భీమవరం ముస్తాబు

ABN , First Publish Date - 2022-07-03T06:48:02+05:30 IST

స్వాతంత్ర సమరయోధుడు.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి.

భీమవరం ముస్తాబు
భీమవరంలో రోడ్‌ సైడ్‌ వాల్స్‌కు రంగులు

రేపే ప్రధాని నరేంద్ర మోదీ రాక
అల్లూరి భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
భద్రతా వలయంలో భీమవరం
భారీగా చేరుకుంటున్న బలగాలు
రెండు రోజులపాటు పూర్తిగా నిషేధాజ్ఞలు
జల్లెడ పడుతున్న కేంద్ర భద్రతా యంత్రాంగం
డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లు ప్రత్యేక తనిఖీలు
దేశవ్యాప్తంగా అతిథులకు ఆహ్వానం
సీఎం జగన్‌ సహా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న, సినీ నటుడు చిరంజీవి రాక


ప్రధాని నరేంద్రమోదీ రేపు భీమవరం రానున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం జగన్‌ సహా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు రానున్నారు. ఈ మేరకు ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. భద్రతా సిబ్బంది భీమవరం పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


భీమవరం/టౌన్‌/క్రైం/ భీమవరం, జూలై 2(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర సమరయోధుడు.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అల్లూరి అందరివాడుగా కీర్తిస్తూ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అజాదికా అమృతోత్సవాలను భీమవరంలోనూ వైభవంగా నిర్వహిస్తున్నారు. క్షత్రియ సేవా సమితి సైతం కార్యక్రమాన్ని తన భుజాన వేసుకుని జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సర్వశక్తులొడ్డుతోంది.  పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గడచిన వారం రోజుల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రదర్శనలతో భీమవ రం పులకిస్తోంది. జాతినేతల వేషధారణలతో విద్యార్థులు, చిన్నారులు అలరిస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను స్థానికంగా ఉండే  అన్ని పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు. జయంతి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేలా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి కిషన్‌ కుమార్‌రెడ్డి ఓ వైపు, క్షత్రియ సేవా సమితి తరపున మరోవైపు అతిథులకు ఆహ్వానాలు వెళ్లాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆహ్వానం వెళ్లింది. ఆ పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు హాజరవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వమే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెరుకువాడ రంగరాజు ప్రకటించారు. వాస్తవానికి ప్రధాని పర్యటనలో సీఎం జగన్‌ పాల్గొంటారా ? లేదా ? అనే  సంశయం స్థానికుల్లో ఉండేది. దానిని తెరదించుతూ సీఎం హాజరవుతున్నారని రంగరాజు ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికే కేంద్ర ప్రభుత్వం తరపున జయంతి ఉత్సవాలు బాధ్యతలు అప్పగించారు. ఇది వరకే ఆయన భీమవరంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవికి ఆహ్వానం వెళ్లింది. అల్లూరి జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు చిరంజీవి సుముఖత చూపినట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.   బీజేపీ సీనియర్‌ నేత, సినీ నటుడు కృష్ణంరాజుకు ఆహ్వానం వెళ్లింది. ఆరోగ్యరీత్యా కృష్ణంరాజు కార్యక్రమానికి హాజరు కాలేకపో తున్నారు. అనివార్య కారణాలతో పవన్‌ కల్యాణ్‌ హాజరు కాలేకపోతున్నారని ఆ పార్టీ నాయకులు చెబు తున్నారు. మొత్తం పైన అల్లూరి జయంతి ఉత్సవా లకు అతిథులుగా అన్ని పార్టీల నాయకు లకు, ప్రముఖు లకు ఆహ్వానం వెళ్లింది. రెండు రోజులు ప్రధానితోపాటు, అతిథులతో జయంతి ఉత్సవాల్లో భీమవరం పట్టణం కళకళలాడనుంది.

పోలీసు వలయం
భీమవరం పట్టణం అంతా పోలీసుల వలయంగా మారిం ది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రెండు రోజులు ముందుగానే పోలీసులు పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భీమవరం ఒకటో పట్టణం, రెండో పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో పోలీసు బందోబస్తు నిర్వహించా రు. భవనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పట్టణంలోకి అనుమానాస్పద వ్యక్తులైవరైనా  ప్రవేశించారా.. అన్న ఆరా తీస్తున్నారు. భద్రతా చర్యలకు సంబంధించి ఇప్పటికే మ్యాప్‌ను రూపొందించుకున్నారు. జువ్వలపాలెం రోడ్డులో కూడా తనిఖీలు కొనసాగిస్తారు. ఆది, సోమవారాల్లో భీమవరం పట్ట ణం పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లిపోతుంది. అల్లూరి విగ్రహావిష్కరణ స్థలం, కాళ్ల మండలం పెద అమిరంలోని సభాస్థలిల వద్ద వేలమంది పోలీసులకు బందోబస్తుకు డ్యూటీ వేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటనకు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. గ్రౌహౌండ్స్‌, ఆక్టోపస్‌, సీఆర్‌పీఎఫ్‌, సివిల్‌, ఎస్‌పీఎఫ్‌ బలగాలు మొత్తం బందోబస్తులో పాల్గొం టున్నట్టు తెలిపారు. భీమవరం రెండో పట్టణం అంతా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రధాని పర్యట నను 18 మంది ఎస్పీలు, ఆరుగురు డీఐజీలు పర్యవేక్షిస్తు న్నట్టు తెలిపారు. కాగా వాతావరణం అనుకూలించకపోతే విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రధాని మోదీని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

పాస్‌లపై  అయోమయం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల నుంచి ఆసక్తి చూపుతున్నారు. ప్రధాని పర్యటన అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఈ క్రమంలో  ప్రముఖులకు పాస్‌ల విషయంలో ఆయోమయం నెలకొంది. ప్రధాని పర్యటనలో వేదిక అంతా కేంద్రం నుంచి వచ్చే భద్రతా సిబ్బంది చేతిలోకి వెళ్లిపోతుంది. కేంద్రం నుంచి వచ్చిన ఎస్‌పీజీ బృందం వీఐపీ పాస్‌లు ఇవ్వకూడదంటూ చెబుతున్నారు. జిల్లా అధికారులపై మాత్రం పాస్‌ల విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. జిల్లా కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగమంతా పాస్‌లు ఇవ్వాలన్న తలంపుతో ఉంది. ప్రస్తుతం వీఐపీ పాస్‌లపై అయోమయం నెలకొంది.   

విజయవాడ బస్సు రూట్‌ మార్పు
పెద అమిరం వద్ద దేశ ప్రధాని మోదీ బహిరంగ సభ దృష్ట్యా ఆదివారం అర్ధరాత్రి నుంచి నాలుగో తేదీ సాయంత్రం వరకు జువ్వలపాలెం రోడ్డు మీదుగా విజయవాడ రూట్‌లో తిరిగే బస్సుల రూట్‌ మార్పు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.వీరయ్యచౌదరి తెలిపారు. ఈ బస్సులన్ని భీమవరం, ఆకివీడు, అయి భీమవరం, ఏలూరుపాడు, మీదుగా విజయవాడ వెళతాయని, విజయవాడ నుంచి భీమవరం వచ్చే దూర ప్రాంత బస్సులన్ని కైకలూరు, ఆకివీడు మీదుగా వస్తాయని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.  
 
కైకలూరు నుంచి భీమవరం మహా పాదయాత్ర
కైకలూరు, జూలై 2 : దేశ స్వాతంత్య్ర కోసం అల్లూరి సీతారామరాజు చేసిన ఉద్యమం చిరస్మరణీయమైనదని, నేటి యువతకు ఇది మరింత గుర్తుండేలా  విగ్రహావిష్కరణ జరుగుతుందని మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. శనివారం స్థానిక ఏలూరు రోడ్డు నుంచి బీజేపీకి చెందిన బీసీ సం క్షేమ సంఘ నాయకుడు లావేటి వీరశి వాజీ ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహాష్క రణ కార్యక్రమానికి వెళ్లేందుకు మహా పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కైకలూరు నుంచి భీమ వరం వరకు చేపట్టిన మహా పాదయా త్రకు గ్రామ గ్రామాన ప్రజలు హారతులు పట్టారు. ఈ పాదయాత్రలో ఇద్దరు విక లాంగులు ట్రైసైకిళ్ళపై పాల్గొన్నారు. ఓ వైపు జాతీయ జెండా మరో వైపు అల్లూరి విగ్రహావిష్కరణ జెండాలను పట్టుకుని మూడుచక్రాలపై సైకిళ్ళపై పయనించడం విశేషం. కామినేని మాట్లాడుతూ అల్లూరి పోరాటం తెలుగు ప్రజలు గర్వించ దగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే జయ మంగళవెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, మాజీ జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మీ,  క్షత్రియ సంఘం అధ్యక్షుడు రామరాజు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
 
అల్లూరి ఆదర్శప్రాయుడు : రోజా

భీమవరం టౌన్‌, జూలై 2 : బ్రిటీష్‌ సామ్రా జ్యంపై అలుపెరగని పోరాటం  సాగించిన అల్లూరి సీతారా మరాజు అందరికీ ఆదర్శ ప్రాయుడని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. అల్లూరి 125 జయంత్యుత్సవాల్లో  పాల్గొనేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 4న భీమవరం విచ్చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం ఆమె పరిశీలించారు. భీమవరంలో మోదీ ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహ అవిష్కరణ ఏర్పాట్లతోపాటు కాళ్ల మండలం పెద అమిరంలో ఆయన పాల్గొనే సభా స్థలి వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీ లించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు, కుల మతాలకతీతంగా అందరం పాల్గొని విజయవంతం చేద్దామని  పిలుపునిచ్చారు. తాను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో కలిసి పాల్గొవడం తనకు తీపిగుర్తుగా మిగిలిపోతుందన్నారు. ఆమెతోపాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు నివాసంలో ఏర్పాట్లపై సమీక్షిం చారు.

నేతల పరిశీలన
కాళ్ళ, జూలై 2 : పెద అమిరంలో ఈ నెల 4న జరిగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభా ఏర్పాట్లను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, కలెక్టరు పి.ప్రశాంతి, జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, గోకరాజు రామరాజు శనివారం పరిశీలించారు. ప్రధాని మోదీ పాల్గొనే సభాస్ధలిలో వేదిక, ప్రజలు కూర్చొనే ప్రాంగణాన్ని చెరుకువాడ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు.  జేసీ జేవీ మురళి, భీమవరం ఆర్డీవో దాసి రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-03T06:48:02+05:30 IST