ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే తరలిస్తాం..

ABN , First Publish Date - 2021-07-27T05:31:41+05:30 IST

ముంపు బాధితులకు అండగా ఉంటా మని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హామీ ఇచ్చారు.

ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే తరలిస్తాం..
కొయిదాలో నిర్వాసితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

వారం రోజుల్లో 365 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ జమ

కొయిదా, కొరుటూరు ముంపు గ్రామాల్లో కలెక్టర్‌ కార్తికేయ పర్యటన

పోలవరం/ వేలేరుపాడు, జూలై 26 : ముంపు బాధితులకు అండగా ఉంటా మని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హామీ ఇచ్చారు. సోమవారం వేలేరు పాడు మండలం కొయిదా, పోలవరం మండలం కొరుటూరు గ్రామాల్లో బోటుపై పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని చట్టపరంగా ఇవ్వాల్సిన అన్ని ప్యాకేజీలను ఇచ్చిన తరువాతనే నిర్వాసితులను తరలిస్తామని తెలిపారు. వేలేరుపాడు మండలం కొయిదా గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. మరో వారంరోజుల్లో కొయిదా, తాళ్లగొంది, బూసుగొంది గ్రామాల్లోని 365 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి బిల్లులు గురువారం లోపు పూర్తవు తాయని అనంతరం బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పోలవరం మండలం కొరుటూరు గ్రామంలో పర్యటించిన ఆయన స్థానికులను నిత్యావసరాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గర్భిణులకు చాక్లెట్లు, బిస్కెట్లు అంద జేశారు. త్వరితగతిన ముంపు గ్రామాలు ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముంపు బాధితులకు తెలిపారు. ఐటీడీఏ పీవో ఆనంద్‌, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మీ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ రామస్వామి, డీఎస్‌వో సుబ్బరాజు, పోలవరం డీఎస్పీ లతాకుమారి, వేలేరుపాడు, పోలవరం తహసీల్దార్లు చెల్లన్నదొర, సుమతి, ఎంపీడీవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:31:41+05:30 IST