గడ్డుకాలం

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

కరోనా ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు.. ఇందుకు కొబ్బరి పీచు పరిశ్రమ మినహాయింపు కాదు..

గడ్డుకాలం

కరోనా ప్రభావంతో కొబ్బరి పీచు పరిశ్రమ కుదేలు

నిర్వహణ భారంతో నష్టాలబాట

ప్రభుత్వం సహకారం అందించాలి

పరిశ్రమ నిర్వాహకుల విజ్ఞప్తి

దెందులూరు, జూన్‌ 12 :  కరోనా ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు.. ఇందుకు కొబ్బరి పీచు పరిశ్రమ మినహాయింపు కాదు.. కరోనా రాకముందు ఎగుమతులు బాగానే జరిగేవి.. గతేడాది లాక్‌డౌన్‌ విధింపుతో ఎగుమతులు నిలిచిపోవడంతో మొదలైన కష్టాలు నిర్వాహకులను వెంటాడుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, మరోవైపు ఎగుమతులు నిలిచిపోవడంతో దాదాపు చిన్నపాటి పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించి సాయం అందిం చాలని నిర్వాహకులు కోరుతున్నారు.

దెందు లూరు నియోజకవర్గంలో  కొబ్బరి పీచు పరిశ్రమ ద్వారా వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో దెందులూరు, పెదవేగి, ద్వారకాతిరుమల, పెరవలి, అత్తిలి, ఉంగుటూరు తదితర మండలాల్లో పెద్ద, చిన్న తరహ కొబ్బరి పరిశ్రమలు ఉన్నాయి. దెందులూరు నియోజక వర్గంలో 25 నుంచి 30 వరకు చిన్న కొబ్బరి పీచు పరిశ్రమలు ఉన్నాయి. పీచు పరిశ్రమకు అవసరమైనా కొబ్బరి డొప్పలను స్థానికంగా కొబ్బరి రైతులు, వ్యాపారుల నుంచి ట్రాక్టర్‌ రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు, లారీ కొబ్బరి డొక్కులు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. కొబ్బరి పీచు తయారీకి కిలో రూ.7 నుంచి రూ.8 ఖర్చు అవుతుంది. పరిశ్రమల ద్వారా పీచు ఉత్పత్తి చేయగా మిగిలిన పొట్టును ఇటుకల బట్టీలకు విక్రయిస్తుంటారు. పరిశ్రమ వద్దకు తెచ్చిన డొక్కను పీచుగా మార్చడానికి కనీసం నెల రోజుల వ్యవధి పడుతుంది. 

 పోలవరం కుడి కాల్వలో భూములు కోల్పోయిన కొందరు రైతులు తమకు వచ్చిన పరిహారంతో కొబ్బరి పీచు పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పీచు పరిశ్రమ ద్వారా సంవత్సరానికి జిల్లాలో రూ.180 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నెలకు 15 టన్నుల ఉత్పత్తి చేస్తూ పరోక్షంగా 6 వేల మంది ఉపాధి పొందుతున్నారు. కొబ్బరి పీచు ఉత్పత్తులను విశాఖ ఓడ రేవు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొబ్బరి పీచును ఎక్కువగా సోఫా సెట్లు, కార్పెట్లు, పరుపులు, తాళ్లు, తయారు చేయడా నికి వినియోగిస్తారు. ప్రధానంగా మన రాష్ట్రం నుంచి చైనాకు ఎక్కువగా కొబ్బరి పీచు ఎగుమతి అవుతోంది. ఇటీవల స్థానికంగా కూడా వీటి వినియోగం పెరగడంతో 30 శాతం ఉత్పత్తులను ఇక్కడే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా కిలో ధర రూ.8 మాత్రమే ఉందని దీనికి తోడు ఎగుమతులు వేగంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నా మని పరిశ్రమ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


గోదాముల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలి

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయంగా అందిస్తున్న కొబ్బరి పీచు తయారీ వ్యవసాయ నుబంధ పరిశ్రమ. ఇటువంటి పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. ఉత్పత్తి అయిన కొబ్బరి పీచును చిన్న పరిశ్రమ నిర్వాహకులు నిల్వ చేసుకునేందుకు గోదాములకు ఏర్పాటు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని పరిశ్రమ నిర్వాహకులు కోరుతున్నారు.  ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదని కరోనా నేపథ్యంలో రాయితీలు అందించి ఆదుకోవాలని  కొబ్బరి పీచు పరిశ్రమ నిర్వహకులు కోరుతున్నారు. 


ప్రభుత్వం రాయితీ కల్పించాలి

గూడపాటి భీష్మ, పరిశ్రమ నిర్వాహకుడు, ధర్మరావుపేట

వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న కొబ్బరి పీచు పరిశ్రమలకు విద్యుత్‌లో రాయితీ కల్పించాలి. మొదటిసారి లాక్‌డౌన్‌ వల్ల పీచు పరిశ్రమకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత కొంత వెసులుబాటు వచ్చినప్పటికీ మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో మళ్లీ పీచు ఎగుమతులు నిలిచి పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమ నిర్వహకులకు అదనంగా ఖర్చు పెరిగింది. ప్రభుత్వం పీచు పరిశ్రమ నిర్వాహకులను ఆదుకోవాలి.



 గోదాములు లేక ఇబ్బందులు

ఎ,వేణుగోపాల్‌, పరిశ్రమ నిర్వాహకుడు మేదినరావుపాలెం

కొబ్బరి పీచు పరిశ్రమ చిన్న తరహ పరిశ్రమ కావ డంతో మార్కెట్‌ హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతు న్నాం. ఎగుమతులు నిలిచిన సమయంలో తయారైన పీచును నిల్వ చేసుకునేందుకు గోదా ములు లేక పీచు వర్షంలో తడవడంతో నష్టపోతున్నాం.

Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST