ఇంతకీ ఎవరెటు

ABN , First Publish Date - 2021-01-11T06:03:20+05:30 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇంతకీ ఎవరెటు

 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా పరిణామాలు 

 కొత్తగా తెరపైకి వైసీపీ అనుకూల అభ్యర్థి ?

రంగంలోకి దిగిన  ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌

  రెండు జిల్లాలల్లో 18 వేలకు చేరిన ఓటర్ల సంఖ్య 


ఏలూరు – ఆంధ్రజ్యోతి : 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికీ కాదు కూడదనుకుంటున్న వైసీపీని ఒప్పించి ఆ పార్టీ మద్దతుతో బరిలోకి దిగాలని ఉపాధ్యాయులు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన సుభాష్‌చంద్రబోస్‌ ఈసారి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతున్నారు. యుటీఎఫ్‌, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌  మద్దతుతో ఇండిపెండెంట్లు ఇంకొందరు బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేనెలలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.  సాధారణంగా ఉపాధ్యాయులు ఆచితూచి ప్రతి ఎన్నికల్లోనూ వ్యవహరిస్తారు. దీనికి తోడు తమ హక్కులను కాపాడేందుకు ఎల్లవేళలా అండగా ఉంటే సీనియర్లకే జై కొడతారు. వారికే తమ మద్దతును వ్యక్తం చేస్తారు. గతంలో రాముసూర్యారావు (ఆర్‌ఎస్‌ఆర్‌) మాస్టారును అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పట్లో ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టారు ప్రత్యర్థి అభ్యర్థులుగా ఉన్నవారంతా ఉపాధ్యాయ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయోగాలు చేశారు. ధనాన్ని వెదజల్లారు. తలుపుకొట్టి మరీ బహుమతులిచ్చారు. అయినా సరే అప్పట్లో నీతి నిజాయితీగా, సమాజ సేవ పట్ల అంకిత భావం కల్గిన ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టారును భారీ మెజార్టీతో  గెలిపించారు. అప్పట్లో వామపక్షాలు పూర్తిగా ఆర్‌ఎస్‌ఆర్‌ పక్షాన నిలిచాయి. మరి ఇప్పుడో...... రాజకీయ రంగు మారింది. పోకడలు అంతకంటే మారాయి. పైపైకి తామంతా యూనియన్లకే కట్టుబడి ఉన్నామని ఎవరంతటికి వారుగానే బహిరంగంగా ప్రకటిస్తున్నా లోలోన ఎటువైపు మొగ్గుచూపుతారనే సందిగ్దత లేకపోలేదు. అయితే ఇప్పటికే ఉపాధ్యాయ సమస్యలపై సుదీర్ఘంగా పోరాటాల్లో పాలు పంచుకున్న షేక్‌ సాబ్జీ ప్రస్తుతానికి రంగంలో ఉన్నారు. ఆయన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి కూడా సాబ్జీ గెలుపుకోసం అన్ని పక్షాల అనుకూలురు అయిన ఉపాధ్యాయులు ఏకతాటిపై నడిచేలా ఇప్పటికే విస్తృత ప్రచారం సాగుతోంది. మరోవైపు  వైసీపీ విధాన మండలిని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఆకోవలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా పార్టీ తరపున బలపరిచేందుకు అభ్యర్థులెవరినీ ఇప్పటిదాకా ఖరారు చేయలేదు. అయితే లోలోపల మాత్రం అనేక ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమీప బంధువు గంధం నారాయణరావు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తూర్పుగోదావరి నుంచి తహతహలాడుతున్నారు. ఈమేరకు ఆయన ఇప్పటికే లోతట్టుగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఒక వేళ వైసీపీ అధిష్ఠానం నారాయణరావు అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నదీ, లేనిదీ మరో వారంలోపే తేలిపోనున్నదని ప్రచారం సాగుతోంది. అయితే అధికార పార్టీ ఈ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఎలాగూ యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ బలమైన అభ్యర్థిగా పేరొందారు. ఆయనతోపాటు ఆయనను ఢీకొనేందుకు ఇండిపెండెంట్‌గా అందరికీ సుపరిచితులైన సుభాష్‌చంద్రబోస్‌ మూడోసారి  కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఎస్టీయూ నుంచి ఆ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి సుబ్బరాజు బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. దీనికి సమాంతరంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్‌ కూడా తన అభ్యర్థిని బరిలోకి పెట్టబోతుందా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం పీఎన్‌వీ ప్రసాదరావు అభ్యర్థిత్వం వైపు ఏపీటీఎఫ్‌ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నుంచి అంబేద్కర్‌ బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఓటర్ల సంఖ్యలో మార్పులు 

ఒకానొకదశలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఉభయగోదావరి జిల్లాల్లో ఓటర్ల సంఖ్య ఒక్కింత తక్కువగానే కన్పించినా ఈ మధ్యన ఆ సంఖ్య పుంజుకుంది. రెండు జిల్లాల మీద కలిపి మొత్తం 18 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఓటర్ల జాబితాకెక్కారు. వీరిలో దాదాపు 7 వేల మంది పశ్చిమకు చెందినవారు. మిగతా వారంతా తూర్పుగోదావరికి చెందిన వారుగా అంచనా కడుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు ప్రభుత్వం కొన్ని వెసులుబాటులు ఇచ్చింది. ఆ మేరకు అర్హత కల్గిన ఉపాధ్యాయులు తమ పేర్లను జాబితాలో నమోదు అయ్యేలా జాగ్రత్తలు పడుతున్నారు. 


Updated Date - 2021-01-11T06:03:20+05:30 IST