సైబర్‌.. టెర్రర్‌!

ABN , First Publish Date - 2021-01-11T06:04:49+05:30 IST

సెల్‌ఫోన్‌ రిక్వెస్టులు ఆర్థిక మూలాలపై హైరిస్క్‌ కలగజేస్తున్నాయి.

సైబర్‌.. టెర్రర్‌!


 రిక్వెస్టులతో హైరిస్కు ..  ఫేస్‌ బుక్‌ నకిలీ ఖాతాలతో బురిడీ

 స్నేహం ముసుగులో సొమ్ముల వసూలు

 సాంకేతిక  పరిజ్ఞానం పక్కదారి

ప్రముఖ కంపెనీల పేరుతో ముగ్గులోకి..


పాలకొల్లు, జనవరి 10: సెల్‌ఫోన్‌ రిక్వెస్టులు ఆర్థిక మూలాలపై హైరిస్క్‌ కలగజేస్తున్నాయి. ఫేస్‌ బుక్‌ నకిలీ ఖాతాలను సృష్టించి, మెసెంజర్ల ద్వారా రిక్వెస్టులు పంపించి, గ్రూపులోని బంధువులు, మిత్రుల నుంచి సొమ్ములు గుంజేస్తున్నారు. ఇందుకు టార్గెట్‌గా పరపతి ఉన్న వ్యక్తులనే ఎంచుకుంటున్నారు. తమకు అత్యవసరంగా సొమ్ములు కావాలంటూ ఫేస్‌బుక్‌ మెసెంజర్లు అభ్యర్థిస్తున్నారు. అది నకిలీ ఖాతా అని తెలియని బంధువులు, లేదా మిత్రులు అమాయకంగా సొమ్ములను బదిలీ చేసి ఆ తర్వాత నిజం తెలిసి లబోదిబోమంటున్నారు. ఇలా నకిలీ ఖాతా సైబర్‌ నేరగాళ్లు తమ వ్యక్తిగత బ్యాంక్‌ఖాతా నెంబరును జోడించి ఆనెంబరుకు సొమ్ములు బదిలీ చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు ఈనేరాలు ఇలా ఉంటే స్నాప్‌ డీల్‌వంటి ప్రముఖ కంపెనీల పేరుతో పలువురుకి స్పీడు పోస్టుల ద్వారా కొన్ని ఫారాలు పంపించి, వాటిని పూర్తి చేసి నిర్ధేశిత రుసుము చెల్లిస్తే (చెల్లించిన రుసుము నాట్‌ రిఫండబుల్‌) మీకు రూ.9లక్షలు వస్తాయని, కాబట్టి వెంటనే స్పందించమని పేర్కొంటున్నారు. ఇటీవల జిల్లాలో పదుల సంఖ్యలో ప్రజలకు ఈవిధంగా స్పీడు పోస్టులు వచ్చాయి. 

  సామాజిక మాధ్యమాల ప్రాచుర్యం పెరిగిన నేపఽథ్యంలో సైబర్‌ నేరగాళ్ళు అదే స్థాయిలో రెచ్చిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.  బ్యాంకింగ్‌ లావాదేవీలలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ప్రజలు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది. అనేక మంది ఫేస్‌ బుక్‌ అక్కౌంట్లు కలిగి ఉన్నప్పటికీ  వ్యక్తి గత సమాచారం బహిర్గతం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం పెంపోందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత మందికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన సైబర్‌ నేరగాళ్ళు డూప్లికేట్‌ ఫేస్‌బుక్‌ అక్కౌంట్లు తయారు చేసి మెసెంజర్ల ద్వారా రిక్వస్టులు పెట్టి డబ్బులు గుంజే ప్రక్రియతో అమాయకులను మోసగిస్తున్నారు. ఇమెయిల్‌కు సంబంధించిన విషయంలో టూస్టాప్‌ వెరిఫికేషన్‌ సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వలన సైబర్‌ నేరగాళ్ళు అక్కౌంట్లను హ్యాకింగ్‌ చేయడం ద్వారా వారి బ్యాంకు ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుని సొమ్ములు దారి మళ్ళించి మోసపుచ్చుతున్నారు. ఇటువంటి మోసాలకు గురైన వారు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడంతోపాటు, నగదు దారి మళ్ళిన వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా నేరగాళ్ళను పట్టుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2021-01-11T06:04:49+05:30 IST