కొబ్బరి ధర పతనం

ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST

కొబ్బరి మార్కెట్‌ పతనమైంది.

కొబ్బరి ధర పతనం

కొబ్బరి కాయల ధరలు పతనం

కాయ రూ.7.50 కొంటున్న వ్యాపారులు

గిట్టుబాటు కాదంటున్న రైతులు

ఇతర రాష్ట్రాలకు తగ్గిన ఎగుమతులు

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌

యలమంచిలి, ఏప్రిల్‌ 14 : కొబ్బరి మార్కెట్‌ పతనమైంది. రైతుల నుంచి వెయ్యి కాయలు రూ.7.500లకు కొనుగోలు చేస్తున్నారు. ఉగాది, శ్రీ రామ నవమి పండు గలకు ముందు పెరగాల్సిన ధరలు.. తగ్గడంపై కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు ఆశాజ నకంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇందుకు భిన్నంగా రేటు తగ్గింది. ధర లేకపోవడంతో కనీసం దింపు ఖర్చులకు సరిపోవడం లేదని వాపోతున్నారు. సాగుబడి ఖర్చులు, డీజిల్‌, కూలీలు, ఎరువుల రేట్లు ఇటీవల పెరగడంతోపాటు కాయ రేటు తగ్గడంతో నష్టాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు వ్యాపారులు వందకు పది శనగ కాయలు తీసుకోవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. జిల్లా నుంచి గుజరాత్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు కొబ్బరికాయలు ఎగుమతి అవుతాయి. పాలకొల్లు ప్రాంతం నుంచి రోజూ 100 నుంచి 150 లారీలు ఇతర ప్రాంతాలకు కొబ్బరి లోడుతో వెళుతూండేవి. ప్రస్తుతం సగం లారీల్లోనే కొబ్బరి ఎగుమతులు సాగుతున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతు న్నాయి. ఫలితంగా జనవరి ఆరంభంలో వెయ్యి కాయలు రూ.10 వేలు ఉండగా మార్చి నాటికి రూ.8 వేలకు తగ్గింది. ప్రస్తుతం మరింత తగ్గి.. రైతులకు నష్టాలను మిగులు స్తోంది. ఎగుమతులు తగ్గడానికి వ్యాపారులు పలు కారణాలు చెబుతున్నారు. తమిళనాడులో కొబ్బరి పంట దిగుబడులు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు పెరిగాయి. మన రాష్ట్రంతో పోలిస్తే అక్కడి కొబ్బరి నాణ్యమైనదిగా ఉండటం కారణం. తమిళ నాడులో అభివృద్ది చెందిన పారిశ్రామిక ప్రాంతాలు ఉండ టంతో అక్కడ ఎగుమతులు చేసేందుకు లారీలు విరివిగా ఉండటమేకాక, ఇక్కడితో పోలిస్తే లారీ కిరాయి (ట్రాన్స్‌ఫోర్ట్‌ చార్జి) 20 శాతం తక్కువగా ఉంటుందని ఎగుమతిదారులు చెబుతున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం అధికంగా ఉండటం.. లాక్‌డౌన్‌ విధించడంతో మహారాష్ట్ర సహా చత్తీస్‌గడ్‌ తదితర రాష్ర్టాలకు ఎగుమతులు ఆగిపోయాయి. సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో అన్ని ప్రాంతాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇతర రాష్ర్టాల్లోని వ్యాపారులు కొబ్బరి కాయలను దిగుమతి చేసుకునేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నాయి.


సాగు ఖర్చులు పెరిగాయి

తమ్మినీడి వీరాస్వామి, కొబ్బరి రైతు, యలమంచిలి

సాగు ఖర్చులు పెరిగిపోవడంతో కాయకు రూ.2 దింపు తీసేవారికి చెల్లించాల్సి వస్తో ంది. దీంతోపాటు డీజిల్‌ పెరగడంతో దుక్కి దున్నడం, నీరు తోడిక ఖర్చులు పెరిగాయి.ఇందుకు తగ్గట్టుగా ధర లేకపోవడం దింపు తీయడానికి ఆసక్తి కలగడం లేదు. రైతుల నుంచి కొబ్బరిని కొనుగోలు చేస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది



ధర రావడం లేదు

చిలుకూరి బాలాజీ, కొబ్బరి రైతు, శిరగాలపల్లి 

కొబ్బరి దిగుబడి ఆశాజనకంగా ఉన్న ఈ సమయంలో ధర తగ్గిపో వడం, దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు ధరలు ఉండడం రైతుకు మిగిలేది ఏమీ కనపడటం లేదు. ప్రస్తుతం సాగు ఖర్చులు వస్తే చాలని రైతులు భావిస్తున్నారు. కొబ్బరికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించాలి.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST