వసతులేవీ?

ABN , First Publish Date - 2022-06-27T06:07:11+05:30 IST

పట్టణ పేదల కలల సౌధం ఏపీ టిడ్కో ఫ్లాట్‌లను స్వాధీనం చేస్తామని ఇప్పటికే ప్రభు త్వం పలుమార్లు ప్రకటించింది.

వసతులేవీ?
గూడెంలో నిర్మాణ దశలోనే సీవేజ్‌ ప్లాంట్‌

టిడ్కో గృహ సముదాయాల్లో సమస్యల తిష్ఠ
పూర్తికాని మౌలిక వసతుల కల్పన
రేపటి నుంచి మూడు రోజుల పాటు ఫ్లాట్లు పంపిణీకి  ఏర్పాట్లు


పట్టణ పేదల కలల సౌధం ఏపీ టిడ్కో ఫ్లాట్‌లను స్వాధీనం చేస్తామని ఇప్పటికే ప్రభు త్వం పలుమార్లు ప్రకటించింది. ఈనెల 15 నుంచే లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. తదుపరి వాయిదా వేసి ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు అందజేస్తున్నట్టు ఖరారు చేశారు. అయితే ఈ ఫ్లాట్లకు అన్ని   మౌలిక వసతులు కల్పించే కార్యక్రమం మాత్రం ఇంకా పూర్తికా లేదు. కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. వసతుల కల్పన అసాధ్యం. ప్రస్తుతానికి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో ఫేజ్‌–1లో 6048 ఫ్లాట్లు ఉండగా అందులో రూపాయికి అందిస్తున్నవి 1152 ఉన్నాయి. వీటి పంపిణీని రెండేళ్లుగా ఊరిస్తూనే వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు పంపిణీ చేస్తామని చెబుతున్నా మౌలిక వసతులు కల్పించకుండా కేవలం పార్టీ రంగులు వేసి అంతా సిద్ధమంటూ ప్రచారంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 భీమవరంలో సా..గుతున్న పనులు
భీమవరం : భీమవరంలో పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన ప్రక్రియ ఇంకా సా..గుతూనే ఉంది. తొలుత 2332 ప్లాట్లు పంపిణీ చేస్తామన్నా రు. కానీ ఇప్పుడు 1920 ఫ్లాట్లను లబ్ధిదారు లకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో 300 చదరపు అడుగులవి 512 , 365 చదరపు అడుగులవి 960, 430 చదరపు అడుగులు కలిగినవి 448 ఉన్నాయి. వీటికి సంబంధించి డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణం పూర్తి కాగా సీవేజ్‌ ప్లాంట్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి లేకుండా నివాసాల నుంచి మురుగు నీరు వదిలితే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ పనులను ఇటీ వల కలెక్టర్‌ పరిశీలించారు. వేగంగా పూర్తి చేయాలని ఆదేశిం చినా ఇంకా పూర్తి కాలేదు.  గదులకు విద్యుద్దీకరణ పనులు పూర్తి కాలేదు. నీటి ట్యాంక్‌ నిర్మాణం పూర్తయినా పైపులైన్‌  పనులు సాగుతున్నాయి. వీటిపైన కూడా ఆందోళన వ్యక్తమవు తోంది. తాడేరు రోడ్డు నుంచి కాలనీ వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసినా అంతర్గతంగా కొన్ని రోడ్లు నిర్మాణం చేపట్టాలి.

 వసతులు లేకుండా ఇళ్లిస్తారట
పాలకొల్లు అర్బన్‌ :  పాలకొల్లు పట్టణంలో ఇళ్లు లేనివారికి సొంత గృహాలు కల్పించాలని గత టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. పట్టణ శివారు ప్రాంతంలో పెంకుళ్ళపాడు ప్రాంతంలో టిడ్కో గృహాలు సుమారు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ గృహాల నిర్మాణాలు ఆగిపోయాయి. తిరిగి గత ఏడాది కాలం నుంచి గృహాలకు వైసీపీ రంగులు వేసి లబ్ధిదారులకు అందించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడ్కో గృహాల సము దాయంలో రహదారులు, తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, మురుగు నీరు పారుదల వంటి మౌలిక వసతు లు కల్పించాల్సి ఉంది. మౌలిక వసతులు లేకుండా తాము ఇళ్లల్లోకి ఏ విధంగా వెళ్లగలమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
 
తిష్ఠ వేసిన సమస్యలు
తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూ డెంలో ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు  టిడ్కో అధికారులు సిద్ధమవుతు న్నారు. గూడెంలో మొత్తం 5,376 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మొదటి విడతగా 2,200 మంది లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. అయితే టిడ్కో ఇళ్ల సముదాయంలో సమ స్యలు తిష్ఠ వేశాయి. మురుగు నీరు వ్యవస్థ బయట కు పంపేందుకు అంతర్గత డ్రెయినేజీ లేదు. ప్రధాన డ్రెయిన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.6 కోట్లు విడుదల చేసినా ఆ పని మొదలు కాలేదు. ఫ్లాట్ల మధ్యలో తుప్పలు పేరుకుపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇక్కడ మంచినీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. మరుగుదొడ్ల వేస్ట్‌ వాటర్‌ను రీ సైకిల్‌ చేసేందుకు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఎస్‌టీపీ) నేటికీ నిర్మాణ దశలోనే ఉంది. అధికారులు మాత్రం ఆ ప్లాంట్‌కు ప్రత్యామ్నాయంగా సెప్టిక్‌ ట్యాంకు ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది మరో సమస్యగా మారనుంది. ఇప్పటికీ వీధి లైట్ల ఏర్పాటు ఊసే లేదు.

Updated Date - 2022-06-27T06:07:11+05:30 IST