలో 36 కేసులు నమోదు కాగా వీరంతా డిశ్చార్జి అయి ఇళ్ళ వద్ద కోలుకుంటున్నారు. పూళ్ల పీహెచ్‌సీకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ డి.బాలకృష్ణయ్య, భీమడోలు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రత్నకుమారి విచ్చేసి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


మరో నాలుగు కేసులు

దెందులూరు: అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. దెందులూరు మండలం కొమి రేపల్లి బాధితుల సంఖ్య 29కి చేరింది. శుక్రవారం 25 మంది అస్వస్థతకు గురికాగా తాజాగా శనివారం కాలి జాన్‌కోటి (9), కాలి వంశీధర్‌ (23), నవీన్‌ (22) ఏలూరు ఆసుపత్రిలో చేరగా, సబ్బవరపు శ్రీలేఖ (27) కొమిరేపల్లిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నది. ఆసుపత్రి నుంచి 21 మంది ఇంటికి వచ్చారు. ఏడుగురు ఏలూరు ఆసుపత్రిలోనే ఉన్నారు. గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతున్నది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గ్రామంలో పర్యటించారు. 


వింత వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి: వైద్యఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌

ఏలూరు: అంతుచిక్కని వ్యాధి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, జేసీ హిమాన్షు శుక్లా, వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యాధి ప్రబలకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలు, పారిశుధ్యం, ప్రజారోగ్యం వంటి అంశాలపై శనివారం ఆయన చర్చిం చారు. శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపామని, రిపోర్టులు వచ్చిన వెంటనే చేపట్టాల్సిన చర్యల గురించి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి చెప్పారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, తాగునీటి క్లోరినేషన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. 




Updated Date - 2021-01-24T05:27:13+05:30 IST