3,55,051 మంది తల్లులకు అమ్మఒడి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-01-11T06:01:40+05:30 IST

అమ్మఒడి ఆర్థిక సాయం జిల్లాలో సోమవారం తొలుత 3,55,051 మంది తల్లులు/సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు జమ కానుంది.

3,55,051 మంది తల్లులకు అమ్మఒడి ఆర్థిక సాయం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 10 : అమ్మఒడి ఆర్థిక సాయం జిల్లాలో సోమవారం తొలుత 3,55,051 మంది తల్లులు/సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు జమ కానుంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకూ (జూనియర్‌ ఇంటర్‌ మినహా) ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో నమోదైన మొత్తం 5,52,783 మంది విద్యార్థులతో కూడిన అర్హుల తొలి జాబితా నుంచి కుటుంబానికి ఒక లబ్ధిదారు వంతున తల్లులు/ సంరక్షకులను  ఎంపిక చేశారు. ఆమేరకు అమ్మఒడి ఆర్థిక సాయం కింద ప్రభుత్వం  ఒక్కో లబ్ధిదారుకు ఇచ్చే రూ.15 వేలలో రూ.వెయ్యిని స్కూల్‌ టాయిలెట్‌ నిర్వహణ నిధి నిమిత్తం  మినహాయించుకుని మిగతా రూ. 14 వేలను సంబంధిత బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. కాగా తరగతుల వారీగా విద్యార్థుల వివరాలను కాని, ఆర్థిక సాయానికి అనర్హుల జాబితాలో చేర్చిన విద్యార్థుల సంఖ్యపై కాని జిల్లా విద్యా శాఖ  స్పష్టత ఇవ్వలేదు. ఇంతకుముందు విడుదల చేసిన జాబితాల్లో 41,809 మంది విద్యార్థులను వివిధ కారణాలతో అనర్హులుగాను, మరో 9179 మందిని నిలుపుదల (విత్‌హెల్డ్‌) జాబితాలోనూ ఉంచగా పలువురు తమ అభ్యంత రాలను తగిన ఆధారాలతో సహా గ్రామ / వార్డు సచివాలయాల్లో అందజేసినా వాటి పరిష్కారం గురించి ఇంతవరకూ ప్రస్తావించక పోవడం గమనార్హం.

 

ఎన్నికల కోడ్‌తో ప్రారంభ కార్యక్రమానికి పరిమితులు 


పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా సోమవారం ప్రారంభమయ్యే అమ్మఒడి ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహణపై జిల్లా విద్యాశాఖ ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామ స్థాయిలోని అన్ని పాఠ శాలల్లో  ప్రధానోపాధ్యాయలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయే తర సిబ్బంది, విద్యార్థుల తల్లి దండ్రులతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను కాని, రాజకీయ నాయకుల ను గాని ఆహ్వానించరాదని డీఈవో సీవీ రేణుక స్పష్టం చేశారు. అయితే పట్టణ/ నగర ప్రాంత పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనవచ్చునని వివరించారు. అమ్మఒడి పథకం లక్ష్యాలు, పాఠశాల టాయిలెట్ల పరిశుభ్రత, వాటి ఆవశ్య కత, నిర్వహణకు సంబంధించిన నిధుల గురించి విద్యార్థుల తల్లి దండ్రులకు అవగాహన కలిగించాలని సూచించారు. విద్యాకా నుకలో భాగంగా బాలబాలికలకు సరఫరా చేసిన యూనిఫాం దుస్తులు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, బూట్లు, బెల్టు, కుట్టు ఛార్జీలు తదితర అంశాలను పేరెంట్స్‌కు తెలియజేయాలని కోరారు. 

Updated Date - 2021-01-11T06:01:40+05:30 IST