రెండేళ్లుగా మరమ్మతులకు నోచుకోని రోడ్లు : చింతమనేని

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

ఎటుచూసినా గోతులు పడి, ఆ గోతుల్లో వర్షపునీరు చేరి, చెరువులను తలపిస్తూ ప్రమాదకరంగా మారిన రహదారులు.

రెండేళ్లుగా మరమ్మతులకు నోచుకోని రోడ్లు : చింతమనేని
బాపిరాజుగూడెం అడ్డరోడ్డు దగ్గర గోతులు పూడ్చుతున్న చింతమనేని

పెదవేగి, జూలై 24 : ‘ఎటుచూసినా గోతులు పడి, ఆ గోతుల్లో వర్షపునీరు చేరి, చెరువులను తలపిస్తూ ప్రమాదకరంగా మారిన రహదారులు. రెండేళ్లుగా కనీసం మరమ్మతులకు నోచుకోని వైనం. ఇలాంటి రహదారులపై ప్రయాణంతో వాహనాల మరమ్మతులతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో రహదారులపై ఉన్న గోతులను పూడ్చడానికి ప్రయత్నిస్తుంటే అధికార పార్టీ పోలీసులను ప్రయోగించి, ఆపేస్తున్నారు. ఇదేలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉంది’.. అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. పెదవేగి మండలం నడిపల్లి సమీపంలో బాపిరాజుగూడెం అడ్డరోడ్డు దగ్గర ఏలూరు – చింతలపూడి ఆర్‌అండ్‌బీ రహదారిపై పడిన గోతులను పూడ్చే కార్యక్రమాన్ని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు శనివారం ఉదయం చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న ఏలూరు రూరల్‌ సీఐ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెదవేగి, పెదపాడు ఎస్‌ఐలు సుధీర్‌, జ్యోతిబసుతో పాటు భారీగా పోలీస్‌సిబ్బంది గోతులు పూడ్చకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ బాపిరాజుగూడెం అడ్డరోడ్డు దగ్గర కొంతమేర గోతులను పూడ్చిన ప్రభాకర్‌ ఆపై లింగపాలెం మండలం పరిధిలో గోతులను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన రెండేళ్ళు దాటినా రహదారుల బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు.  ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికే గోతులు పూడ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొప్పన సుధాకర్‌, మాగంటి నారాయణప్రసాద్‌, మన్నే మోహనరావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST