కొవిడ్‌ చెల్లింపులేవీ..?

ABN , First Publish Date - 2021-10-18T05:07:33+05:30 IST

కరోనా బాధితులకు సేవలందించిన ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించ లేదు.

కొవిడ్‌ చెల్లింపులేవీ..?

  బిల్లులు ఆమోదం 

 నిధుల విడుదలలో జాప్యం

 ప్రైవేటు ఆస్పత్రులకు అందని సొమ్ము 

క్వారంటైన్‌ కాంట్రాక్టర్ల గగ్గోలు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి) 

కరోనా బాధితులకు సేవలందించిన ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించ లేదు. ఆస్పత్రి సిబ్బంది జీతాలు, నిర్వహణ కష్టంగా ఉందని సంబంధిత యాజమాన్యాలు, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణ బిల్లుల పెండింగ్‌తో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తాకిడితో బాధితులంతా ఆసుపత్రులను ఆశ్రయించారు. కొవిడ్‌ లక్షణాలతోపాటు, ఆక్సిజన్‌ స్థాయి కూడా పడిపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్స అవసరమైంది. లక్షణాలు ఉన్నవారికి క్వారంటైన్‌ సెంటర్‌లలో భోజన సౌకర్యంతోపాటు, మందులు ఉచితంగా అందజేశారు. ఆరోగ్యశ్రీలోనే 

కరోనా బాధితులు సేవలు పొందారు. సెకండ్‌ వేవ్‌లో సేవలందించడానికి జిల్లాలో సుమారు 24 ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా సేవలందించాయి. ప్రతి పట్టణంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రమే కరోనా వైద్య సేవలందించడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వ తనిఖీలు అధికం కావడంతో భీమవరం, ఏలూరులో మూడు ప్రైవేటు ఆసుపత్రులు సేవలు అందించలేమని చేతులెత్తేశాయి. దాదాపు 

మూడు నెలలపాటు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతితో ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడాయి. బాధితులకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలం దించారు. తొలుత  ప్రభుత్వం బిల్లులు సక్రమంగా విడుదల చేసినా తర్వాత చేతులెత్తేసింది.  ప్రైవేటు ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో బకాయిల కోసం బిల్లులు పెట్టుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కనిష్ఠంగా రూ. 12 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సుమారు రూ.8 కోట్లు బకాయిలు ఉన్నాయి. క్వారంటైన్‌ కేంద్రాల్లో సేవలందించిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వానికి బిల్లులు పెట్టామని, విదుదలైన వెంటనే చెల్లిస్తామంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బకాయిలు చెల్లించకపోయినా సరే నోరు మెదిపే సాహసం చేయలేకపోతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకంలో బిల్లులతోపాటు, కరోనా బాధితుల నుంచి అదనంగా సొమ్ము వసూలు చేసినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ పథకంపైనే ఆధారపడుతూ సేవలందించిన ఆసుపత్రులు ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. కరోనా సమయంలో సాధారణ వైద్య సేవలు నిలిపివేసి కేవలం కరోనా వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అటువంటిది ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో సిబ్బంది వేతనాలకు ఇబ్బందులు పడుతున్నా మంటూ పలు ఆసుపత్రి వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. క్వారంటైన్‌ కేంద్రాలు నిర్వహించే అధికారుల పరిస్థితి అలాగే ఉంది. 

Updated Date - 2021-10-18T05:07:33+05:30 IST