పింఛన్‌ ఇప్పించడమ్మా..

ABN , First Publish Date - 2022-05-17T05:31:52+05:30 IST

స్పందనలో ప్రజల నుంచి అందే ప్రతీ దరఖాస్తు నిర్ణీత సమయంలో, త్వరితగతిన పరిష్క రించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్ర శాంతి అధికారులను ఆదేశించారు.

పింఛన్‌ ఇప్పించడమ్మా..

కలెక్టర్‌కు వృద్ధ మహిళల వేడుకోలు..
స్పందనలో 89 వినతుల స్వీకరణ


భీమవరం, మే 16 : స్పందనలో ప్రజల నుంచి అందే ప్రతీ దరఖాస్తు నిర్ణీత సమయంలో, త్వరితగతిన పరిష్క రించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్ర శాంతి అధికారులను ఆదేశించారు. సోమవారంకలెక్టరేట్‌ లో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో 89 అర్జీలు స్వీకరించారు. జేసీ జేవీ మురళి, డీఆర్వో కె.కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మనవడు ఇంటి నుంచి గెంటేశాడు..
నా భర్త గతంలోనే చనిపోయారు. వ్యవసాయశాఖలో వాచ్‌మెన్‌గా పనిచేసిన కుమారుడు      బాబురావు 2020లో కరోనాతో చనిపోయాడు. అతనికి వచ్చే పింఛనుతో మా కుటుంబమంతా బతికేది. ఇప్పుడు నా మనవడు రవితేజ పింఛన్‌ సొమ్ము తీసుకుంటూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. భీమవరంలోని కుమార్తె వద్ద తలదాచుకున్నా. నాకు పింఛను ఇచ్చి ఆధారం కల్పించండి’.. అంటూ తాడేపల్లిగూడెంకు చెందిన రాచూరు వెంకట రమణమ్మ(80) కలెక్టర్‌ను కోరింది.

అమ్మా.. రెండేళ్లుగా పింఛను లేదు..
‘అమ్మా..! నా భర్త చనిపోయి రెండేళ్లు అయింది.. నాకు ఇద్దరు సంతానం. అందులో ఒక కుమారుడికి మాటలు రావు. నాకు, నా కుమారుడికి పెన్షన్‌ రావడం లేదు. వృద్ధాప్యంలో ఉన్నాను. పేదరికంతో పోషణ భారంగా మారింది.. పింఛన్‌ ఇప్పించడమ్మా’ అంటూ భీమవరం అర్బన్‌ 10వ వార్డుకు చెందిన పోతుల లక్ష్మి (75) కలెక్టర్‌ ఎదుట కన్నీటి పర్యంతమయింది. సోమవారం మధ్యాహ్నం స్పందనలో వినతులు స్వీకరించి భోజనానికి వెళుతున్న కలెక్టర్‌కు ఆమె చేతులు జోడించి ఎదురు వచ్చింది. మండుటెండలో ఒళ్లంతా చెమటలతో వచ్చిన ఆమెను చూసిన కలెక్టర్‌ వాహనం దిగి మాట్లాడి విషయం తెలుసుకుని తక్షణం స్పందించారు. ఆమెకు పింఛన్‌ మంజూరు చేసి నివేదిక అందజేయాలంటూ సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ జిల్లా     కోఆర్టినేటర్‌ను ఆదేశించారు.

ఎస్పీ స్పందనలో 14 ఫిర్యాదులు
భీమవరం క్రైం, మే 16 : వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ సోమవారం నిర్వహించిన స్పందనలో 14 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

Updated Date - 2022-05-17T05:31:52+05:30 IST