రక్తదాత సుభీభవ

ABN , First Publish Date - 2021-06-14T04:50:24+05:30 IST

ఒక ప్రముఖ సేవా సంఘం తణుకులో రక్త నిధిని నిర్వహిస్తోంది. గతంలో 60 బ్యాగుల వరకు రక్తం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఒక్క యూనిట్‌ కూడా లభ్యత లేదు.

రక్తదాత సుభీభవ

కొందరే ముందడుగు

నిండుకుంటున్న బ్లడ్‌ బ్యాంకులు

కరోనాతో వెనక్కి తగ్గుతున్న దాతలు

ఆపత్కాలంలో లభ్యత లేక ఆందోళన

రక్తం కోసం బంధువుల పాట్లు

అపోహలు వీడాలంటున్న వైద్యులు

నేడు రక్తదాన దినోత్సవం

ఉండ్రాజవరం/నిడదవోలు/ ద్వారకా తిరుమల, జూన్‌ 13 :

ఒక ప్రముఖ సేవా సంఘం తణుకులో రక్త నిధిని నిర్వహిస్తోంది. గతంలో 60 బ్యాగుల వరకు రక్తం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఒక్క యూనిట్‌ కూడా లభ్యత లేదు. బాధితులు వస్తుంటే రక్తదాతల ఫోన్‌ నెంబర్‌లు ఇస్తున్నారు. అంతకుమించి ఏమీ చేయలేకపోతున్నా మని రక్త నిధి నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. 

తాడేపల్లిగూడెంలోనూ అదే సేవా సంఘం మరో రక్త నిధిని నిర్వహిస్తోంది. గతంలో 30 బ్యాగులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడా సంఖ్య పదికి పడిపోయింది. అత్యవసరమైతేనే రక్తం యూనిట్‌లు సరఫరా చేయగలుగుతున్నారు. గతంలో ఒక కేటగిరీకి రక్తం యూనిట్‌ను ఇస్తే తమకు అవసరమైన కేటగిరీ ఇచ్చేవారు. అత్యవసరమైతే ఎటువంటి రక్తం యూనిట్‌ తీసుకోకుండానే సరఫరా చేసేవారు. ఇప్పుడు సంబంధిత కేటగిరీ రక్తం ఇస్తేనే అదే యూనిట్‌ను సరఫరా చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అక్కడ రక్తనిధిలో నిల్వలు లేకపోవడంతో స్థానికంగా సేవా సంఘం నిర్వహిస్తున్న రక్త నిధికి బాధితులను పంపుతున్నారు. 

జిల్లాలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ నిర్వహిస్తోన్న ఏలూరు రక్త నిధి ప్రధానమైంది. అక్కడ సగటున వంద బ్యాగ్‌లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది. అందరికీ రక్తం ఇవ్వ డం సాధ్యపడడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే భవి ష్యత్తులో రెడ్‌క్రాస్‌ సొసైటీ చేతులెత్తేయాల్సిందే!


 ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానాన్ని మిం చింది ఏముంది ? ఈ బాధ్యతను జిల్లాలోని కొందరు యువత తీసు కుంటున్నారు. వందల వేల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. రక్త లేమితో బాధపడుతు న్న వారిని ఆదుకునేందుకు జిల్లావ్యాప్తంగా బ్లడ్‌ బ్యాంకు లు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏలూరుతోపాటు పట్టణాలై న భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలుతోపాటు పలు ప్రాంతాల్లో బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. వీటితోపాటు స్వచ్ఛంద సంస్థలు ద్వారా రక్తదానాలు చేస్తున్నారు. సినీనటుల పుట్టినరోజు సందర్భాల్లో అభిమాన సంఘాలు రక్తదాన శిబిరాలు నిర్వ హిస్తూ తమదైన సేవ చేస్తున్నారు. ఈ కోవలో ఉండ్రాజ వరం మండలం పసలపూడికి చెందిన యువర్‌ సర్వెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చీపుళ్ల విజయ్‌ అనేక మందికి రక్తదానం అందజేసి తన వంతు సహాయం పేదలకు అందజేస్తున్నారు. రక్తదానంపై నెలకొన్న అపోహలు వీడాలని వైద్యులు సూచిస్తున్నారు. 

38 సార్లు రక్తదానం చేశా

‘ఎవరో ఆపదలో ఉంటే మనకెందుకులే అని వదిలేయకూడదు. మనకు చేతనైన సాయం చేయాలి. అప్పుడే మన ఇంటిలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనకు సాయం చేసేందుకు నలుగురూ వస్తారు’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అలా అనుకునే అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని భావించాను. ఇప్పటి వరకు ఆపదలో వున్న వారికి 38 సార్లు రక్తదానం చేశాను. మా మిత్రులతో కలిసి నాకు చేతనైన సాయం చేస్తున్నా. ఇలా రక్తం ఇచ్చినప్పుడు పేదలకు సాయం చేస్తున్నాననే ఆనందం కలుగుతుంది. 

– కోడి ఉమామహేశ్‌, కొమ్మర


 రక్తదానంతోనే ఆరోగ్యం..

శరీరంలోని రక్తాన్ని ఇవ్వడం ద్వారా శక్తిని కోల్పోతామని చాలామంది అపోహ పడుతుంటారు. ఇది నిజం కాదు. తరచూ రక్తాన్ని ఇవ్వడం ద్వారా శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీర బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల ఒబేసిటీ వంటి సమస్యలను నియంత్రిం చవచ్చు. శరీరంలో మోతాదుకు మించిన ఐరన్‌ నిల్వలు ఉంటే అవి బయటకు వెళ్లిపోతాయి. కొన్ని రకాల రక్త క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం వున్న ప్రతి ఒక్కరూ 90 రోజులకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు. కొవిడ్‌ భయాల వల్ల చాలా మంది రక్తదానం చేయడం లేదు. కొవిడ్‌ బారిన పడిన వారు నెగిటివ్‌ టెస్ట్‌ రిజల్ట్‌ వచ్చిన రెండు నుంచి నాలుగు వారాల తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్తదానం చేయవచ్చు. అలాగే కొవిడ్‌ టీకా తీసుకున్నవారు నిస్సంకోచంగా రక్తదానం చేయవచ్చు. 

– డాక్టర్‌ మన్నే భవ్యచంద్‌, ఎంఎస్‌, విర్డ్‌ హాస్పటల్‌, ద్వారకా తిరుమల


యువత ముందుకు రావాలి

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దు. ఆరోగ్యకరమైన వ్యక్తికి శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం ఇవ్వడం వల్ల శుద్ధి అవడంతోపాటు.. కొత్త రక్తకణాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి రక్తాన్ని దానం చేయవచ్చు. అయితే ఫ్లూ జ్వరం ఉన్నవారు, యాంటీ బయోటిక్స్‌ మందులు వాడేవారు, 45 కేజీల లోపు బరువున్న వారు రక్తదానం చేయరాదు. 

– డాక్టర్‌ ఆర్‌.ప్రసాద్‌, మెడికల్‌ ఆఫీసర్‌, ఉండ్రాజవరం పీహెచ్‌సీ


 3,500 మందికి బ్లడ్‌ అందించాం

చిన్నప్పటి నుంచి ఏదో సేవ చేయాలనే తపన ఉండేది. ఓ రోజు బ్లడ్‌ లేక ఓ చిన్నపాప చనిపోయింది. ఆ వార్త విని చాలా బాధవేసింది. అలా జరగకూడదనే ఆలోచనతో ‘బ్లడ్‌ డోనర్స్‌ ఆర్మీ’ అనే చిన్న వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశాను. ఇందులో చాలా మంది సభ్యులు ఉన్నారు. ఎవరికైనా బ్లడ్‌ కావాలంటే.. గ్రూపు నుంచి ఎవరో ఒకరు వెళ్లి బాధితులను ఆదుకుంటున్నాం. నేను 35 సార్లు రక్తదానం చేశా. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 3,500 మందికి గ్రూపు సభ్యుల ద్వారా బ్లడ్‌ అందించాం. అలాగే ఎవరూ ఆకలితో ఉండకూడదనే భావనతో యువర్‌ సర్వెంట్స్‌ అనే సంస్థను స్థాపించి కరోనా వేళ ఎందరికో అన్నదానం చేశాం. ఆక్సిజన్‌ సిలిండర్లు అందిస్తున్నాం. కరోనాతో చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తున్నాం. 

– చీపుళ్ళ విజయ్‌, పసలపూడి

 

80 సార్లు రక్తదానం 

అన్నిదానాలలోకి రక్తదానమే మిన్న. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తం అందించడం ద్వారా ప్రాణదాతలుగా నిలవచ్చు. నేను మొదటిసారి విజయవాడ కూలిపనికి వెళ్లినప్పుడు స్కూల్‌ నుంచి వస్తున్న ఒక విద్యార్థినిని లారీ ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ విద్యార్థి నికి రక్తం అందించి కాపాడం ద్వారా కలిగిన తృప్తి నన్ను రక్తదాతగా మార్చేసింది. ఇప్పటికి 80 సార్లు రక్తదానం చేశా. రక్తదానం చేసేందుకు యువతను ప్రోత్సహిస్తున్నా. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ ఆపదలో వున్న వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి.

– పరిపల్లి రమణ, రక్తదాత, కంసాలిపాలెం  


రక్త నిధులు కావలెను

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

రక్త నిధుల్లో నిల్వలు ఖాళీ అయిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రక్త దాతలు ముందుకు రావ డం లేదు.  కొవిడ్‌ ప్రభావంతో జిల్లాలోని రక్త నిధు లు నిండుకుంటున్నాయి. ఏలూరు రెడ్‌ క్రాస్‌ సొసై టీలో అన్ని కేటగిరీల రక్తం లభ్యమయ్యేది. ఇప్పడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బాధితులు రక్త నిధులు ఆశ్రయిస్తున్నా రిక్తహ స్తాలతో వెనుతిరగాల్సి వస్తోంది. కొవిడ్‌ కారణంగా రక్తదాన శిబి రాలు నిర్వహించడం లేదు. రక్త నిధులకు వెళ్లి రక్తదాత లు ఇచ్చిన సందర్భాలు ఉండే వి. ప్రస్తుతం కరోనా భయాల వల్ల కొందరు దాతలు ముందు కు రాకపోవడంతో రక్తానికి కొరత ఏర్పడుతోందని భావిస్తున్నారు. దీనివల్ల బాధితులు ఇబ్బందులు పడు తున్నారు. రక్తహీనత, తలసీమియా ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించుకుంటారు. శస్త్ర చికిత్సలకు రక్తం అవసరం అవుతుంది. గర్భిణులకు ఒక్కోసారి రక్తం కావాలి. గతంలో దాతలు అందుబా టులో ఉండేవారు. అవసరమైన వారికి సరఫరా చేసేవారు. రక్తం దానం చేయడానికి కొందరు సోషల్‌ మీడియాలోనూ ప్రత్యేకంగా గ్రూపులు నిర్వ హిస్తున్నారు.  ఇప్పుడు చాలావరకు అవి యాక్టివ్‌గా లేవు. కరోనా బారిన పడుతున్నామన్న అపోహ దాతల్లో నెలకొన డమే దీనికి ప్రధాన కారణం. రక్తం దానం చేసిన తర్వాత కరోనా బారిన పడితే కోలు కోవడం కష్టమన్న అభిప్రాయం ఏర్పడడంతో వెనుకంజ వేస్తున్నారు. సేవా సంఘాలు, ట్రస్ట్‌లు, విద్యా సంస్థలు రక్త దాన శిబిరాలు నిర్వహించేవి. పుట్టినరోజు సందర్భంగానూ రక్తదానాలు ఆనవాయితీగా వచ్చేది. ఇప్పు డవేమీ లేకపో వడంతో రక్తానికి కొరత ఏర్ప డుతోంది. ఆపత్కర సమయంలోనూ అందుబాటులో ఉండడం లేదు. కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నవారు ఇవ్వకూడదన్న అనుమానాలు ఉన్నాయి. అయితే వ్యాక్సిన్‌ వేసుకున్న కొద్ది రోజుల తర్వాత రక్తం ఇవ్వచ్చంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-14T04:50:24+05:30 IST