ఊహాగానాలకు తెర

ABN , First Publish Date - 2022-09-25T06:27:13+05:30 IST

ఊహాగానాలకు తెరపడింది. తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావును బాధ్యతల నుంచి తప్పించారు.

ఊహాగానాలకు తెర

డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు తొలగింపు
ఇన్‌చార్జ్‌గా డాక్టర్‌ ప్రమోద్‌ మధుకర్‌ పడోలే  కొనసాగింపు
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనే ఇన్‌చార్జ్‌
స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
కొత్త డైరెక్టర్‌పై అంతా ఆసక్తి
రాజకీయ జోక్యంతో అధికారులపై ఒత్తిళ్లు


 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఊహాగానాలకు తెరపడింది. తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావును బాధ్యతల నుంచి తప్పించారు. మాతృసంస్థ వరంగల్‌ నిట్‌లో రిపోర్ట్‌ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నలుగురికి ఉద్యోగాలు కల్పించారన్న అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆయనను  కేంద్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు మళ్లీ బాధ్యతలు చేపడతారంటూ ఊహించారు. సీబీఐ కేసు ఉండడంతో డైరెక్టర్‌ పదవిపై వేటుతప్పదంటూ కొందరు భావించారు. అందరి ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను డైరెక్టర్‌ విధుల నుంచి తప్పించింది. గడచిన ఆరు నెలల నుంచి నాగపూర్‌ నిట్‌ డైరెక్టర్‌ ప్రమోద్‌ మధుకర్‌ పడోలేకు ఏపీనిట్‌ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రెగ్యులర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావును విధుల నుంచి తప్పించిన తర్వాత కూడా డాక్టర్‌ ప్రమోద్‌ మధుకర్‌నే ఏపీ నిట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. వాస్తవానికి రెగ్యులర్‌ డైరెక్టర్‌ను మళ్లీ నియమించాలంటే కాలతీతమ వుతుంది. అదే ఇప్పుడు నిట్‌ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. 2015లో  ఏపీనిట్‌ ప్రారంభమైనప్పుడు ఇన్‌చార్జ్‌గా డాక్టర్‌ రమేష్‌ను నియమించారు. మూడేళ్లపాటు ఆయన ఇన్‌చార్జ్‌గానే బాధ్యతలు నిర్వహించారు. వరంగల్‌ నిట్‌లో  ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఏపీ నిట్‌ తాత్కాలిక క్యాంపస్‌లోనే ఉంటూ నిట్‌ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత  2018లో ఏపీ నిట్‌ రెగ్యులర్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ రావు బాధ్యతలు చేపట్టారు. ఏపీ నిట్‌ సొంత క్యాంపస్‌ సిద్ధమై తాత్కాలిక క్యాంపస్‌ నుంచి సొంతగూటికి  మారింది. రెగ్యులర్‌ ఫ్యాకల్టీ నియమించారు. ఇన్‌ఛార్జ్‌ అయినా, రెగ్యులర్‌ డైరెక్టర్‌ అయినా నిత్యం క్యాంపస్‌లోనే ఉంటూ పాలన కొన సాగించారు. ఎప్పటికప్పుడు కేంద్రా నికి ప్రతిపాదనలు పంపడం సాధ్య మైంది. ఈ క్రమంలో డైరెక్టర్‌గా డాక్టర్‌ సూర్యప్రకాశరావు సస్పెండ్‌ అయిన తర్వాత నాగపూర్‌ నిట్‌ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్ప గించారు. ఆయన రెండు పర్యా యాలు మాత్రమే ఏపీనిట్‌ను సంద ర్శించారు. బిల్లులు మంజూరు చేయాలంటే ఏపీనిట్‌ నుంచి ప్రతి నెలా రిజిస్ర్టార్‌ నాగ్‌పూర్‌ వెళుతు న్నారు. అదే పూర్తిస్థాయిలో ఏపీ నిట్‌లో ఉండేవిధంగా ఇన్‌చార్జ్‌ను నియమిస్తే పాలన సవ్యంగా సాగుతుంది.

ఫేజ్‌–2 సాగేనా..
ఇదివరకే ఏపీనిట్‌ నుంచి కేంద్రా నికి ఫేజ్‌–2 ప్రాజెక్ట్‌పై ప్రతిపాదన లు పంపారు. ఫేజ్‌–1లో దాదాపు రూ.525 కోట్లతో శాశ్యత క్యాంపస్‌ నిర్మించారు. ఫేజ్‌–2లో దాదాపు రూ.713 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏపీనిట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఆమోదంతో కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై నిట్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. గడచిన కొన్ని నెలల నుంచి కేంద్రంతో సంప్రదింపులు తగ్గాయి. పాలన సజావుగా సాగే పరిస్థితి లేకుండా పోయింది. బిల్లుల కోసం కష్టాలు పడుతున్నారు. రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియామకంతోనే ఇటువంటి అవరోధాలు తొలగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అంతవరకైనా ఏపీనిట్‌లో నిత్యం అందుబాటులో ఉండే ప్రొఫెసర్‌ని ఇన్‌చార్జ్‌గా నియమించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రగతి కుంటుపడుతుంది. వాస్తవానికి ఏపీనిట్‌ ప్రారంభమైన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు పొందింది. దక్షిణాదిలోనే నెంబర్‌ వన్‌ విద్యా సంస్థగా అవార్డు సొంతం చేసుకుంది. గతంలో పాలకులు చేసిన కృషి అందుకు దోహడపడింది. అటువంటి అభివృద్ధి సాధ్యపడాలంటే త్వరితగతిన డైరెక్టర్‌ నియామకంపై కేంద్రం  నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 ఏపీ నిట్‌పై రాజకీయ జోక్యం
జాతీయ విద్యా సంస్థ అయిన ఏపీనిట్‌లో రాజకీయ ప్రమేయం అధికంగా ఉంటోంది. అవుట్‌ సోర్సింగ్‌ నియామకంలో, ఫ్యాకల్టీ ఏర్పాటులో రాజకీయ నేతల సిఫారసులు అధికంగా ఉంటున్నాయి. అంతిమంగా నిట్‌ అధికారుల మెడకు అవి చుట్టుకుంటున్నాయి. ఏపీనిట్‌లో జరిగిన తాజాగా జరిగిన పరిణా మాలకు గతంలో రాజకీయ సిఫారసులు కారణమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.  అప్పట్లో ఉద్యోగాల భర్తీపై రాజకీయ నాయకులు ఒత్తిడి పెంచారు. ఇప్పటికీ ఏపీనిట్‌పై స్థానిక రాజకీయ నాయకుల దృష్టి ఉంటోంది. అది ఒక జాతీయ విద్యా సంస్థ అన్న విషయాన్ని పక్కన పెట్టి తమ సిఫారసులకు పెద్దపీట వేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీనిట్‌ ప్రతిష్ట మసక బారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీబీఐ కేసులతో నష్టం వాటిల్లింది. ప్రగతి మందగించింది.

Updated Date - 2022-09-25T06:27:13+05:30 IST