పనులు చేయలేం

ABN , First Publish Date - 2021-11-27T05:25:38+05:30 IST

మున్సిపాలిటీల ఖాతాల్లో పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నిధులు కళకళలాడుతున్నాయి.

పనులు చేయలేం
టెండర్లకు పిలిచినా ముందుకు రాకపోవడంతో గోతులమయంగా మారిన గొల్లలకోడేరు – వేండ్ర రహదారి

మున్సిపాలిటీల్లో అపారంగా నిధులున్నా.. 

అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా.. స్పందించని కాంట్రాక్టర్లు

పాత బకాయిలు చెల్లిస్తేనే.. ముందుకొస్తామని వెల్లడి..

పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వంలో కదలిక

సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదుకు ఆదేశం


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

మున్సిపాలిటీల ఖాతాల్లో పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నిధులు కళకళలాడుతున్నాయి. వీటిని చూసి ఆయా పట్టణాల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు అధికారులు టెండర్లు పిలిచారు. కానీ, ఒక్క కాంట్రాక్టర్‌ వస్తే ఒట్టు. ఎన్నడూ లేని విధంగా జనరల్‌ ఫండ్స్‌ ఖర్చు పెట్టుకోలేని దురవస్థపై వారు ఆందోళన చెందుతున్నారు. పనులు చేస్తే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని గ్యారెంటీ లేకపోవడంతో కాంట్ర్టాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. కనీసం మున్సిపాలిటీల వైపు కన్నెత్తి చూడడం లేదు. అంతలా హడలి పోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పట్టణాల్లో పాలన అస్తవ్యస్తమైంది. సీఎఫ్‌ఎంఎస్‌ ఫ్రీజింగ్‌ ఉండడంతో.. మున్సిపల్‌ ఖాతాల్లో నిధులను చూసుకోవడానికే తప్ప బిల్లులు మంజూరు చేయలేక సతమతమవుతున్నారు. పట్టణాల్లో పూర్తిచేసిన పనులకు ఏడాది నుంచి ప్రభుత్వం ఒక్కపైసా కూడా మంజూరు చేయలేదు. ఈ పరిస్థితి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలు, చింతలపూడి, ఆకివీ డు నగర పంచాయతీల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. పెండింగ్‌ బిల్లులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేయాలని ఆదేశాలు రావడంతో వారం రోజులుగా మున్సిపల్‌ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఈసారైనా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోతే వచ్చే ఏడాది కూడా పనులు చేయించలేమని అధికారులు తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపేణా వచ్చిన నిధులను అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలకు, పారిశుధ్య పనుల నిర్వహణ, విద్యుత్‌ బిల్లులు చెల్లింపునకు మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తూ అభివృద్ధి పనులను పక్కన పెడుతోంది. మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చేది ఆస్తి, నీటి పన్ను, మార్కెట్‌ సెస్‌, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారానే. ఇందులో 70 శాతం వరకు ఆస్తి పన్ను రూపంలో వస్తుంది. పన్నులు, సెస్‌, ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో అధిక శాతం వేతనాలు, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా వంటి అవసరాలకు వెచ్చిస్తున్నారు. మిగిలిన 30 శాతం రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం వంటి పనులకు కేటాయిస్తున్నారు. ఆర్థిక సంఘం, అమృత్‌ ప్రాజెక్ట్‌, సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు వేర్వేరు పట్టణాల్లో పదుల కోట్లలో బిల్లులు పెండింగ్‌ ఉన్నట్టు అంచనా. వీటిని చెల్లిస్తేనే కొత్త పనులు చేపడతామని కాంట్రాక్టర్‌లు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పట్టణ రహదారులపై ఏర్పడిన గోతులను పూడ ్చలేక, కనీసం వీధి లైట్లను వేయలేక అధికారులు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 


పట్టణాలకు వచ్చే ఆదాయం.. కోట్లలో

ఏలూరు రూ.30 కోట్లు

భీమవ రం రూ.25 కోట్లు

తాడేపల్లిగూడెం రూ.18 కోట్లు

తణుకు          రూ.12 కోట్లు

పాలకొల్లు        రూ.8 కోట్లు  

నరసాపురం రూ.7 కోట్లు

నిడదవోలు        రూ.4 కోట్లు

కొవ్వూరు          రూ.4.5 కోట్లు

జంగారెడ్డిగూడెం    రూ.3. కోట్లు 


అప్పటి వరకు ఈ రోడ్డింతే..!

పాలకోడేరు : ఇది గొల్లలకోడేరు నుంచి పాలకోడేరు మీదుగా వేండ్ర వెళ్లే రహదారి. ఏడున్నర కిలోమీటర్ల ఈ రోడ్డు పూర్తిగా పాడవడంతో మూడున్నర కోట్లతో దీనిని నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. పనులు చేసేందుకు అధికారులు మూడుసార్లు టెండర్లకు పిలిచినా ఒక్కరూ రాలేదు. దీనికి ప్రధాన కారణం.. పాత బకాయిలు చెల్లిస్తేనే పనులు చేస్తామని చెప్పడమే. ప్రభుత్వం వీటిని చెల్లించే వరకు ప్రజలకు ఈ గోతుల రోడ్డుపై పడుతూ లేస్తూ ప్రయాణం సాగించాల్సిందే..! ఇక వేరే మార్గం లేదు !

Updated Date - 2021-11-27T05:25:38+05:30 IST