ఆధార్‌ ఉంటేనే బెల్లం అమ్ముతారట!

ABN , First Publish Date - 2022-05-21T06:15:11+05:30 IST

బెల్లం కావాలంటే ఆధార్‌ కార్డు ఇవ్వండి... లేదంటే బెల్లం అమ్మం.. అంటూ వ్యాపారస్తులు కరాకండీగా చెబుతున్నారు.

ఆధార్‌ ఉంటేనే బెల్లం అమ్ముతారట!

ఎస్‌ఈబీ ఆదేశాలతో మార్కెట్‌లో లభించని బెల్లం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు  


ఆకివీడు రూరల్‌ మే 20 : బెల్లం కావాలంటే ఆధార్‌ కార్డు ఇవ్వండి... లేదంటే బెల్లం అమ్మం.. అంటూ వ్యాపారస్తులు కరాకండీగా చెబుతున్నారు. ఇదేమీ చిత్రం అనుకోకండి.. ఆకివీడు మార్కెట్‌లో ఇదే పరిస్థితి ఉంది. స్థానికంగా బెల్లం అమ్మేందుకు వ్యాపారులు జంకుతున్నారు. సారాను అరికట్టే కార్యక్రమంలో ఎస్‌ఈబీ అధికారులు చేపట్టిన చర్యలతో బెల్లం వ్యాపారులు, ఆక్వా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. సారా తయారీని అరికట్టేందుకు బెల్లం అమ్మకాలపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పది కిలోల బెల్లం అమ్మాలంటే కొనుగోలుదారుడి ఆధార్‌ కార్డును తీసుకోవాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారస్తులు తమవద్ద ఉన్న బెల్లం నిల్వలు, ఎవరెరికి అమ్మారో వివరాలు అధికారులకు తెలపాల్సి ఉంది. మార్కెట్‌లో ఏ దుకాణానికి వెళ్లినా బెల్లం లభించడం లేదు. ఎవరు ఎందుకు తీసుకెళతారో తెలియని పరిస్థితిలో తమకెందుకు లేనిపోని సమస్యలు అనుకుంటూ వ్యాపారస్తులు బెల్లం అమ్మకాలు మానేశారు.


ఆక్వాకు తీవ్ర నష్టం..

ఆక్వా సాగులో బెల్లం వినియోగం ఎక్కువగా ఉంటుంది. రొయ్యలకు ఇవ్వాల్సి ఆహారం, మందులలో బెల్లం ఎక్కువగా ఉప యోగిస్తారు. బెల్లం రొయ్యలకు ప్రొపబెటిక్‌గా ఉపయోగపడుతుంది. రొయ్య లకు మేలు చేసే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఆక్వా రైతులు ఎక్కువ మొత్తంలో బెల్లం కొనుగోలు చేస్తుం టారు. అధిక విస్తీర్ణంలోని ఆక్వా సాగుకు అధిక మొత్తంలో టన్నుల కొద్ది బెల్లం అవసరం ఉంది. ఆధార్‌ కార్డు తీసు కొచ్చి కొనుగోలు చేయాలనే  నిబంధనతో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పోనీ కొనుగోలు చేద్దామన్నా బెల్లం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లం తయారు చేసే రైతులు బెల్లం అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతుంటే, కొనుగోలు చేసేందుకు బెల్లం దొరకక ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సారా తయారీ, అమ్మకాలను అరికట్టేందుకు రైతులను ఇబ్బం దులు పాలు చేయడం సరికాదని వాపోతున్నారు.

Updated Date - 2022-05-21T06:15:11+05:30 IST