రూపు మారనుందా?

ABN , First Publish Date - 2022-07-07T05:13:51+05:30 IST

భీమవరం పట్టణాన్ని నగరంగా మార్చి కార్పొరేషన్‌ హోదా లభించే అవకాశాలు సమీపంలోనే ఉన్నాయంటున్నారు.

రూపు మారనుందా?

భీమవరానికి కార్పొరేషన్‌ హోదా..!

సుముఖంగా  ప్రత్యేక అధికారి కలెక్టర్‌ ప్రశాంతి
ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ పంపించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌
త్వరలో ముఖ్యమంత్రి కలెక్టర్ల   సమావేశంలో చర్చించే అవకాశం


భీమవరం, జూలై 6 : భీమవరం పట్టణాన్ని నగరంగా మార్చి కార్పొరేషన్‌ హోదా లభించే అవకాశాలు సమీపంలోనే ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు రాజధానిగా భీమవరాన్ని ప్రకటించడంతో ప్రత్యేకత లభించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1.42 లక్షల జనాభా ఉండగా.. ఈ  పదకొండేళ్లలో పెరిగిన జనాభాతో పాటు నాలుగు సమీప గ్రామాలను పట్టణంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జనాభా అంచనా వేస్తే సుమారుగా రెండు లక్షలకు చేరవచ్చని అంచనా. ఇలా పరిశీలించిన కార్పొరేషన్‌ హోదాకు దగ్గరగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తాజాగా కార్పొరేషన్‌ చేయాలంటూ లేఖను ప్రభుత్వానికి పంపినట్టు ప్రకటించారు. మెట్రోస్థాయి లో అభి వృద్ధి పనులు చేస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. భీమవరం మునిసిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్‌ ప్రశాంతి కూడా  పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, కార్పొరేషన్‌ హోదా కు సానుకూలంగానే ఉన్నారు.  నెలరోజులుగా  పట్టణంలో సుమారు రూ.3 కోట్లతో సుందరీకరణ పనులను చేపట్టారు. 1948లో మునిసిపాలిటీగా మారిన భీమవరం ఇంత వరకు సుందరీకరణ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉందనే చెప్పాలి. జిల్లా కేంద్రమైన పట్టణం కార్పొరేషన్‌గా ఉండాలంటూ 2008లో ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో అనేక జిల్లా కేంద్రాలు కార్పొరేషన్‌గా మారాయి. అలా ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారడానికి ఆస్కారం ఉందని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతానికి ఎక్కడ ఎన్నికలు లేవు. ప్రత్యేక పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ హోదాకు మార్పులు చేసినచో ఎటువంటి రాజకీయ పరమైన చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు. గత దశాబ్ద కాలంగా పట్టణం అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో భీమవరం కార్పొరేషన్‌గా మార్చేసే అంశం తెరపైకి వస్తుందని తెలిసింది. 

Updated Date - 2022-07-07T05:13:51+05:30 IST