ఎలా సాధ్యం?

ABN , First Publish Date - 2022-09-07T06:08:35+05:30 IST

మరో వంద రోజులు.. జగనన్న గృహాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇది.

ఎలా సాధ్యం?
భీమవరం పట్టణ శివారులో పూడికకు నోచుకోని లేఅవుట్‌

జగనన్న గృహాలను పూర్తి చేయడానికి 100 రోజుల గడువు!
రెండేళ్లుగా కానిది స్వల్ప వ్యవధిలో సాధ్యమా..!
జిల్లాకు మంజూరు చేసిన గృహాలు 71,787
ఇప్పటి వరకు పూర్తయినవి– ఏడు వేలు
ఇంకా పూర్తి కావాల్సినవి సుమారు 65 వేలు
ఎక్కడి సమస్యలు అక్కడే.. అధికారులకు అగ్నిపరీక్ష


భీమవరం, సెప్టెంబరు 6 : మరో వంద రోజులు.. జగనన్న గృహాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇది.  డిసెంబరు 25న జిల్లాలో పూర్తి చేసిన అన్ని గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇలా చూస్తే 100 రోజుల సమయం మాత్రమే అధికారులకు ముందు ఉంది. నిర్మాణ వ్యయం పెరిగిపోయి.. ప్రకృతి అను కూలించక కూలీలు దొరక్క.. అష్టకష్టాలతో జిల్లాలో జగనన్న గృహనిర్మాణం సాగుతోంది. ప్రస్తుతానికి 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నవంబరు 30 నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశాలొచ్చాయి. రెండేళ్లుగా సాగని పనులు ఈ వంద రోజు ల్లో ఏ మేరకు పూర్తి చేయగలమనేది అధికారులను వేధిస్తోంది. జిల్లాకు మంజూరు చేసిన గృహాల సంఖ్య 71,787. వీటిని 19 మండలాలతో పాటు 6 మునిసిపాలిటీల్లో వీటిని నిర్మిస్తున్నా రు. ఇందులో ప్రభుత్వం మంజూరు చేసిన లేఅవుట్లులో 51,761 గృహాలు నిర్మించాల్సి ఉంది.  సొంత స్థలాల్లో 20,026 గృహాలు నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది మే నెల నాటికి సుమారు ఏడు వేల గృహాల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య తొమ్మిది వేలు దాటింది.

 డిసెంబరు 25న సీఎం ప్రారంభిస్తారట..!
వచ్చే డిసెంబరు 25న సీఎం జగన్‌ జిల్లాలో గృహ నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఎంపిక చేసిన మూడు జిల్లాల్లో డిసెంబరు 25, 26, 27 తేదీల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని గతవారం కలెక్టర్‌ ప్రశాంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం జిల్లాలో వివిధ దశల్లో వేలాది గృహాలు నిర్మాణానికి నోచుకొక పెండింగ్‌లో నడుస్తున్నాయి. నిధులు కొరత లేదని బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వివిధ దశలలో ఉన్న పనులు వేగం చేయించడానికి అధికారులు ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్న అప్పటికీ అంతంత మాత్రంగానే నిర్మాణాలు సాగుతున్నాయి. మరి వంద రోజుల్లో జిల్లాలో 60 వేలు పైగా గృహాలు ఏవిధంగా పూర్తవుతాయో వేచి చూడాలి. 

Updated Date - 2022-09-07T06:08:35+05:30 IST