కరోనాతో కుదేలు

ABN , First Publish Date - 2021-05-16T05:37:52+05:30 IST

కరోనా విజృంభించడంతో నెలకొన్న పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో వ్యాపార సంస్థలు అతలాకుతలమవుతు న్నాయి.

కరోనాతో కుదేలు


సంక్షోభంలోకి హోటల్‌.. 

రెస్టారెంట్ల వ్యాపారం ..రెండో ఏడాదీ దెబ్బ 

70 వేలకు పైగా కుటుంబాల్లో ఉపాధి కరువు


భీమవరం, మే 15 :  కరోనా విజృంభించడంతో నెలకొన్న పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో వ్యాపార సంస్థలు అతలాకుతలమవుతు న్నాయి. దివాళా తీస్తున్నాయి. వ్యాపారులే కాదు..వాటిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితులు కూడా అగమ్యగోచరంగా మారాయి. ఫుడ్‌ రెస్టారెంట్లు,  క్యాంటీన్లు, హోటళ్ల పరిస్థితి దారుణంగా మారింది. గతేడాది కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరి నుంచి అనేక కొత్త రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. పాత రెస్టారెంట్‌ వ్యాపారులు కూడా కోలుకుంటూ మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ మళ్లీ కాటేయడంతో గుక్కతిప్పు కోలేకపోతున్నారు.

ఆహార వ్యాపార సంస్థల నిర్వహణ పెద్ద తలనొప్పి వ్యాపారం. భవన నిర్వహణ, అద్దెలు దగ్గర్నుంచి రుచిగా వండే వంటమేస్త్రీలు, సహాయకులు సరిగా ఉంటేనే ఆ వ్యాపారం సక్రమంగా నడుస్తుంది. పెరిగే ధరలు, ప్రతికూల వాతావరణం వంటివి సంబంధం లేకుండా వీటిని నడపాల్సి ఉంది. నైపుణ్యం కలిగిన వంటగాళ్ల కారణంగానే హోటల్‌కి మంచి పేరొస్తుంది. అందుకే ఎట్టి పరిస్ధితుల్లో నైనా కుక్‌తో పాటు పనిచేసే బృందాన్ని యజమానులు కొనసాగిస్తుంటారు.  గతేడాది సమయంలోనూ వీటిని మెయింటినెన్స్‌ చెయ్యక తప్పలేదు. వీరందరికీ వేతనాలు చెల్లిస్తూ, లేదా కొంత తగ్గించినా భోజన వసతి కల్పిస్తూ నిర్వహించాల్సి వచ్చింది. పాక్షిక లాక్‌డౌన్‌తో వ్యాపారం 80 శాతం పడిపోయింది. జిల్లాలో 70 వేల కుటుంబాలు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నాయి.  చిన్నచిన్న క్యాంటీన్లు, హోటళ్ళు కలిపి 3500 పైగా ఉన్నాయి. గతేడాది నుంచి ఇవన్నీ కరోనా ప్రభావంతో నష్టాల బాటలో నడుస్తున్నాయి. అందులో పనిచేసే కుటుంబాల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఒడిశా,ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన కుటుంబాలు ఎక్కువుగా ఉపాధి పొందుతున్నారు. కరోనా కారణంగా ఆ కుటుంబాలన్నీ విలవిలలాడుతున్నాయి. 



అన్నీ భారంగా మారాయి

కడియం వెంకటేశ్వరరావు, హోటల్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, విజయ మెస్‌, తణుకు

గతేడాది కూడా కరోనా కారణఃగా వ్యాపార రంగం తీవ్రంగా నష్టపోయింది. కార్మికుల వేతనాలు కూడా గత మూడేళ్లలో పెరిగాయి. నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు బాగా పెరిగాయి. విద్యుత్‌ బిల్లులు భారంగా తయారయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్ళీ కరోనా వల్ల తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాం .హోటల్‌ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్‌, గ్యాసు సిలెండర్లు సభ్సిడీపై ఇవ్వాలి. పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి. ఆస్తిపన్ను, విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ రుసుములను మినహాయించాలి


మెయింటినెన్స్‌ ఆర్థిక భారం..

కాశీ, అభిరుచి రెస్టారెంట్‌, భీమవరం

రెస్టారెంట్‌ నిర్వహణ అంతకంతకు భారమైపోతోంది. కరోనాతో గతేడాది ఆరు నెలలు మూసివేశాం. ఇప్పుడు రెండో నెల నడుస్తోంది. అయినా వంటవాళ్లను, పనివాళ్లను కొనసాగించక తప్పడం లేదు. కష్టకాలంలో వారిని వదిలేయడం సరికాదు. రెట్టింపు పెరిగిన ధరలు..మరోవైపు కరోనాతో పరిస్థితి దారుణంగా మారింది. 



రెస్టారెంట్‌ వ్యాపారం కుదేలైంది..

లక్కు కొండ, అన్నపూర్ణ రెస్టారెంట్‌, నరసాపురం

రెస్టారెంట్‌ వ్యాపారాన్ని కొవిడ్‌ కుదేలు చేసింది. రెస్టారెంట్లకు వచ్చి తినేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. పార్సిల్‌ వ్యాపారం వల్ల ఒక రోజు అమ్మకాలుంటే మరో రోజు ఉండవు. ఒక్కోరోజు ఖర్చులు కూడా రాని పరిస్థితి. ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం నుంచి నియంత్రణ లేదు. కనీసం కరెంటు బిల్లు అయినా తగ్గిస్తే కొంత వరకు తట్టుకోగలం.



చిన్నాభిన్నం చేసింది

చేకూరి రాజేష్‌ వర్మ, జిల్లా జాయింట్‌ సెక్రటరీ, తణుకు

కరోనా వందలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అద్దెలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. యజ మానులు, కార్మికులు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు పడుతున్నాం.


 వ్యాపారాలు జరగడం లేదు

బి.రాజా, జిల్లా సెక్రటరీ, తణుకు

వ్యాపారాలు చేయలేక, అలాగని మానలేక ఇబ్బందులు పడుతున్నాం. 12 గంటల సమయం ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ సమయంలోనే వ్యాపారాలు ప్రారంభ మవుతాయి. అపుడే మూసి వేయడంతో వ్యాపారాలు జరగడం లేదు. సిబ్బందిని కాపాడుకోవడం ఇబ్బర దికరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - 2021-05-16T05:37:52+05:30 IST